మున్సి‘పోల్స్‌'కు సర్వం సిద్ధం

రేపు పోలింగ్‌ నిర్వహణకు 107 కేంద్రాలు ప్రతి మున్సిపాలిటీలో ఐదేసి రూట్లు, జోన్లు 648 మంది పోలింగ్‌ అధికారులు, సిబ్బంది నేడు పోలింగ్‌ కేంద్రాలకు బ్యాలెట్‌ బాక్సులు 25 వ తేదీన వార్డుకో టేబుల్‌పై ఓట్ల లెక్కింపు సాయంత్రం 4 వరకు ఫలితాల వెల్లడికి అవకాశం ‘నమస్తేతెలంగాణ’తో కలెక్టర్‌ హరిత వరంగల్‌ రూరల్‌ జిల్లా ప్రతినిధి- నమస్తే తెలంగాణ : జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ కోసం సర్వం సిద్ధం చేశాం. మూడు పురపాలక సంఘాల పరిధిలో రూట్లు, జోన్లను గుర్తించాం. 648 మంది పోలింగ్‌ అధికారులు, సిబ్బంది నియామకం జరిగింది. పోలింగ్‌ నిర్వహణపై వీరికి దశలవారీగా శిక్షణ ఇవ్వడం పూర్తయింది. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో వన్‌ ఫ్లస్‌ ఫోర్‌ లెక్కన మొత్తం ఐదుగురు విధులు నిర్వర్తిస్తారు. వీరందరూ మంగళవారం ఉదయం రిపోర్టు చేస్తారు. సాయంత్రం ఆయా మున్సిపాలిటీల పరిధిలోని పంపిణీ కేంద్రం నుంచి బ్యాలెట్‌ బాక్సులు, పేపర్‌, ఇతర సామగ్రితో పోలింగ్‌ స్టేషన్లకు చేరుకుంటారు. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్‌ ముగిసిన తర్వాత ఎన్నికల అధికారులు, సిబ్బంది బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌ రూంలకు తరలిస్తారు. ఎన్నికల అధికారులు, సిబ్బంది కోసం 44 వాహనాలు సమకూర్చాం. పోలింగ్‌ సరళిని వీక్షించేందుకు 36 పోలింగ్‌ కేంద్రాల్లో లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేశాం. 21 లొకేషన్లలో మైక్రో అబ్జర్వర్లు పనిచేస్తారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేశామని జిల్లా కలెక్టర్‌ ఎం హరిత వెల్లడించారు. బుధవారం మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో ఆమె ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధితో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణపై కలెక్టర్‌ హరిత ఏమన్నారంటే ఆమె మాటల్లో. 107 పోలింగ్‌ కేంద్రాలు.. జిల్లాలో మూడు మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్య 58. నర్సంపేటలో 24, పరకాలలో 22, వర్ధన్నపేటలో 12 వార్డులు ఉన్నాయి. ఈ మూడింటి పరిధిలో 62,270 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 32,158, పురుషులు 30,112 మంది. 58 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు 37 లొకేషన్లలో 107 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. వీటిలో నర్సంపేటలో 48, పరకాలలో 44, వర్ధన్నపేటలో 15 ఉన్నాయి. నర్సంపేట, పరకాలలో ఒక లొకేషన్లలో 2 పోలింగ్‌ కేంద్రాలు పనిచేస్తాయి. మూడు మున్సిపాలిటీల్లో 190 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నర్సంపేటలో అత్యధికంగా 110 మంది, పరకాలలో 30, వర్ధన్నపేటలో 50 మంది పోటీలో ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో ఐదేసి రూట్లు, ఐదేసి జోన్లు గుర్తించాం. పోల్‌ చీటీల పంపిణీ పూర్తయింది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎన్నికల సంఘం ప్రకటించిన 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి కచ్చితంగా పోలింగ్‌ కేంద్రంలోని అధికారులు, సిబ్బందికి గాని చూపాలి. ఆయా మున్సిపాలిటీల పరిధిలో పోలింగ్‌ రోజున ప్రభుత్వ సెలవు ప్రకటించాం. మున్సిపాలిటీ ఓటరై ఇతర ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు, ఇతరులకూ సెలవు కోసం ఆదేశాలు జారీ చేశాం. ప్రత్యేక బృందాల ఏర్పాటు.. పురపాలక ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాం. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ఒక్కో ఎంసీసీ టీం ఏర్పాటు చేశాం. నర్సంపేటలో ఆరుగురు, పరకాలలో నలుగురు, వర్ధన్నపేటలో ముగ్గురు చొప్పున జోనల్‌ అధికారులను నియమించాం. నర్సంపేటలో 3, పరకాలలో 8, వర్దన్నపేటలో 3 ఎస్‌ఎస్‌టీ బృందాలు పనిచేస్తున్నాయి. నర్సంపేటలో 3, పరకాలలో 2, వర్ధన్నపేటలో 3 ఎఫ్‌ఎస్‌టీ, మూడు మున్సిపాలిటీల్లోనూ రెండేసి అకౌంటింగ్‌ టీంల నియామకం జరిగింది. ప్రతి మున్సిపాలిటీలో ఒక్కో వీడియో సర్వెల్లెన్స్‌ టీం కూడా ఏర్పాటు చేశాం. ప్రస్తుతం ఆయా పురపాలక సంఘాల పరిధిలో ఈ బృందాలు పనిచేస్తున్నాయి. పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ మూడు మున్సిపాలిటీల పరిధిలో పోలింగ్‌ నిర్వహణ కోసం మొత్తం 648 మందిని నియమించాం. వీరిలో ప్రిసైడింగ్‌ అధికారు(పీవో)లు 129, అసిస్టెంటు ప్రిసైడింగ్‌ అధికారు(ఏపీవో)లు 129, ఇతర పోలింగ్‌ అధికారు(ఓపీవో)లు 390 మంది ఉన్నారు. నర్సంపేటలో పీవోలు 58, ఏపీవోలు 58, ఓపీవోలు 174 మంది పోలింగ్‌ విధులు నిర్వర్తిస్తారు. పరకాలలో పీవోలు 53, ఏపీవోలు 53, ఓపీవోలు 162 మంది పనిచేస్తారు. వర్ధన్నపేటలో పీవోలు 18, ఏపీవోలు 18, ఓపీవోలు 54 మంది విధుల్లో పాల్గొంటారు. మూడు పురపాలక సంఘాల పరిధిలో ఈ పోలింగ్‌ అధికారులు, సిబ్బందికి పోలింగ్‌ నిర్వహణపై ఈ నెల 17, 18 తేదీల్లో మొదటి, రెండో విడత శిక్షణ ఇచ్చాం. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారు(ఆర్‌వో)లు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారు(ఏఆర్‌వో)లు పనిచేస్తున్నారు. నర్సంపేటలో ఆర్‌వోలు 8, ఏఆర్‌వోలు 8 మంది, పరకాలలో ఆర్‌వోలు ఏడుగురు, ఏఆర్‌వోలు ఏడుగురు, వర్దన్నపేటలో ఆర్‌వోలు, ఏఆర్‌వోలు నలుగురేసి విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికితోడు నర్సంపేట, పరకాలలో ఒక్కొకరు, వర్ధన్నపేటలో ఇద్దరు రిజర్వ్‌లో ఉన్నారు. సమస్యాత్మకమైనవి గుర్తింపు సమస్యాత్మకమైన పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు జరిగింది. వీటిలో 33 ఉన్నాయి. సెన్సిటివ్‌ 18, హైపర్‌ సెన్సిటివ్‌ 9, క్రిటికల్‌ 6 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించి అవసరమైన చర్యలు తీసుకున్నాం. సెన్సిటివ్‌ పోలింగ్‌ కేంద్రాల్లో నర్సంపేటలో 5, పరకాలలో 13, హైపర్‌ సెన్సిటివ్‌ పోలింగ్‌ కేంద్రాల్లో నర్సంపేటలో 4, పరకాలలో 5 ఉండగా వర్ధన్నపేటలో క్రిటికల్‌ పోలింగ్‌ స్టేషన్స్‌ 6 ఉన్నాయి. ప్రతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రంలో ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు, నార్మల్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద ఒక పోలీసు కానిస్టేబుల్‌ బందోబస్తు నిర్వహిస్తారు. నర్సంపేటలో 10, పరకాలలో 9, వర్ధన్నపేటలో 6 పోలింగ్‌ కేంద్రాల్లో లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేసి కలెక్టరేట్‌కు అనుసంధానం చేస్తాం. తద్వారా ఈ 36 కేంద్రాల్లో లైవ్‌ ద్వారా కలెక్టరేట్‌ నుంచి పోలింగ్‌ సరళిని వీక్షించవచ్చు. అలాగే నర్సంపేటలోని 6, పరకాలలోని 12, వర్దన్నపేటలోని 3 లొకేషన్లలో మొత్తం 24 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. రెండు రౌండ్లలో లెక్కింపు బ్యాలెట్‌ పద్ధతిన బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్‌ కేంద్రంలోకి వచ్చిన ఓటర్లకు టోకెన్‌ నంబర్లు ఇచ్చి ఓటు వేసేందుకు వారందరికీ అవకాశం కల్పిస్తాం. తెలుపు రంగు బ్యాలెట్‌ పేపర్‌ వచ్చేసింది. మూడు మున్సిపాలిటీల పరిధిలో పోలింగ్‌ నిర్వహణకు 100 బ్యాలెట్‌ బాక్సులు అవసరం. ప్రస్తుతం 241 బ్యాలెట్‌ పెట్టెలు అందుబాటులో ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల పరిధిలో బుధవారం పోలింగ్‌ ముగిసిన వెంటనే స్థానిక స్ట్రాంగ్‌ రూంకు బ్యాలెట్‌ బాక్సులు చేరుతాయి. 25న ఓట్ల లెక్కింపు జరుగనుంది. కౌంటింగ్‌ కోసం ప్రత్యేకంగా అధికారులు, సిబ్బంది నియామకం జరిగింది. ప్రతి మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు కేంద్రంలో రెండు హాళ్లలో కౌంటింగ్‌కు నిర్ణయించాం. ఒక్కో వార్డు ఓట్ల లెక్కింపు ఒక్కో టేబుల్‌పై మొత్తం రెండు రౌండ్లలో కొనసాగనుంది. సాయంత్రం 4 గంటల వరకు ఫలితాలు వెలువడవచ్చు.

Related Stories:

More