ఇంటింటికీ గులాబీసేన

- జిల్లాలో హోరెత్తిన మున్సి‘పోల్స్‌' ప్రచారం -నర్సంపేటలో మంత్రి సత్యవతిరాథోడ్‌ పర్యటన -ఎమ్మెల్యే, ఎంపీ కవితతో కలిసి విపక్షాలపై ఫైర్‌ - అభివృద్ధికి పెద్ది రూ.200 కోట్లు తెచ్చినట్లు వెల్లడి - ఈ పుర ఎన్నికలు రెఫరెండమ్‌ అని పేర్కొన్న సుదర్శన్‌రెడ్డి - పరకాలలో జోరుగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి క్యాంపెయిన్‌ - వర్ధన్నపేటలో ఎమ్మెల్యేలు అరూరి రమేశ్‌, తాటికొండ రాజయ్య -చివరగా నేడు రోడ్‌షోలకు టీఆర్‌ఎస్‌ నిర్ణయం - వర్ధన్నపేట రోడ్‌షోలో పాల్గొననున్న ఎర్రబెల్లి వరంగల్‌ రూరల్‌ జిల్లా ప్రతినిధి- నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి గడువు ఒకే ఒకరోజు మిగిలి ఉంది. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు తెరపడనుంది. బరిలో నిలిచిన అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచార సామగ్రిని అటకెక్కిస్తారు. కొద్ది రోజుల నుంచి ప్రచారంలో వాడిన పార్టీ జెండాలు, కండువాలను పక్కన పడేస్తారు. ఓటర్ల మద్దతు కోసం చివరి ప్రయత్నం మొదలు పెడుతారు. అభ్యర్థులందరు ఆదివారం ఎన్నికల ప్రచారంలో పోటీపడ్డారు. తమను గెలిపించాలని ప్రజలను కోరుతూ గల్లీ గల్లీలో ర్యాలీలు నిర్వహించారు. సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం కోసం హామీలు గుప్పించారు. వివిధ రాజకీయ పార్టీల ముఖ్య ప్రజాప్రతినిధులు, నేతలు తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధానంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు గులాబీ జెండా, కండువాలతో ఇంటింటికి వెళ్లి స్వయంగా ఓటర్లను కలిశాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, మున్సిపల్‌ శాఖ మంత్రి కే తారకరామారావు నేతృత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. పట్టణాల సమగ్ర అభివృద్ధికి ప్రతి మున్సిపాలిటీకి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఆసరా పథకం, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, కేసీఆర్‌ కిట్‌, కంటి వెలుగు, అమ్మ ఒడి, బస్తీ దావఖానలు, కుల వృత్తులకు ప్రోత్సాహం, 24 గంటల ఉచిత కరంటు, రైతు బంధు, రైతు బీమా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పరిపాలన సంస్కరణలు తదితర పథకాలతో పట్టణ ప్రజలు ప్రయోజనం పొందుతున్నట్లు గులాబీ శ్రేణులు ఓటర్లకు వివరించారు. ఆసరా పథకం ద్వారా నెలనెల పింఛన్‌ దివ్యాంగులకు రూ.3,016, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత, బీడీ కార్మికులు, ఇతరులకు రూ.2,016 లెక్కన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందజేస్తున్నట్లు చెప్పారు. పట్టణాల అభివృద్ధికి కొత్త మున్సిపల్‌ చట్టాన్ని రూపొందించడం జరిగిందని, ఈ నూతన చట్టం ద్వారా పట్టణ ప్రజలకు చాలా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. పట్టణాల్లో 75 గజాల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునే వారు అనుమతి పొందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం కొత్త చట్టంలో పొందు పరిచినట్లు ఇంటింటి ప్రచారంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఓటర్ల దృష్టికి తెచ్చారు. పట్టణాల అభివృద్ధికి అధికారంలో ఉన్న పార్టీకి ఓటు వేస్తేనే సాధ్యమని, ఈ నేపథ్యంలో కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నర్సంపేటలో ప్రచార హోరు.. రాజకీయంగా ఆసక్తి రేపుతున్న నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారం హోరెత్తిపోయింది. రాష్ట్ర గిరిజన, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌, మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత ఆదివారం ఇక్కడ పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి నర్సంపేట పురపాలక సంఘం పరిధిలోని వివిధ వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారం రథం నుంచి, మీడియా సమావేశంలో మాట్లాడారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి శాసనసభకు ఎన్నికైన తర్వాత నర్సంపేట పట్టణ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి రూ.200 కోట్లు తెచ్చినట్లు మంత్రి సత్యవతిరాథోడ్‌ చెప్పారు. వీటిలో ఇప్పటివరకు రూ.20 కోట్లు మాత్రమే ఖర్చుకాగా ఇంకా రూ.180 కోట్లతో పనులు చేపట్టాల్సి ఉందని తెలిపారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ వద్ద ఎమ్మెల్యే పెద్దికి ఉన్న చొరవతోనే ఇంత పెద్ద మొత్తంలో నర్సంపేటకు నిధులకు వచ్చాయని అన్నారు. 2020 ఆఖరు వరకు నర్సంపేట అద్భుతమైన అభివృద్ధి సాధించి రాష్ట్రంలో అగ్రగామి కానుందని మంత్రి పేర్కొన్నారు. కాలగర్భంలో కలిసిన పార్టీలకు ఓటు వేసి వృథా చేసుకోకుండా కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ది సాధించుకోవాలని ఆమె ప్రజలను కోరారు. ఎంపీ కవిత మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అమల్లోకి తెచ్చిన సంక్షేమ పథకాలు, స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి పనులు చూసి కారు గుర్తుకు ఓటు వేయడానికి నర్సంపేట ప్రజలు సిద్ధమైనట్లు తెలిపారు. నర్సంపేటకు మోడల్‌ మార్కెట్‌, రూ.5 కోట్లతో ఏసీ ఫంక్షన్‌ హాల్‌, 250 పడకల దవాఖాన పనులు ప్రారంభం కానున్నాయని ఆమె చెప్పారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాలకు జెండా తప్ప ఎజెండా లేదని, వారి జెండా కోసం ప్రజలు ఐదేళ్లు వృథా చేసుకునే పరిస్థితిలో లేరని అన్నారు. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు రిటైర్‌ అయ్యే ఎన్నికలు ఇవని ఆయన అభివర్ణించారు. తమ చిత్తశుద్ధి, విజన్‌కు, గత పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండమని పెద్ది వెల్లడించారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం చివరి రోజు సోమవారం నర్సంపేట పట్టణం నెక్కొండ రోడ్డులోని రెడ్డి ఫంక్షన్‌ హాల్‌ నుంచి పాకాల సెంటర్‌ వరకు భారీ రోడ్‌షో నిర్వహించేందుకు టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఉదయం 11 గంటలకు ఇది ప్రారంభం కానుంది. ఎమ్మెల్యేల ప్రచార జోరు పరకాల, వర్ధన్నపేట పురపాలక సంఘాల పరిధిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో కలిసి ఎమ్మెల్యేలు ప్రచారంలో పాల్గొన్నారు. ఉదయం నుంచి పరకాలలోని వివిధ వార్డుల్లో స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నేరుగా ఓటర్లను కలిసి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, ఎమ్మెల్యేగా తాను పరకాల పట్టణ అభివృద్ధికి చేసిన పనులను వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి బాధ్యత తనదేనని అన్నారు. ఇక్కడ ఏకగ్రీవ ఎన్నిక జరిగిన 11 వార్డులను పక్కనపెడితే ఎన్నికలు జరిగే ఇతర 11 వార్డుల్లో నూటికి నూరు శాతం టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ స్థానిక నేతలు, ఎన్నికల ఇన్‌చార్జిలతో వేరువేరుగా సమావేశమై వ్యూహ రచన చేశారు. టీఆర్‌ఎస్‌ నేతలు నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావు, బండి సారంగపాణి, సోదా రామకృష్ణ, బొజ్జం రమేశ్‌, గురిజపల్లి ప్రకాశ్‌రావు, చింతిరెడ్డి సాంబరెడ్డి, చిలువేరు మొగిలి, అశోక్‌, రాజభద్రయ్య తదితరులు ఎమ్మెల్యే చల్లా వెంట ఉన్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వివిధ వార్డుల్లో పర్యటించి స్వయంగా ఓటర్లను కలిశారు. ఆయనకు ఓటర్లు అపూర్వ స్వాగతం పలికారు. కొన్ని తండాల్లో తాము కారు గుర్తుకే ఓటు వేస్తామని అరూరి సమక్షంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. సాయంత్రం ఇక్కడ స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల ఇన్‌చార్జిలు మర్రి యాదవరెడ్డి, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి టీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి ఇక్కడ ప్రచారం నిర్వహించారు. ప్రచారం చివరి రోజు సోమవారం ఉదయం వర్ధన్నపేటలో రోడ్‌షో నిర్వహించేందుకు టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధ్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ రోడ్‌షోలో పాల్గొంటారు.

Related Stories:

More