నేటితో సమారం సమాప్తం

- వారం రోజులుగా ఉధృతంగా క్యాంపెయిన్‌ - ఇంటింటికీ తిరుగుతూ ఓట్ల అభ్యర్థన - అభివృద్ధి, సంక్షేమ పథకాలు వివరిస్తూ అభ్యర్థులు - ప్రజాప్రతినిధుల ప్రచార జోరు - అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా వ్యూహ, ప్రతివ్యూహాలు మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. సోమవారం సాయంత్రం 5 గంటలకు పరిసమాప్తం కానుండటంతో అభ్యర్థులు, నాయకులు ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. నామినేషన్‌ ఉప సంహరణ నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు గడప గడపకూ తిరుగుతున్నారు. టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సర్కారు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు వివరిస్తూ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. విప్‌, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం అవుతుండగా.. సోమవారం ప్రచారం సమాప్తం కానుంది. వరుస ఎన్నికల నేపథ్యంలో ఇవి దాదాపు చివరి ఎన్నికలు కావడంతో బల్దియాల్లో సందడి నెలకొంది. బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచగా, వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా ప్రచారం.. మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల నుంచే అభ్యర్థులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రచారం చేస్తున్నారు. నేతలు, ప్రజాప్రతినిధులు, ద్వితీయశ్రేణి నాయకులు కూడా భాగస్వాములు అవుతున్నారు. టీబీజీకేఎస్‌, టీఆర్‌ఎస్వీ నేతలు విరివిరిగా ప్రచారాల్లో పాల్గొంటున్నారు. టీఆర్‌ఎస్‌కు భారీ సంఖ్యలో చేరికలు కూడా కలిసొస్తున్నాయి. కొన్ని వార్డుల్లో పోటీ నువ్వా? నేనా? అన్నట్లు ఉంది. మరికొన్ని చోట్ల ముగ్గురి మధ్య ఉంది. అయినా ఎట్టి పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ అన్ని మున్సిపాలిటీల్లో జయకేతనం ఎగరేస్తుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. కాగా.. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారాలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. అన్ని మున్సిపాలిటీలను క్లీన్‌స్వీప్‌ చేయాలనే కేసీఆర్‌ ఆలోచనల మేరకు పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగుతున్నారు. జిల్లాలో ఏకగ్రీవమైన ఎనిమిది కూడా టీఆర్‌ఎస్‌వే కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపుతున్నాయి. పోరులో ఉన్న అభ్యర్థులు అంతా అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా తమ ప్రచారం సాగిస్తున్నారు. వాహనాలకు మైకులు కట్టి ప్రచారం చేయడంతోపాటు టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, వాట్సప్‌, ఫేస్‌బుక్‌ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. రంగంలోకి ముఖ్యనేతలు.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరఫున ప్రజాప్రతినిధులు, నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ తన నియోజకవర్గంలోని చెన్నూరు, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల్లో ప్రచారం నిర్వహించారు. జిల్లాలో ఏకగ్రీవమైన ఎనిమిదిలో ఏడు కేవలం చెన్నూరు మున్సిపాలిటీవే కావడం గమనార్హం. ఆయనతోపాటు ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్‌ కూడా ప్రచారంలో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రా వు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆయా మున్సిపాలిటీల్లో భారీగా ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొనడమే కాకుండా, ఇతర నేతలను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్సీ, పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి నారదాసు లక్ష్మణ్‌రావు, మరో ఇన్‌చార్జి మూల విజయారెడ్డి, మాజీ ఎ మ్మెల్యే అరవింద్‌రెడ్డి తదితరులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నా రు. అభ్యర్థులు, ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు, ద్వితీయ శ్రేణి నాయకత్వం మొత్తం ప్రచారంలో భాగస్వాములు అవుతున్నారు. సంక్షేమ పథకాలపై ప్రచారం చేస్తూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ప్రచార సమయం చాలా తక్కువగా ఉన్నప్పటికీ ప్రణాళికాబద్ధంగా ముందుకు కదులుతున్నారు. మిగతా పార్టీల్లో కనిపించని జోరు.. ఆరు మున్సిపాలిటీల్లో ఎక్కడా కూడా మిగతా పార్టీల ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు ఒకటి, రెండు చోట్ల పోటీ ఇస్తున్నప్పటికీ వారికంటే స్వతంత్రులు బలంగా ఉన్నారంటే ఆ పార్టీల పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ తరఫున కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఒక రోజు ప్రచారం నిర్వహించినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ పార్టీల నేతలు అసంతృప్తులను బుజ్జగించడంలోనే సరిపోయింది. ఈ నేపథ్యంలో వారికి కనీసం ప్రజల్లోకి వెళ్లే సమయం కూడా లేకుండా పోయింది. ఇక కాంగ్రెస్‌ పార్టీకి జిల్లాలో పెద్ద దిక్కు లేకుండా పోయింది. మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు మినహా జిల్లాలో ఎక్కడా సరైన నేత లేకపోవడంతో వారి పరిస్థితి దారుణంగా తయారయ్యింది. ఆయన కూడా ప్రచారంలో ఎక్కడా పెద్దగా కనిపించలేదు. ఇక జాతీయ పార్టీ అయిన సీపీఐ ఒకటి, రెండు చోట్లకు పరిమితం అయ్యింది.
More