రేపటితో ఆఖరు

-ముగింపు దశకు మున్సి‘పోల్స్‌' ప్రచారం -పురపాలికల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న టీఆర్‌ఎస్‌ -నర్సంపేట, పరకాలలో మంత్రి ఎర్రబెల్లి పర్యటన -ఎమ్మెల్యేలు పెద్ది, చల్లాతో కలిసి క్యాంపెయిన్‌ -అభివృద్ధికి ఓటేయాలని కోరిన దయాకర్‌రావు -9 మున్సిపాలిటీలను గెలుచుకుంటామని వెల్లడి - ఏకగ్రీవాలతో గుర్తింపు పొందారని చల్లాకు ప్రశంస -వర్ధన్నపేటలో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ వరంగల్‌ రూరల్‌ జిల్లా ప్రతినిధి- నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరింది. కొద్ది రోజుల నుంచి ఆయా మున్సిపాలిటీల పరిధిలో కొనసాగుతున్న ప్రచారానికి సోమవారం సాయంత్రం ఐదు గంటలకు తెరపడనుంది. ఈ నేపథ్యంలో శనివారం జిల్లాలోని పురపాలక సంఘాల పరిధిలో ఎన్నికల ప్రచారం హోరెత్తిపోయింది. బరిలో నిలిచిన అభ్యర్థులు ఇంటింటి ప్రచారంలో పోటీపడ్డారు. ఓటర్లను కలిసేందుకు తెల్లవారుజాము నుంచే రంగంలోకి దిగారు. నిద్రలో ఉన్న ఓటర్లను సైతం కొందరు అభ్యర్థులు లేపి తమకు ఓటు వేయాలని కోరారు. తమ పార్టీ శ్రేణులు, అనుచరులతో కలిసి గల్లీ గల్లీలో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జిల్లాలో పర్యటించారు. నర్సంపేట, పరకాల మున్సిపాలిటీల పరిధిలో స్థానిక ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోబోతుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తేనే పురపాలికల్లో అభివృద్ధి జరుగుతుందని ఆయన ఓటర్లకు చెప్పారు. కాంగ్రెస్‌ వల్ల ఏడాది నుంచి మున్సిపాలిటీల్లో అభివృద్ధి కుంటుపడిందని మంత్రి ధ్వజమెత్తారు. గత పాలకవర్గాల పదవి కాలం ముగిసిన వెంటనే పురపాలక ఎన్నికలు నిర్వహించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సిద్ధమైతే.. కాంగ్రెస్‌ పార్టీ కోర్టును ఆశ్రయించి మున్సిపల్‌ ఎన్నికల వాయిదాకు కారణమైందని ఎర్రబెల్లి విరుచుకుపడ్డారు. పాలకవర్గం లేకపోవడం వల్ల ఆయా మున్సిపాలిటీల పరిధిలో పారిశుధ్యం లోపించిందని, అభివృద్ధి పనులు ప్రభుత్వం ఆశించిన రీతిలో ముందుకు సాగలేదని అన్నారు. ఇప్పటికే వివిధ అభివృద్ధి పనుల కోసం ప్రతి మున్సిపాలిటీకి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని, కొత్త మున్సిపల్‌ చట్టాన్ని అమల్లోకి తెచ్చి పురపాలికల పాలకవర్గాలకు అధికారాలు కల్పించిందని దయాకర్‌రావు తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ టీఆర్‌ఎస్‌ కావటం వల్ల ఇతర పార్టీల అభ్యర్థులకు ఓటు వేస్తే మురిగిపోయినట్లవుతుందని మంత్రి ఓటర్లకు వివరించారు. కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం 75 గజాలలోపు విస్తీర్ణంలో అనుమతి లేకుండా ఇల్లు నిర్మించుకోవచ్చని, 75 గజాలకుపైగా విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకోవడానికి అనుమతి కోసం మున్సిపాలిటీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి 21వ రోజు వరకు రాకుంటే పని చేపట్టవచ్చని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. నిధులు ఇవ్వడంతో పాటు అధికారాలు కూడా కల్పించిన ప్రభుత్వం కొత్త చట్టం అమల్లో నిర్లక్ష్యం వహించే, అవినీతికి పాల్పడే పాలకవర్గం చైర్మన్‌, సభ్యులపై గాని వేటు వేయనుందని దయాకర్‌రావు చెప్పారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోనుందని, ఈ మున్సిపాలిటీ చైర్మన్‌ పీఠం టీఆర్‌ఎస్‌దేనని అన్నారు. నర్సంపేట పట్టణాన్ని అభివృద్ధి చేసిన ఘనత టీఆర్‌ఎస్‌దేనని, ఇటీవల నర్సంపేటలో ప్రభుత్వ దావఖాన అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.60 కోట్లు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధిని నర్సంపేట పట్టణ ప్రజలు రుచి చూశారని, ఇక్కడి 24 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ గెలుపొందడం ఖాయమని అన్నారు. ప్రతి వార్డులో టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ ఉంటే అభివృద్ధి వేగవంతం అవుతుందని చెప్పారు. ఎక్కడైనా అభివృద్ధి పెండింగ్‌లో ఉంటే తనదే బాధ్యతని, ప్రతిపక్షం నర్సంపేట పట్టణ అభివృద్ధికి వెన్నుపోటు పొడిచిందని పెద్ది అన్నారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 8, 11, 12 వార్డుల్లో తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా జెడ్పీలో టీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ పెద్ది స్వప్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజేతలకు మంత్రి అభినందనలు పదకొండు వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నికతో రాష్ట్రంలో రికార్డు నమోదు చేసిన పరకాల మున్సిపాలిటీని శనివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే, మున్సిపల్‌ ఎన్నికల పార్టీ ఇన్‌చార్జి తాటికొండ రాజయ్యతో కలిసి ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఇక్కడి పద్మశాలి భవన్‌లో మంత్రి ఎర్రబెల్లి పరకాల పురపాలక సంఘం పరిధిలో టీఆర్‌ఎస్‌ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన పదకొండు మంది అభ్యర్థులను ఎమ్మెల్యేలతో కలిసి అభినందించారు. పరకాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 22 వార్డులకు యాభై శాతం అంటే 11 వార్డుల్లో ఏకగ్రీవ ఎన్నిక జరగడం, వీటిలో ఏకగ్రీవంగా ఎన్నికైన పదకొండు మంది కూడా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కావడం తెలిసిందే. ఈ పదకొండు మంది విజేతలతో మంత్రి ఎర్రబెల్లి విజయ సంకేతం చూపి టీఆర్‌ఎస్‌ శ్రేణులకు మరింత ఉత్సాహాన్నిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అత్యధికంగా పదకొండు వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక ద్వారా పరకాల మున్సిపాలిటీకి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు లభించిందని, స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఈ గుర్తింపు సాధ్యమైందని దయాకర్‌రావు అన్నారు. ఇటీవల దేశంలోనే రాష్ట్రం నుంచి ఉత్తమ ఎమ్మెల్యేగా అవార్డు అందుకున్న ధర్మారెడ్డి తాజాగా మున్సిపల్‌ ఎన్నికల్లో చొరవ తీసుకుని పరకాల మున్సిపాలిటీలోని పదకొండు వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చేసి రికార్డు సృష్టించారని ప్రశంసించారు. స్వయంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు ఎమ్మెల్యే చల్లాకు అభినందనలు తెలిపారని చెప్పారు. ఎన్నికలు జరిగే మిగత పదకొండు వార్డుల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలవబోతున్నారని, వార్‌ వన్‌సైడ్‌గా ఉందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేయటానికి ప్రతిపక్షాలకు అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడిందని, పరకాలలో ఏకగ్రీవమైన పదకొండ వార్డుల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిస్తేనే తమ వార్డులో అభివృద్ధి జరుగుతుందని ఇతర పార్టీల అభ్యర్థులను విత్‌డ్రా చేయించారని తెలిపారు. పరకాలలో ఎస్సీ కాలనీల అభివృద్ధికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు దయాకర్‌రావు చెప్పారు. ఏకగ్రీవ ఎన్నిక జరిగిన పదకొండు వార్డులకు 500 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు జరిగే 11 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచే కౌన్సిలర్‌ అభివృద్ధి చేయకపోతే ఆ బాధ్యత తాను తీసుకుంటానని ఆయన తెలిపారు. పరకాలను రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తానని చల్లా చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ఎం భిక్షపతి, మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి పులి సారంగపాణి, పరకాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బొజ్జం రమేశ్‌, టీఆర్‌ఎస్‌ నేతలు నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావు, సోదా రామకృష్ణ, బండి సారంగపాణి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. వర్ధన్నపేటలో అరూరి ప్రచారం వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో శనివారం స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ఇక్కడి 1, 7, 12వ వార్డుల్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. స్వయంగా ఓటర్లను కలిసి వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనుల కోసం సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహకారంతో పెద్ద ఎత్తున నిధులు తెచ్చినట్లు ఎమ్మెల్యే అరూరి చెప్పారు. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. గ్రామ పంచాయతీగా ఉన్న వర్ధన్నపేటను మున్సిపాలిటీగా చేశామని, ఈ మున్సిపాలిటీకి తొలిసారి జరుగుతున్న ఎన్నికల్లో మొత్తం 12 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ విజయకేతనం ఎగురవేయడం ఖాయమని అన్నారు.

Related Stories:

More