ఎన్నికల్లో రికార్డు సృష్టించాలె

- ఉమ్మడి జిల్లాలో తొమ్మిది మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేస్తాం -పారదర్శక పాలన కోసం నూతనంగా మున్సిపల్‌ చట్టం -ప్రభావం కోల్పోయిన కాంగ్రెస్‌, బీజేపీలు -పరకాలలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరకాల టౌన్‌, జనవరి 18 : గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని మున్సిపాలిటీల్లో గెలిచి రికార్డు సృష్టించాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం పట్టణంలోని పద్మశాలి భవన్‌లో మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ గెలిస్తేనే వార్డులు అభివృద్ధి చెందుతాయనే ఆలోచనతో, ప్రజల ఒత్తిడి మేరకు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారన్నారు. ఉమ్మడి జిల్లాలో తొమ్మిది మున్సిపాలిటీలకు అన్నీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు. బీజేపీ కాంగ్రెస్‌ పార్టీలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాని, బీ ఫామ్‌లు ఇస్త్తామన్నా కనీసం వార్డుల్లో పోటీ చేసేందుకు వారికి అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ వల్లే పట్టణాలు అభివృద్ధి చెందకుండా ఉన్నాయన్నారు. బీజేపీకి కనీసం పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరన్నారు. రాష్ట్రంలోనే పరకాలకు ప్రత్యేక గుర్తింపు ఉంద న్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూడుసార్లు ఫోన్‌ చేసి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేస్తున్న పనులను అభినందించినట్లు తెలిపారు. 22వార్డుల్లో సగం వార్డులు ఏకగ్రీవం కావడం గొప్ప విషయమన్నారు. పార్టీకోసం పని చేసే వారికి గుర్తింపు లభిస్తుందన్నారు. వారికి నామినేటెడ్‌ పదవులు లభించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పని చేయకుంటే పోస్ట్‌ పోతది కౌన్సిలర్లు ప్రజల కోసం పని చేయాలని, లేకపోతే వారి పోస్ట్‌ ఊడిపోతుందని మంత్రి అన్నా రు. ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నూతన మున్సిపాలిటీ చట్టం తీసుకొచ్చిందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇస్తుందని, వాటితో పట్టణాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. 75 గజాల జాగాలో ఇల్లు కట్టుకోవడానికి ఎలాంటి పర్మిషన్‌ అవసరం లేదని, అంతకంటే ఎక్కువ జాగలో కట్టుకుంటే 21 రోజుల్లో ఇంటి పర్మిషన్‌ ఇచ్చేలా చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. పరకాలకు 500 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు పరకాల పట్టణంలో ఏకగ్రీవం అయిన వార్డులకు 500 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రత్యేకంగా మంజూరు చేస్తానని మంత్రి దయాకర్‌రావు అన్నారు. పట్టణ ప్రజలు తమ వార్డులు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే ఏకగ్రీవాలు చేసుకున్నారన్నారు. పట్టణానికి ఇచ్చే కోటా కంటే అదనంగా 500 ఇండ్లను కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి పట్టణాభివృద్దికి మరిన్ని నిధులు తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటానన్నారు. ఎన్నికల ఇంచార్జ్‌ పులి సారంగపాణి, మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి, ఎంపీపీ స్వర్ణలత, జెడ్పీటీసీ సిలివేరు మొగిళి, ఏఎంసీ చైర్మన్‌ బొజ్జం రమేశ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, చింతి రెడ్డి సాంబరెడ్డి, సోదా రామకృష్ణ, బండి సారంగపాణి, తిరుపతిరెడ్డి, దామెర మొగిళి పాల్గొన్నారు. వార్‌ వన్‌సైడే : తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే పరకాల మున్సిపల్‌ ఎన్నికలు వన్‌సైడే. పట్టణంలో ఇప్పటికే 11వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన వాటిలో కూడా టీఆర్‌ఎస్‌దే విజయం. అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అభివృద్ధి సాధించాలంటే టీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలి. ప్రతిపక్ష పార్టీలకు ఓటు వేస్తే బొందలో వేసినట్లే. రాష్ట్రంలో కాంగ్రెస్‌ బీజేపీలకు నామరూపాలు లేవు. పరకాల ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలుస్తుంది. కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావడం అదృష్టం : ఎమ్మెల్యే చల్లా తెలంగాణ రాష్ర్టానికి కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావడం మన అదృష్టం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు వచ్చినా సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రజలు, స్థానిక నాయకుల సహకారంతోనే పరకాల మున్సిపాలిటీలో 11 వార్డులను ఏకగ్రీవం చేసుకున్నాం. రాష్ట్రంలోనే పరకాలను మోడల్‌ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా. ఐదేండ్లలో పరకాల రూపురేఖలు మార్చి అభివృద్ధిలో ముందంజలో నిలుపుతా. కష్టపడ్డ కార్యకర్తలకు పదవులు వచ్చేలా కృషి చేస్తా.

Related Stories:

More