ప్రజాసేవే పరమావధిగా..

-ప్రజల మదిలో స్థానం సంపాదించుకున్న నల్ల శంకర్‌ -తల్లిదండ్రుల పేరిట ట్రస్టు, విరివిగా సేవా కార్యక్రమాలు మంచిర్యాల టౌన్‌, నమస్తే తెలంగాణ : ప్రజాసేవే పరమావధిగా మలచుకుని నిత్యం ప్రజలకు సేవచేస్తూ వారి మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ నల్ల శంకర్‌. సంపాదించిన దానిలో కొంత మొత్తం ప్రజలకు, బీదవారికి, సమాజానికి వెచ్చించాలన్న ఆలోచనతో తన వద్దకు వెళ్లిన వారికి సాయాన్ని అందిస్తుంటారు. పోచమ్మతోపాటు పలు కుల దైవాల ఆలయాల అభివృద్ధికి సాయం చేస్తున్నారు. హమాలీవాడలోని హనుమాన్‌ ఆలయంలో షిర్డీ సాయిబాబా ఆలయాన్ని నిర్మించారు. చెరువుకట్టపై ఉన్న పురాతన పోచమ్మ ఆలయానికి మరమ్మతులు చేయించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించారు. ఆరోగ్యం బాగా లేదని ఎవరైనా తన తలుపుతడితే చాలు నేనున్నానంటూ వారి వైద్యానికయ్యే ఖర్చులో తనవంతుగా అందిస్తూ పేదలకు భరోసా అందిస్తున్నారు. తన తల్లిదండ్రులైన నల్ల కోటమ్మ-లక్ష్మయ్యల పేరిట ట్రస్టును స్థాపించి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా పేరు తెచ్చుకున్న నల్ల శంకర్‌ 2014లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపొంది వైస్‌ చైర్మన్‌ పదవిని అలంకరించారు. క్రీడారంగంపై అతనికున్న మక్కువతో క్రీడలను ప్రోత్సహించడంలో ముందుండేవారు. అతని ఆసక్తిని గమనించిన పలు క్రీడాసంఘాలు తమ సంఘాలకు ప్రతినిధిగా ఉండాలని భావించాయి. జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన నల్ల శంకర్‌ రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలను మంచిర్యాల పట్టణంలో నిర్వహించి ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకొచ్చారు. క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం దూరప్రాంతాలకు వెళ్లే క్రీడాకారులకు తనవంతు సాయం అందిస్తుంటారు. పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాల నోటిఫికేషన్‌ వచ్చినపుడు ఈ ప్రాంతంలోని యువతకు పోలీసు శిక్షణ ఇవ్వగా వారికి ఉచిత వసతి, భోజన సౌకర్యం, అవసరమైన పరికరాలను అందజేశారు. ఎవరైనా మృతిచెందినపుడు వారి బంధువులు వచ్చేవరకు మృతదేహం పాడవకుండా భద్రపరిచేందుకు బాడీ ఫ్రీజర్‌ను, దూరంగా ఉండే శ్మశాన వాటికకు శవాన్ని తరలించడం, దాంతోపాటే బంధువులు వెళ్లేందుకు వీలుగా పెద్దగా ఉండే వైకుంఠరథాన్ని తన సొంత ఖర్చుతో కొనుగోలు చేసి అందుబాటులో ఉంచారు.
More