విజయం మనదే..

చెన్నూర్‌, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీయే ఘన విజయం సాధిస్తుందని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ధీమా వ్యక్తం చేశారు. చెన్నూర్‌ మున్సిపాలిటీలోని 3, 4, 8వ వార్డుల్లో ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌తో కలిసి శుక్రవారం ఆయన ప్రచారం చేశారు. తొలుత 8వ వార్డులోని లక్ష్మీదేవర ఆలయంలో కాలనీవాసులతో కలసి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ప్రచారం ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్ల్లి కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను కౌన్సిలర్లుగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వార్డుల్లో ఉన్న సమస్యలను కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల తర్వాత సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలైన ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకొన్న ఆయన అర్హులందరికీ వచ్చేలా చూస్తామని చెప్పారు. భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి.. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీతోనే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సాధ్యమని విప్‌ సుమన్‌ అన్నారు. పట్టణంలోని పలు రోడ్‌షోల్లో ఆయన ప్రసంగించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకొని తమ కాలనీలను మరింత అభివృద్ధి చేసుకోవాలని ఆయన కోరారు. ఇప్పటికే చెన్నూర్‌ మున్సిపాలిటీలోని 18వార్డుల్లో 7వార్డులు ఏకగ్రీవం అయ్యాయనీ, 17వ వార్డులో పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి తనుగుల సరోజ పోటీ నుంచి తప్పుకొని టీఆర్‌ఎస్‌లో చేరి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నాయిని శ్యామలకు మద్దతు ప్రకటించారని తెలిపారు. ఇప్పటికి 8వార్డుల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించినట్లేనన్నారు. అప్పటి పాలకుల నిర్లక్ష్యం వల్లే చెన్నూర్‌ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీగా మారిందని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత చెన్నూర్‌ను తిరిగి బల్దియాకు ఏర్పాటుచేసేందుకు కృషిచేశానన్నారు. చెన్నూర్‌లో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వ రూ.50కోట్లు మంజూరు చేసిందన్నారు. పెద్ద చెరువును మినీ ట్యాంకుబండ్‌గా మార్చేందుకు రూ.6కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. బతుకమ్మల నిమజ్జనం కోసం పెద్ద చెరువుకు బతుకమ్మ ఘాట్లను నిర్మించామని చెప్పారు. పెద్ద చెరువు రావిచెట్టు(కోటపల్లి బస్‌స్టాప్‌) నుంచి పట్టణ శివారులోని మెయిన్‌ రోడ్డు వరకు బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి రూ.4.5కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. పట్టణంలోని జలాల్‌ పెట్రోల్‌ పంపు నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు ప్రధాన రహదారి వెడల్పు, రోడ్డు డివైడర్‌, సెంట్రల్‌ లైటింగ్‌ నిర్మాణం కోసం రూ.16.75కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మహిళా సంఘాల సభ్యుల కోసం పట్టణంలో రూ.3కోట్లతో భవనాన్ని నిర్మిస్తున్నట్టు తెలిపారు. యువకుల కోసం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను నిర్మిస్తున్నట్టు తెలిపారు. పట్టణంలోని ఇండ్లు లేని నిరుపేదల కోసం 300 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఒకేరోజు రూ రూ.50కోట్ల నిధులతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసినట్లు గుర్తుచేశారు. చెన్నూర్‌ పట్టణాభివృద్ధిని ఆకాంక్షిస్తూ 3వ వార్డు, 4వ వార్డు, 8వ వార్డుల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు వేల్పుల సుధాకర్‌, రేవెల్లి మహేశ్‌, అట్టెం రాజబాపులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని పేద ప్రజల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలుచేస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను కౌన్సిలర్లుగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు మహావాది సుధాకర్‌రావు, ఎంపీపీ మంత్రి బాపు, జడ్‌పీటీసీ మోతె తిరుపతి, చెన్నూర్‌, కోటపల్లి మండలాల వైస్‌ ఎంపీపీలు వెన్నపురెడ్డి బాపురెడ్డి, వాల శ్రీనివాసరావు, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మల్లెల దామోదర్‌రెడ్డి, వార్డుల టీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జులు బత్తుల సమ్మయ్య, ముల్కల్ల శశిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
More