గులాబీ జెండా ఎగరేస్తాం

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల్లో అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరవేస్తాం. తెలంగాణ ప్రభుత్వం మున్సిపాలిటీలను గతంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి చేసింది. అన్ని మున్సిపాలిటీలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో ఎప్పుడూ లేని విధంగా నిధులు మంజూరు చేశారు. దీంతో ప్రజలకు అభివృద్ధి కండ్ల ముందు కనిపిస్తోంది. రోడ్లు, మురికి కాల్వలు, ఇతర అభివృద్ధి పనులు చురుకుగా సాగుతున్నాయి. ఫలితంగా ఆయా మున్సిపాలిటీల్లో నివసించే ప్రజలకు వసతులు ఎంతగానో మెరుగుపడ్డాయి. మరోవైపు కేసీఆర్‌ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ప్రయోజనం చేకూర్చాయి. దీంతో ప్రజలు మరోమారు గులాబీ పార్టీకే పట్టం కట్టనున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతిపక్షాలకు కనీసం ప్రజల నుంచి స్పందన రావడం లేదు. మా గెలుపు ఎప్పుడో ఖాయం అయ్యింది. సంక్షేమ పథకాలు గెలిపిస్తయ్‌.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు ఇలా అన్ని వర్గాలకు పెన్షన్లు అందించారు. ఇక రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలతో రైతు కుటుంబాలతో ఎంతో భరోసా లభించింది. గత ప్రభుత్వం పట్టించుకోని ఎన్నో వర్గాల ప్రజలను ఆదరించి అన్నం పెట్టిన ఘనత మన ముఖ్యమంత్రిదే. అందుకే ఆయనను ప్రత్యక్షదైవంగా కొలుస్తున్నారు. అన్ని ఎన్నికల్లో మేం అప్రతిహత విజయాలతో ముందుకు సాగుతున్నాం. మొన్న జరిగిన ఎన్నికల్లో 32 జడ్పీ స్థానాలు గెలిచి ఒక చరిత్ర సృష్టించాం. ఇప్పుడు అదే చరిత్ర పునరావృతం అవుతుంది. మున్సిపల్‌ ఎన్నికల్లో సైతం అదే రికార్డు తిరగరాస్తాం. సింగరేణి సంక్షేమానికి కేసీఆర్‌ ఎంతో చేశారు.. సింగరేణి గురించి చెప్పాలంటే కేసీఆర్‌కు ముందు.. కేసీఆర్‌ తర్వాత అని చెప్పాల్సి వస్తుంది.. గత ప్రభుత్వాలు ఇక్కడ నుంచి బొగ్గు తీసుకుపోయి అక్కడి ప్రాంతాలను అభివృద్ధి చేయడం మినహా ఈ సంస్థ గురించి కనీసం పట్టించుకున్న పాపానపోలేదు. ముఖ్యమంత్రి కార్మికుల గురించి తగిన శ్రద్ధ తీసుకుని వారి గురించి నిత్యం ఆలోచిస్తున్నారు. దీంతో కార్మికులు, వారి కుటుంబాలు ఆనందంగా ఉన్నాయి. గతంలో కోల్పోయిన హక్కులు ప్రతి ఒక్కటి తీసుకురావడంలో ఆయన పాత్ర అమోఘం. ముఖ్యంగా కార్మికుల పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడంతో కార్మికుల కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉన్నాయి. చాలామంది కేసీఆర్‌ ఫొటోలు పెట్టుకుని పూజిస్తున్నారు. ఇంతకుమించిన ఆనందం ఏముంటుంది. అందుకే మా గెలుపు మీద మాకు అంత నమ్మకం. ప్రజాపక్షం నిలబడే వారికే టిక్కెట్లు.. మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక చాలా జాగ్రత్తగా చేశారు. అలాంటి అభ్యర్థులకే టిక్కెట్లు కేటాయించారు. దాదాపు నెల రోజుల పాటు సర్వే నిర్వహించి, రెండు, మూడు సర్వేలు అయిన తర్వాతనే టిక్కెట్లు కేటాయించారు. మరోవైపు వేరే పార్టీ వారు గెలిస్తే మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రజలే ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే కచ్చితంగా టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులే గెలవాలని వారు కోరుకుంటున్నారు. ప్రతిపక్షాలకు పనేం లేదు కాబట్టి.. కేవలం ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నాయకత్వంలో ముందుకు వెళ్తున్నాం. ఆయన మాకు అన్ని రకాలుగా మార్గదర్శనం చేస్తున్నారు. ఎక్కడైనా చిన్న చిన్న లోటు పాట్లు ఉంటే వారి సరిచేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. గెలుపు ఎప్పుడో ఖాయమయ్యింది.. మా అభ్యర్థులు ప్రచారానికి వెళ్తుంటే మీరు వచ్చినా.. రాకున్నా మేం టీఆర్‌ఎస్‌కే ఓటు వేస్తామని భరోసా ఇస్తున్నారు. ప్రజలు ఇంటి పార్టీకి ఓటేయాలని భావిస్తున్నారు. అందుకే మిగతా పార్టీలకు కనీసం అభ్యర్థులు లేని దుస్థితి. పార్టీ టిక్కెట్‌ తీసుకుని మరీ విత్‌ డ్రా చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. కనీసం వారు ప్రచారానికి కూడా ముందుకు రావడం లేదు. ప్రజలు వాళ్లని రిసీవ్‌ చేసుకోవడం లేదు. ఎన్నిక వన్‌సైడ్‌ అవుతుంది. ఈ ఎన్నికల్లో కూడా మేం అద్భుతం సృష్టించబోతున్నాం. యుద్ధంలో ఆత్మ విశ్వాసంతో మేం ముందుకు వెళ్తున్నాం. వాళ్లు భయంతో బరిలోకి దిగుతున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు మాకు అన్ని అర్హతలు ఉన్నాయి. 101 శాతం గెలుపు మీద నమ్మకం ఉంది. వారం రోజుల్లో విజయోత్సవాలు చేసుకునేందుకు మేం ఇప్పటికే సిద్ధంగా ఉన్నాం.
More