107 పోలింగ్‌ కేంద్రాల్లో 43 సమస్యాత్మకం

-36 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ -21 లొకేషన్లలో మైక్రో అబ్జర్వర్లు -36 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ - 21 లొకేషన్లలో మైక్రో అబ్జర్వర్లు వరంగల్‌ రూరల్‌ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ : జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నామినేషన్ల విత్‌డ్రా గడువుకు తెరపడిన వెంటనే ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. వార్డుల వారీగా పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య తేలడంతో బ్యాలెట్‌ పేపర్ల ముద్రణకు దిగారు. బ్యాలెట్‌ బాక్సులను ఇప్పటికే సిద్ధం చేశారు. పుర పోరు పోలింగ్‌ గడువు సమీపించడంతో పోలింగ్‌ కేంద్రాలను రెడీ చేస్తున్నారు. వీటిని పరిశీలించి ఆయా పోలింగ్‌ కేంద్రంలో ఓటర్లకు వసతులు కల్పించే పనిలో పడ్డారు. మూడు మున్సిపాలిటీల్లోని 58 వార్డుల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 62,206. నర్సంపేట పురపాలక సంఘం పరిధిలోని 24 వార్డుల్లో 27,688, పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డుల్లో 25,255, వర్ధన్నపేట పురపాలక సంఘం పరిధిలోని 12 వార్డుల్లో 9,263 మంది ఓటర్లు ఉన్నారు. ఈ మూడు మున్సిపాలిటీల్లోని 58 వార్డుల్లో పురపాలక ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం 107 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 48, పరకాల పురపాలక సంఘం పరిధిలో 44, వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో 15 పోలింగ్‌ కేంద్రాల నిర్వహణకు ఆమోదం తెలిపింది. సమస్యాత్మకమైనవి గుర్తింపు.. మూడు మున్సిపాలిటీల పరిధిలో గల 107 పోలింగ్‌ కేంద్రాల్లో సమస్యాత్మకమైనవి 43 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో 6 క్రిటికల్‌, 25 సెన్సిటివ్‌, 12 హైపర్‌ సెన్సిటివ్‌ పోలింగ్‌ కేంద్రాలుగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపిన నివేదికలో తెలిపారు. క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాలు 6 కూడా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోనివే. 25 సెన్సిటివ్‌ పోలింగ్‌ కేంద్రాల్లో నర్సంపేటకు చెందినవి 13, పరకాలకు సంబంధించినవి 12 ఉన్నాయి. 12 హైపర్‌ సెన్సిటివ్‌ పోలింగ్‌ కేంద్రాల్లో పరకాలకు సంబంధించినవి 7, నర్సంపేటకు చెందినవి 5 ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మూడు పురపాలక సంఘాల పరిధిలో మిగత 64 పోలింగ్‌ కేంద్రాలు సాధారణమైనవిగా తెలిపారు. పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులకు 11 వార్డుల్లో ఎన్నిక ఏకగ్రీవం కావడంతో ఇక్కడ ఏర్పాటు చేసే పోలింగ్‌ కేంద్రాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌.. ఈ నెల 22న జరిగే పోలింగ్‌ను లైవ్‌ ద్వారా వీక్షించేందుకు మూడు మున్సిపాలిటీల పరిధిలోని కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటుకు అధికారులు నిర్ణయించారు. వెబ్‌కాస్టింగ్‌ నిర్వహణ కోసం మొత్తం 36 మంది వీఎల్‌ఈలను నియమించారు. వీరిలో నర్సంపేటలో 19, పరకాలలో 10 మంది, వర్ధన్నపేటలో ఏడుగురు విధులు నిర్వహిస్తారు. పోలింగ్‌ రోజున మూడు పురపాలక సంఘాల పరిధిలో మొత్తం 21 లొకేషన్లలో మైక్రో అబ్జర్వర్లు పనిచేస్తారు. ఈ లొకేషన్లలో నర్సంపేటలో 12, పరకాలలో 6, వర్ధన్నపేటలో 3 ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ 21 లొకేషన్లలో విధులు నిర్వహించేందుకు 24 మంది మైక్రో అబ్జర్వర్లు నియమితులయ్యారు. వీరిలో నర్సంపేటలో 13 మంది, పరకాలలో ఏడుగురు, వర్ధన్నపేట మున్సిపాలిటీలో నలుగురు సిబ్బంది మైక్రో అబ్జర్వర్లుగా పోలింగ్‌ రోజున విధులు నిర్వర్తించనున్నారు.

Related Stories:

More