ఇప్పపువ్వు లడ్డు భళా!

-పోషకాలు మెండు.. -రూ.30 లక్షలతో పరిశ్రమ ఏర్పాటు -ఐటీడీఏ చొరవతో ఆదివాసీ మహిళలకు చేయూత -త్వరలో అంగన్‌వాడీలకు లడ్డులు -గిరిజనుల్లో రక్తహీనత తగ్గించడానికి చర్యలు ఉట్నూర్, నమస్తే తెలంగాణ : ఒకప్పుడు ఆదివాసీలు సంప్రదాయ పంటలు అధికంగా పండించే వారు. ఆ ఆహారం భుజించి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవనం సాగించేవారు. క్రమంగా సంప్రదాయ పంటలు కనుమరుగయ్యాయి. ఫలితంగా గిరిజనులు రక్తహీనత భారిన పడుతున్నారు. చాలా మంది కూడా మృత్యువాత పడుతున్నారు. రక్తహీనత మరణాలు తగ్గించాలని అధికారులు సంప్రదాయ పంటలు సాగు చేయించాలని సంకల్పించారు. దీంతో ఐటీడీఏ పీఓ కృష్ణాదిత్య, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ ప్రత్యేక చొరవ తీసుకుని సంప్రదాయ పంటలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో ప్రధాన వంటకం ఇప్పపువ్వు లడ్డు. గిరిజనులు ఇప్పపువ్వు చెట్టును పెర్సాపేన్ దేవతగా కొలుస్తారు. దీంతో అనేక రకాల వంటకాలు తయారు చేస్తారు. ఇందులో అనేక పోషకాలు ఉండి రక్తహీనతను తగ్గిస్తాయి. పరిశ్రమను ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఉట్నూర్ మండలంలోని ఎక్స్‌రోడ్ గ్రామంలో రూ.30 లక్షలతో ఆదివాసీ నేచరల్ ఫుడ్ పేరిట పరిశ్రమ ఏర్పాటు చేశారు. దీనికి కావాల్సిన పరికరాలను ఐటీడీఏ సమకూర్చింది. పరిశ్రమను కూడా ఇటీవల మంత్రి ఐకే రెడ్డి, ఖానాపూర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు రేఖానాయక్, ఆత్రం సక్కులు ప్రారంభించారు. మహిళలకు కూడా ఉపాధి దొరుకనుంది. మహిళా సంఘం ఏర్పాటు.. ఇప్పపువ్వు లడ్డూలను తయారు చేసేందుకు ఐటీడీఏ అధికారులు 21 మందితో కూడిన మహిళా సంఘం సభ్యులను నియమించారు. వీరు ఇప్పపువ్వు లడ్డూలు చేయడంతోపాటు మార్కెటింగ్ చేస్తారు. కిలో లడ్డూలు రూ.400లకు విక్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో ఉత్పత్తిని పెంచి అంగన్‌వాడీలు, ఆశ్రమాల్లోని విద్యార్థులకు అందించాలన్నది ఐటీడీఏ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. లడ్డూలోని పోషకాహారం విలువలపై అవగాహన కల్పించడంతోపాటు మార్కెట్‌లో మంచి క్రేజ్ తీసుకొచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న పరిశ్రమ వద్ద సంప్రదాయ వంటలైన జొన్న, రాగుల రొట్టెలు, జావతో కూడిన పిండి వంటల హోటల్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీంతో పోషకాహారం అందించడంతోపాటు మహిళల అభివృద్ధికి ప్రయోజనకరం. పోషకాలు అధికం.. ఇప్పపువ్వు లడ్డూలో అధిక పోషకాలున్నాయి. రక్తహీనతను రూపు మాపడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పపూవ్వులో ఉసిరి కన్న ఎక్కువగా ప్రొటిన్స్ ఉన్నాయని ఢిల్లీలోని పరిశోధన సంస్థ వెలువరించింది. దీంతో ఇప్పపువ్వు లడ్డూకు చాలా క్రేజ్ పెరిగింది. ఏజెన్సీలో ఇప్పపువ్వు అధికంగా లభ్యమవుతున్న గిరిజనులు సక్రమంగా వాడకపోవడంతో జీసీసీ కొనుగోలు చేస్తూ ఇతర ప్రాంతాలకు తరలిస్తుంది. ప్రస్తుతం ఈ లడ్డు ఏర్పాటు చేస్తున్నందున రానున్న రోజుల్లో ఇప్ప పువ్వును అధికంగా వాడుకునే అవకాశాలున్నాయి. ఇప్పచెట్లు పెంచాలని అవగాహన.. ఇప్పచెట్లను గిరిజనులు దేవతగా కొలుస్తారు. అలాగే వాటి నుండి వచ్చే పండ్లు, పువ్వు ఆరోగ్యానికి చాలా లాభాలు చేస్తాయి. గిరిజనులు ఇప్పవూవ్వును ఏరి జీసీసీకి అమ్మడం ద్వారా ఉపాధి పొందడంతోపాటు ప్రస్తుతం తాజాగా లడ్డుల తయారితో ఆర్థికంగా బలపేతం అయ్యే అవకాశాలున్నాయి. దీంతో గిరిజనులకు ఇప్పచెట్లు పెంచుకోవాలని గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే రక్తహీతన తగ్గాలంటే సంప్రదాయ పంటలైన జొన్న, రాగి, సజ్జ, ఇప్పపూలతో కూడిన వంటలను తినాలని సూచించారు. గతంలో తిన్న పెద్దలకు రక్తహీనతలు లేవని సూచించారు. ప్రతి గ్రామంలో 100 ఇప్పచెట్లను నాటాలని సూచిస్తున్నారు. కాగా.. లడ్డూల తయారీపై శిక్షణ తీసుకోవడానికి 21 మంది ఆదివాసీ మహిళలను మహారాష్ట్రలోని యావత్‌మాల్‌కు పంపించారు. అనంతరం 3 నెలలుగా లడ్డూ తయారీ, పరిశ్రమ ఏర్పాటుకు తీవ్ర కృషి చేశారు. కలెక్టర్ చొరవతో ఐటీడీఏ పీఓ తీవ్ర కృషితో ఆదివాసీ నేచురల్ ఫుడ్ పేరిట పరిశ్రమను ఏర్పాటు చేశారు.

Related Stories:

More