పత్తి కొనుగోళ్లకు యాప్

- ప్రత్యేకంగా రూపొందించిన మార్కెటింగ్ శాఖ - విక్రయాల్లో అక్రమాలకు అడ్డుకట్ట - ససేమిరా అంటున్న వ్యాపారులు మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మంచిర్యాల మార్కెటింగ్ శాఖ(ఏఎంసీ) నూతన మొబైల్ యా ప్‌ను రూపొందించింది. పత్తిని మార్కెట్‌కు తీసుకొచ్చి అమ్ముకునే రైతులు మొబైల్‌లో ఫార్మర్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. యాప్‌లో ఇంటి నుంచే రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. మొదటగా ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరల్‌లోకి వెళ్లాలి. farmer.amcma-chiryal.com లోకి వెళ్లాలి. తర్వాత ఫోన్ నంబర్‌ను టైప్ చేయాలి. అందులో ఫార్మర్‌కు సంబంధించిన సమాచారం ఉంటుంది. వాహనం నంబర్, కాటన్ కమీషన్ ఏజెంట్, సీసీఐ ఎవరికి అమ్ముకోవాలో వారి ఫర్మ్ పేర్లు టైప్ చేయాలి. ఆ తర్వాత జిన్నింగ్ మిల్లు పేరు టైప్ చేయాలి. కొద్ది సేపటి తర్వాత రైతు ఫోన్ నంబర్‌కు ఓటీపీ నంబర్ వస్తుంది. రైతు పత్తి వాహనాన్ని మార్కెట్ యార్డుకు తీసుకొని వచ్చి యార్డులో వాహనాన్ని తూకం చేయించాలి. ఓటీపీ నంబర్‌ను చెబితే కాంటాపై ఆన్‌లైన్ తక్‌పట్టిలో నమోదు చేస్తారు. వెంటనే వ్యాపారులు ఆ వాహనాన్ని తేమ శాతం పరీక్షించి అక్కడే ధర నిర్ణయిస్తారు. వీటిని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఆ వెంటనే రైతుకు పూర్తి వివరాలు ఫోన్ నంబర్‌కు వెళ్తుంది. ఈ నూతన టెక్నాలజీని అందుబాటులోకి రావడంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతున్నది. అక్రమాలకు చెక్.. గతంలో రైతులు పత్తిని అమ్ముకోడానికి వాహనంలో తీసుకొస్తే మార్కెట్ యార్డులో తూకం చేసిన తర్వాత నామమాత్రంగా యార్డులో తేమ శాతం పరీక్షించే వారు. జిన్నింగ్ మిల్లులకు వెళ్లిన తర్వాత వ్యాపారులు మళ్లీ తేమ శాతాన్ని పరీక్షించే వారు. యార్డులో పరీక్షించిన తేమ శాతం, మిల్లులో పరీక్షించిన తేమ శాతానికి వ్యత్యాసం ఉండేది. వ్యాపారులు మాత్రం మిల్లులో పరీక్షించిన తేమను బట్టే ధరను నిర్ణయించే వారు. ఇలా ఏటా రైతులు దళారుల చేతిలో దగా పడుతూ నష్టాలను చవిచూస్తున్నారు. ఇలాంటి అక్రమాలకు తావివ్వకుండా నూతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌లో రైతు రిజిస్ట్రేషన్ చేసుకుంటే పూర్తి వివరాలు తెలుసుకునే వెసులుబాటు కలిగింది. ఈ యాప్ ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. ముఖ్యంగా ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రతిది పూర్తిగా పారదర్శకంగా జరుగుతున్న నేపథ్యంలో అక్రమాలకు తావు ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వ్యాపారుల ససేమిరా.. రైతులకు పూర్తిగా లాభం చేకూర్చే ఈ పద్ధతి తమకు వద్దని వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. ఏటా రైతు లు వ్యాపారుల వద్ద కోట్లలో నష్టపోతున్నారు. మి ల్లుల్లో పరీక్షించిన తేమను బట్టి, ఆ తర్వాత పత్తి స రిగ్గా లేదని ఇలా రకరకాల కారణాలతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రైతులు తమ సరుకును మార్కెట్‌లోకి తీసుకురాగానే అందరూ కలిసి తక్కువ ధర నిర్ణయించడం, తేమసరిగా లేదని చెప్పడం ఇలా రకారకాలుగా మోసం చేస్తున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో పత్తిని ఎంతో కొంతకు అమ్ముకుని వెనుదిరగాల్సిన దుస్థితి. అటూ వ్యాపారులు కోట్లకు పడగలెత్తుండగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలాంటి అరికట్టేందుకు తెచ్చిన ఈ యాప్‌ను తాము ఉపయోగించమని వ్యాపారు లు చెబుతున్నట్లు సమాచారం. దీనికి కొందరు అధికారులు వంతపాడుతున్నట్లు తెలుస్తోంది.

Related Stories:

More