ధాన్యం సేకరణలో నిబంధనలు పాటించాలి

మంచిర్యాల అగ్రికల్చర్ : రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం సేకరించాలని జిల్లా పౌర సరఫరాల అధికారి (డీసీఎస్‌ఓ) వీ వెంకటేశ్వర్లు అన్నారు.మంచిర్యాలలోని మార్కెట్ కమిటీ యార్డులో డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) ప్యాడి ప్రొక్యూర్‌మెంట్ సెంటర్(పీపీసీ)ల నిర్వాహకులకు ఓపీఎంఎస్ ఆన్‌లైన్ విధానంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో డీసీఎస్‌ఓ మాట్లాడారు. ప్రభు త్వం రైతులకు మద్దతు ధర పెంచి ఇస్తోందన్నారు. ఆ విధంగానే నాణ్యమైన ధాన్యం సేకరించాలన్నారు. తేమ శాతం 17 మించవద్దని, తాలు, మట్టిపెళ్లలు, చెత్త లేకుండా తీసుకువచ్చే ధాన్యాన్నే కొనుగోలు చేయాలన్నారు. బంధువులు, తెలిసిన వారంటూ తడిసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించవద్దని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే ఆన్‌లైన్ చేయాలన్నారు. ఆన్‌లైన్ ప్రక్రియ వేగవంతం చేస్తేనే రైతులకు త్వరగా డబ్బులు అందుతాయన్నారు. జిల్లాకు అవసరమైన గోనె సంచులు సిద్ధంగా ఉంచామని సివిల్ సప్లయ్ డీఎం గెడం గోపాల్ తెలిపారు. ప్రతి సంచికి లెక్క ఉంటుందన్నారు. కొనుగోలు కేంద్రాలను ఎత్తైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని కోరారు. ఆన్‌లైన్ ప్యాడి ప్రొక్యూర్‌మెంట్ సిస్టం (ఓపీఎంస్)పై డీఆర్‌పీ రామస్వామి వివరించారు. కొత్త వెర్షన్‌లో ఉన్న ఆప్షన్లు, ట్యాబ్‌లలో డాటా ఎంట్రీ నమోదు చేసే విధానంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ ప్రమోద్ కుమార్, మల్లారెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్, గంగాధర్, డీసీఎంఎస్ పీపీసీల నిర్వాహకులు పాల్గొన్నారు.

Related Stories:

More