మున్సిపోల్స్‌కు రెడీ

-ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికారులు -పురపాలక సంఘాల్లో ఎన్నికల వాతావరణం -తాజాగా రిజర్వేషన్‌ల ఖరారుపై అందరి దృష్టి -సర్వేలు చేయిస్తున్న ఎమ్మెల్యేలు మంచిర్యాల, ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సిద్ధం అవుతున్నారు. హై కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఇప్పటికే అన్ని సిద్ధం చేసుకొని ఉన్న అధికారులు మిగిలి ఉన్న రిజర్వేషన్లపై దృష్టి సారించారు. త్వరలో ఆయా మున్సిపాల్టీల పరిధిలో వార్డులు, చైర్మన్ పదవికి రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం ఉంది. జిల్లాలో ఆరు మున్సిపాల్టీలు ఉండగా.. ఇప్పటికే ఓటరు జాబితాలు సిద్ధం చేశారు. బెల్లంపల్లి, మంచిర్యాల పాత మున్సిపాల్టీలు ఉండగా క్యాతన్‌పల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట, నస్సూర్‌లను మున్సిపాల్టీలుగా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. మంచిర్యాల, బెల్లంపల్లి మున్సిపాల్టీలో 2014 మార్చి 30వ తేదీన ఎన్నికలు జరిగాయి. పాలక వర్గం 2014 జూలై 3న ప్రమాణ స్వీకారం చేసింది. ఈ పాలక వర్గ పదవీ కాలం గత జూలై 2న ముగిసింది. అప్పటి నుంచి ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. పాలక వర్గం పదవీ కాలం ముగియక ముందే మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రతి మున్సిపాల్టీలో కొత్త ఓటర్ల నమోదు, వార్డుల పునర్విభజన, ఓటర్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర ఓటర్లను గుర్తించారు. పోలింగ్ కేంద్రాల ఎంపిక, అభ్యంతరాల స్వీకరణ, రాజకీయ పార్టీలతో సమావేశం, పోలింగ్ నిర్వహణకు ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల నియామకం పూర్తయ్యింది. విభజనతో వార్డుల పెంపు పునర్విభజనతో ఆయా మున్సిపాల్టీలలో వార్డుల సంఖ్య పెరిగింది. ఒక్కో వార్డులో 1,050 నుంచి 1,250 మంది వరకు ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. వార్డులు పెరగడంతో ఆయా మున్సిపాల్టీల పరిధిలో ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలను సైతం పెంచారు. దీనికి సంబంధించి ప్రాంతాలను గుర్తించారు. మరో వైపు పురపాలక సంఘాల పరిధిలో వార్డులు, చైర్మన్ పదవి రిజర్వేషన్ ఖరారుకు ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లు చేశారు. వార్డులు, మున్సిపాల్టీల వారీగా ఓటర్ల కుల గణన చేశారు. ఓటర్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతరలను గుర్తించి నివేదికలను రూపొందించారు. దీంతో అందరి దృష్టి రిజర్వేషన్ ఖరారుపై కేంద్రీకృతమైంది. కౌన్సిలర్‌గా పోటీ చేయాలని, చైర్మన్‌గా పోటీ చేయాలని అనుకునే వారు రిజర్వేషన్ల ఖరారుపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్యేల సర్వేలు మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో అధికారులు తర్జనభర్జన పడుతుండగా ఇటు ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. గెలుపు గుర్రాల వేటలో పడ్డారు. ఎన్నికల టికెట్ల కోసం అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌లో పోటీ అధికంగా ఉంది. దీంతో ఎమ్మెల్యేలు ఈ విషయమై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. కచ్చితంగా ఆయా మున్సిపాలిటీలలో గులాబీ జెండా ఎగరేయాలనే సంకల్పంతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల సర్వేలు నిర్వహించి ఎవరి టికెట్ ఇవ్వాలనే అంశంపై కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు ఇదే విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. టికెట్ల కేటాయింపు ఆషామాషీగా ఉండదని, సర్వే చేసిన తర్వాతనే టికెట్లు కేటాయిస్తామని బాల్క సుమన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపాల్టీల్లో రాజకీయ వేడి రగులుతుంది.

Related Stories:

More