కదులుతున్న కార్మిక లోకం!

-సీఎం స్వయంగా చెప్పడంతో విధుల్లో చేరేందుకు సమాయత్తం - ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రిలోగా చేరేందుకు అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఆర్టీసీ సమ్మె విషయంలో కార్మికులు పూర్తి స్థాయిలో పునరాలోచనలో పడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్టీసీ సమ్మె, కార్మికుల సమస్యలపై పూర్తిగా మాట్లాడారు. కార్మిక సంఘాల మాటలు నమ్మి కార్మికులు సమ్మెకు వెళ్లారని, యూనియన్లు అనుసరించిన వ్యవహార శైలి వల్ల కార్మికులు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందని స్పష్టం చేశారు. ఈ నెల 5వ తేదీ వరకు అవకాశం ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు, యూనియన్ల మాటలు నమ్మి తమ జీవితాలు రోడ్డు పాలు కావద్దని ముఖ్యమంత్రి చెప్పారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీని బలోపేతం చేయడంతోపాటు కార్మికులు, సిబ్బందికి వేతనాలు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. భేషరతుగా విధుల్లో చేరే కార్మికుల యోగ క్షేమాలు అన్నీ ప్రభుత్వం చూసుకుంటుందని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయడం కుదరని స్పష్టం చేశారు. కార్మికులపై ఉన్న ప్రేమతోనే వారికి మరో అవకాశం కల్పిస్తున్నామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆలోచనలో పడ్డ కార్మికులు ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకునే దిశగా మెజారిటీ కార్మికులు అప్పుడే సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి చెప్పిన విషయంపై శనివారం రాత్రి నుంచే పలువురు కార్మికులు యూనియన్లకు అతీతంగా చర్చించుకుంటున్నట్లు తెలిసింది. సోమవారం విధుల్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నా రు. ఇప్పటికే చాలా చోట్ల కార్మికులు విధుల్లోకి వస్తుండడంతో తాము కూడా విధుల్లో చేరాలని నిర్ణయం తీసుకుంటున్నారు. గత ఐదేండ్లలో అడగకుండానే వేతనాలు పెంచిన ముఖ్యమంత్రి.. భేషరతుగా విధుల్లో చేరిన కార్మికులను కూడా తప్పకుండా ఆదుకుంటారనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది కార్మికులు విధుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని అధికారులు చెబుతున్నారు. నిత్యం చాలా మంది కార్మికులు వివిధ డిపోల వద్దకు వచ్చి చేరడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇన్నా ళ్లూ విధుల్లో చేర్చుకునే అంశంపై యాజమాన్యం నుంచి స్పష్టత లేకపోవడంతో ఆ డిపో మేనేజర్లు చేర్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం కేబినేట్ నిర్ణయం మేరకు.. స్వయంగా ముఖ్యమంత్రే కార్మికులను విధుల్లో చేరేందుకు అవకాశం కల్పించడంపై కార్మికుల్లో కదలిక మొదలు కావడమే కాదు.. యూనియన్లకు అతీతంగా విధుల్లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం నుంచి చాలా మంది విధుల్లో చేరనున్నారు. బయటపడుతున్న ప్రతిపక్షాల స్వరూపం ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇస్తున్న ప్రతిపక్షాల స్వరూపం ఒక్కొక్కటిగా బయటపడుతున్న తీరుపై కూడా కార్మికుల్లో చర్చ సాగుతోంది. ప్రధానంగా నాలుగు రోజులుగా బాబు మృతదేహం వద్ద జరిగిన పరిణామాలు, అంతిమయాత్ర రోజు చేసిన డ్రామాలు అన్నింటిని కార్మికులు గుర్తించారు. ఆయా పార్టీలు తమ సమస్యల కోసం పోరాటం చేయకుండా.. కేవలం వారి ప్రయోజనాల కోసం, ప్రచారం కోసం పోరాటం చేస్తున్నాయన్న విషయంపై జోరుగా చర్చించుకుంటున్నారు. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం కొత్తగా చట్టం తీసుకువస్తే ఆ చట్టం ఆమోదానికి అనుమతి తెలిపిస బీజేపీ ఎంపీలు, ప్రస్తుతం మాట మార్చి ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలబడినట్లుగా మొసలి కన్నీరు కారుస్తున్న తీరుపై చర్చిస్తున్నారు. ఇవే కాదు.. యూనియన్లు చెబుతున్న మాటలు, ఇతర అంశాలకు పొంతన లేని విషయంపైనా చర్చ జరుగుతున్నది. వీటన్నింటినీ గత కొద్ది రోజులుగా నిశీతంగా పరిశీలిస్తున్న కార్మికులు ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇదే సమయంలో వచ్చిన కార్మికులను నేరుగా విధుల్లో చేర్చుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాసిస్తే సరిపోతుంది.. కార్మికులు తిరిగి విధుల్లో చేరేందుకు పెద్దగా శ్రమ పడాల్సిన పని లేదని అధికారులు చెబుతున్నారు. తాము విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని కాగితంపై రాసిస్తే సరిపోతుందని మంచిర్యాల డిపో మేనేజర్ మల్లేశయ్య నమస్తే తెలంగాణకు వెల్లడించారు. విధుల్లో చేరాలనుకుంటే కచ్ఛితంగా విధుల్లోకి తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

Related Stories:

More