డిపాజిట్ ఊరట

-జిల్లాలో 56కు తగ్గిన మద్యం దుకాణాలు -రెండేళ్ల గడువుతో రేపు గెజిట్ నోటిఫికేషన్ -అదేరోజు నుంచి 16 వరకు దరఖాస్తుల స్వీకరణ -నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు -ఒక వ్యక్తి ఎన్నింటికైనా దరఖాస్తు చేసుకునే చాన్స్ -ఈ సారి దరఖాస్తుతో పాటు డిపాజిట్ చెల్లింపు లేదు -స్వీకరణకు ఆరు కౌంటర్లు: ఈఎస్ శ్రీనివాసరావు -వైన్ షాపుల కేటాయింపునకు 18వ తేదీన డ్రా వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ : కొత్త ఎక్సైజ్ విధానం మద్యం వ్యాపారులకు ఊరటనిచ్చింది. దరఖాస్తుతోపాటు ఈసారి మద్యం షాపులకు ముంద స్తు ఎలాంటి డిపాజిట్ (ఈఎండీ) చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఒక వ్యక్తి ఒక జిల్లాలో ఎన్ని మద్యం దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. మద్యం షాపు పొందిన వ్యాపారి వెంటనే రెండేళ్ల కాల వ్యవధికి సంబంధించిన ఎక్సైజ్ ట్యాక్స్‌ను ఎనిమిదో వంతు చెల్లిస్తే సరిపోతుంది. ప్రతీ మద్యం దుకాణంలో విధిగా మూడు సీసీ కెమెరాలు అమర్చి వాటిని మెయిన్ కంట్రోల్ గదికి అనుసంధానం చేయాల్సి ఉం టుంది. రెండు రోజుల క్రితం ప్రభుత్వం 2019-2021 నయా ఎక్సైజ్ పాలసీని ప్ర కటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది నవంబర్ 1 నుంచి 2021 అక్టోబర్ 31 వరకు ఇది అమల్లో ఉంటుంది. 2017-2019 ఎక్సైజ్ పాలసీలో ఉన్న నిబంధనల్లో కొన్ని మార్పులు చేస్తూ ప్రభుత్వం నూతన ఆబ్కారీ విధానం రూపొందించింది. గత పాలసీలో మద్యం షాపులకు దరఖాస్తు చేసే వ్యాపారులు దరఖాస్తుతోపాటు డిపాజి ట్‌ను ఎక్సైజ్ శాఖకు అందజేయాల్సి ఉండేది. కొత్త మద్యం విధానంలో వైన్‌షాపులకు దరఖాస్తుతోపాటు డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఈసారి మద్యం షాపులకు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు దాఖలయ్యే అ వకాశం ఉంది. గత పాలసీలో మద్యం దుకాణం పొందిన వ్యాపారి వెంటనే రెండేళ్ల కాల వ్యవధికి సంబంధించిన ఎక్సైజ్ ట్యాక్స్‌లో ఆరో వంతు చెల్లించాల్సి ఉండేది. న యా పాలసీలో ఈ ట్యాక్స్‌ను ప్రభుత్వం ఎనిమిది శాతానికి పెంచింది. వ్యాపార వేళల్లో ఎలాంటి మార్పు లేదు. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు దుకాణాల్లో మద్యం అమ్మకాలు జరపవచ్చు. లాటరీ పద్ధతిన వైన్‌షాపు దక్కించుకున్న వ్యాపారి నెల రోజుల వ్యవధిలో రెండు వాయిదాలకు సంబంధించి బ్యాంకు గ్యారెంటీలను ఎక్సై జ్‌శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంకు గ్యారంటీ విలువ మొదట్లో ఉన్న ఎక్సైజ్ ట్యాక్స్ స్లాబు నుంచి ఇప్పుడు సంవత్సరానికి 67 శాతం నుంచి 50 శాతానికి తగ్గింది. అన్ని మద్యం దుకాణాలకు పర్మిట్ రూం కోసం ఎక్సైజ్‌శాఖ అనుమతి ఇవ్వనుంది. ప్రత్యేక మద్యం షాపుల ఎక్సైజ్ ట్యాక్స్ ఏడాదికి రూ.5 లక్షల చెల్లింపు గడువు మొదటి సంవత్సరానికి 2019 డిసెంబర్ 20, రెండో సంవత్సరానికి 2020 డిసెంబర్ 20గా ప్రభుత్వం నిర్ణయించింది. రేపు నోటిఫికేషన్.. కొత్త ఆబ్కారీ విధానం అమలు కోసం ఎక్సైజ్‌శాఖ జిల్లాలోని మద్యం షాపులకు బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. జిల్లాలో మద్యం దుకాణాలు రెండు తగ్గాయి. పరకాలలోని వైన్‌షాపుల్లో రెండింటిని ఎక్సైజ్‌శాఖ మెదక్ జిల్లాకు షిఫ్ట్ చేసింది. దీంతో జిల్లాలో మద్యం దుకాణాల సంఖ్య 56కు తగ్గింది. పరకాల సర్కిల్‌లో 20, నర్సంపేట సర్కిల్‌లో 22, వర్ధన్నపేట సర్కిల్‌లో 14 వైన్ షాపులకు నోటిఫికేషన్ జారీ చేయడానికి ఎక్సైజ్‌శాఖ అధికారులు రెడీ అయ్యారు. జిల్లాలోని 56 షాపుల్లో ఏడు రూ.50 లక్షలు, 43 దుకాణాలు రూ.55 లక్షలు, ఆరు షాపులు రూ.85 లక్షల స్లాబులో ఉన్నట్లు వెల్లడించారు. నోటిఫికేషన్ వెలువడిన 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు 56 మద్యం దుకాణాల కోసం వ్యాపారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ సమయం. ఈ నెల 13వ తేదీ ఆదివారం మాత్రం సెలవు దినం. జిల్లాలోని 56 వైన్ షాపులకు ఎక్సైజ్‌శాఖ అధికారులు హన్మకొండ నిట్‌క్యాంపస్ సమీపంలో ప్రగతినగర్ రోడ్డు నంబరు-2లో ఉన్న మయూరి గార్డెన్ వీధిలోని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇందుకోసం మూడు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలోని మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించేందుకు ఒక్కో స్టేషన్‌కు రెండు లెక్కన ఈ కార్యాలయంలో మొత్తం ఆరు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్(ఈఎస్) శ్రీనివాసరావు వెల్లడించారు. సాయంత్రం 4 గంటలలోపు కార్యాలయం లోపలకు దరఖాస్తులతో వచ్చిన వ్యాపారులకు టోకెన్లు ఇచ్చి సమయం గడిచిపోయినా వరుస క్రమంలో స్వీకరిస్తామని ఆయన తెలిపారు. జిల్లా కార్యాలయంలోనే కాకుండా హన్మకొండలోని నిట్ క్యాంపస్ సమీపంలో ఉన్న ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ (డీసీ), హైదరాబాద్‌లోని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలోనూ జిల్లాలోని మద్యం షాపులకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించే ఏర్పాట్లు చేశారు. మద్యం దుకాణాల కేటాయింపునకు ఈ నెల 18న మయూరి గార్డెన్‌లో డ్రా నిర్వహిస్తారు. జిల్లా కలెక్టర్ ఎం హరిత ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు డ్రా పద్ధతిన మద్యం దుకాణాల కేటాయింపు ప్రారంభం కానుంది.

Related Stories:

More