గ్రామీణ క్రీడాకారులు ప్రతిభ చూపాలి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి

నర్సంపేట,నమస్తేతెలంగాణ : మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులు ప్రతిభ చూపి ఉన్నత స్థాయికి ఎదగాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సూచించారు. సోమవారం నల్లబెల్లి మండలం మేడపల్లె గ్రామంలో కబడ్డీ క్రీడల ముగింపు సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. మారుమూల ప్రాంతాల క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం ప్రొత్సాహం అందిస్తుందన్నారు. క్రీడాకారులకు సౌకర్యాలను కల్పించేందుకు ముఖ్యమంత్రి శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. క్రీడాకారులు కూడా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మూరుమూల ప్రాంతాల్లోనూ క్రీడా స్థలాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రద్ధ చూపుతోందన్నారు. క్రీడాకారులు ఇష్టమైన క్రీడల్లో తర్ఫీదు పొందాలని సూచించారు. క్రీడా ఉపాధ్యాయులు కూడా పాఠశాలల్లో విద్యార్థులు క్రీడల్లో రాణించేలా తగు శిక్షణ ఇవ్వాలని కోరారు. ఆటలో రాణిస్తే ఉన్నత చదువులు, ఉద్యోగాలల్లోనూ రిజర్వేషన్ సౌకర్యం ఉంటుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రోత్సాహించాలని ఆయన కోరారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమేనని ఆయన అన్నారు. ఓటమి గెలుపునకు నాందిగా స్వీకరించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలుస్తున్నదన్నారు. వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదన్నారు. నర్సంపేటకు గోదావరి జలాలను తరలించేందుకు ప్రత్యేక శ్రద్ధను పెడుతున్నామని చెప్పారు. పాకాల, రంగాయ చెరువు ప్రాజెక్టుల నిర్మాణంతో గోదావరి నీటిని రప్పించి, రైతుల చిరకాల వాంఛను నెరవేర్చుతున్నట్లు తెలిపారు. రైతులకు సాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అతి తక్కువ కాలంలో ప్రాజెక్టులను నిర్మించిన ఘనత కూడా టీఆర్‌ఎస్‌కే దక్కుతుందన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ కాకతీయ పథకాలను కూడా అమలు చేస్తూ ఆదర్శంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఊడుగుల సునీత ప్రవీణ్‌గౌడ్, మాజీ ఎంపీపీ సారంగపాణి పాల్గొన్నారు.

Related Stories:

More