సద్దుల బతుకమ్మ సంబరాలు

-వైభవంగా సద్దుల బతుకమ్మ సంబురం -జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటిన వేడుకలు -తీరొక్క పూలతో బతుకమ్మలు -వానలో ఆగని పూలజాతర -ఉత్సాహంగా ఆడిపాడిన మహిళలు -ఉయ్యాల పాటలతో మార్మోగిన జిల్లా -గంగమ్మ చెంతకు చేరిన గౌరమ్మ -వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు పరకాల, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ సంబరాలు పరకాల డివిజన్‌వ్యాప్తంగా అంబరాన్నంటాయి. పెత్రమాస రోజున ఎంగిలిపూలతో ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు తొమ్మిదిరోజుల పాటు ఘనంగా జరిగాయి. చివరిరోజు ఆదివారం పట్టణంలోని పశువుల సంత మైదానంలో , కుంకుమేశ్వరస్వామి ఆలయ పరిసరాల్లో మహిళలు చిన్నాపెద్ద తేడాలేకుండా బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పాటలతో పట్టణమంతా మార్మోగింది. మహిళలు ఉదయం నుంచే తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి సాయంత్రం సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆడిపాడారు. వర్షపు జల్లులు కురుస్తున్నప్పటికీ ఆ జల్లుల్లోనే బతుకమ్మ ఆడారు. అంతేకాకుండా డివిజన్‌లోని పరకాల, ఆత్మకూరు, నడికూడ, దామెర, శాయంపేట మండలాల్లోని గ్రామాల్లో కూడా సద్దుల బతుకమ్మ వేడుకలు జరిగాయి. సద్దుల బతుకమ్మ ఆడిన అనంతరం వెంట తెచ్చుకున్న సద్దులను పంచిపెట్టారు. గౌరమ్మకు వందనం చేసి ఇస్తినమ్మా వాయినం.. పుచ్చుకుంటినమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. తదనంతరం పట్టణంలోని దామెర చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. బతుకమ్మల నిమజ్జనం సందర్భంగా మహిళలు చెరువులోకి వెళ్లకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. కట్టపైనుంచే మున్సిపాలిటీ సిబ్బంది మహిళల వద్ద ఉన్న బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేశారు. సందర్భంగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పరకాల ఆర్డీవో, మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ ఎల్ కిషన్ ఆధ్వర్యంలో అంగరంగవైభవంగా ఏర్పాట్లు చేశారు. సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి పరకాలలో బతుకమ్మను తీసుకువచ్చి మహిళలతో కలిసి ఆడిపాడారు. పరకాల ఎంపీపీ తక్కళ్లపల్లి స్వర్ణలత వెల్లంపల్లి గ్రామంలో, పరకాల పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో హాజరయ్యారు. నడికూడ ఎంపీపీ మచ్చ అనసూర్య మండలంలోని నడికూడ గ్రామంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు.

Related Stories:

More