నర్సంపేటలో..

నర్సంపేట,నమస్తేతెలంగాణ: ఆర్టీసీ సమ్మె రెండో రోజు కొనసాగినప్పటికీ నర్సంపేట డిపో నుంచి 50 సర్వీసులను అధికారులు నడిపించారు. హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ రూట్‌లలో పోలీస్ ఎస్కార్ట్ సహాయంతో బస్సులు నడిచాయి. అలాగే, వరంగల్-1, 2, మహబూబాబాద్, కరీంనగర్, మంచిర్యాల, డిపోల నుంచి కూడా నర్సంపేట వరకు బస్సులు నడిచాయి. నర్సంపేట మీదుగా భద్రాచలం వరకు వెళ్లాయి. సమ్మె సందర్భంగా నర్సంపేట సీఐ కరుణసాగర్‌రెడ్డి, ఎస్సైలు నాగ్‌నాథ్, యుగంధర్ బందోబస్తు నిర్వహించారు. మొదటి రోజు నామమాత్రంగా పనిలోకి వచ్చిన తాత్కాలిక ఉద్యోగులు రెండో రోజు అధిక సంఖ్యలో వచ్చారు. 50 మంది కండక్టర్లు, 50 మంది డ్రైవర్లను తాత్కాలికంగా తీసుకున్నారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా పలు గ్రామాల నుంచి పట్టణానికి వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం కలగలేదు. ప్రైవేట్ ఆటోలు, జీపులు, బస్సులు, ట్రాలీలు లాంటి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. ప్రయాణికులకు అవసరమైన గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ బస్సులను కూడా వినియోగించారు. ఆర్టీసీ అధికారులు ఎప్పటికప్పుడు తగు నిర్ణయాలు తీసుకుంటూ ఆర్టీసీ బస్సులను నడిపించారు. డీఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. అయితే, ఆర్టీసీ కార్మికులు నర్సంపేటలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఆర్టీసీ సమ్మెకు, కార్మికులకు పలువురు నాయకులు సంఘీభావం ప్రకటించారు.

Related Stories:

More