విద్యార్థుల జీవితాలతో గుంటూరు ఆక్స్‌ఫర్డ్ చెలగాటం

చందానగర్, నమస్తే తెలంగాణ: గుంటూరు ఆక్స్‌ఫర్డ్ స్కూల్స్ యాజమాన్యం గతేడాది శేరిలింగంపల్లిలోని తారానగర్‌లో ఆక్స్‌ఫర్డ్ ఐఐటీ మెడికల్ ఫౌండేషన్ స్కూల్ పేరిట కొత్త శాఖను ప్రారంభించింది. ప్రాథమికంగా ఆ స్కూల్‌కు 7వ తరగతి వరకు మాత్రమే ప్రభు త్వ అనుమతి ఉన్నట్టు సమచారం. ఐతే 8,9,10 తరగతులకు అనుమతి లేకున్నా ఉన్నదని స్థానికులను నమ్మించి వారి పిల్లలను స్కూల్‌లో చేర్పించుకున్నారు. తీరా పదోతరగతి పరీక్షల ఫీజు చెల్లింపు గడువు వచ్చే సరికి స్కూల్ యాజమాన్యం మోసం బయటపడింది. ఇక్కడ చదివిన విద్యార్థులకు చందానగర్‌లోని శ్రీ సాయి విద్యామందిర్ స్కూల్ నుంచి 10వ తరగతి పరీక్షలు రాయిస్తున్నట్టు తల్లితండ్రుల దృష్టికి తీసుకొచ్చా రు. విద్యాశాఖ ఇటీవల చైల్డ్ ఇన్ఫో పేరిట విద్యార్థుల సమాచార సేకరణ అంశాన్ని తెరపైకి తెచ్చింది. ప్రభు త్వ, ప్రైవేట్ యాజమాన్యాల్లోని ప్రతి స్కూల్‌లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల జాబితాను ఆన్‌లైన్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. ఒక స్కూల్ మారి ఇంకో స్కూల్ లో చేరిన విద్యార్థి డాటాను వెళ్లిపోయిన స్కూల్ డ్రాప్ చేస్తేనే చేర్పించుకునే స్కూల్ ఎంటర్ చేసే అవకాశం ఉంటుంది. ఐతే గుంటూరు ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌కు సంబంధించి 8,9,10వ తరగతికి చెందిన మొత్తం 47మంది విద్యార్థులు అసలు ప్రభుత్వ రికార్డుల్లోకే ఎక్కలేరు. ఐతే 10తరగతి మాత్రం వేరే స్కూల్ పేరిట పరీక్ష రాయించిన ఆ స్కూల్ యాజమాన్యం కేవలం 10వ తరగతి చదివినట్టు మాత్రమే టీసీ, బొనఫైడ్ అందిస్తుంది. మిగిలిన 8,9 తరగతులు చదివిన రికార్డు ఇచ్చే అధికారం ఆక్స్‌ఫర్డ్‌కు ఉండదు. వేరే స్కూళ్లు ఇవ్వలేవు. గుంటూరు ఆక్స్‌ఫర్డ్‌లో 8వ తరగతిలో 24మంది, 9వ తరగతిలో 19మంది, 10వ తరగతిలో నలుగురు చదువుతున్నారు. వారు వేరే స్కూల్ ద్వారా 10వ తరగతి పరీక్ష రాసినప్పటికీ ఉన్నత చదువుల విషయంలో ఇబ్బంది పడక తప్పదు. అన్ని గుంటూరు ఆక్స్‌ఫర్డ్ శాఖల్లోనూ అదే పరిస్థితి... గుంటూరు ఆక్స్‌ఫర్డ్స్ స్కూల్‌లో చదివిన విద్యార్థులను వేరే స్కూల్ నుంచి కాకుండా అదేస్కూల్‌కు చెందిన వేరే శాఖ నుంచైనా పరీక్ష రాయించాలంటూ తల్లిదండ్రులు పట్టుబట్టగా ఇక్కడ మరో ట్వీస్ట్ బయటపడింది. రెండేళ్ల క్రితం ఎల్‌బీనగర్‌లో గతేడాది తారానగర్, కుకట్‌పల్లి, ఈ ఏడాది అల్వాల్, సైనిక్‌పురి, తార్నాకాల్లో ఆక్స్‌ఫర్డ్ బ్రాంచులను తెరిచింది. ఐతే నగరంలోని ఈ ఆరు శాఖాల్లోనూ 10వ తరగతికి అనుమతి లేదని, అందుకే వేరేస్కూల్‌లో రాయించాల్సిన పరిస్థితి అని యాజమాన్యం చేతులెత్తేసింది. దానికితోడు ఇటీవల కృష్ణా జిల్లా రామవరప్పాడులోని గుంటూరు ఆక్స్‌ఫర్డ్ స్కూల్స్‌ను అక్కడి కలెక్టర్ సీజ్ చేశారు. ఇతర శాఖలకు సైతం నోటీసులు పంపిణీ చేశారు. స్పందించని యాజమాన్యం... పిల్లల భవిష్యత్తుపై ఆక్స్‌ఫర్డ్ స్కూల్ ప్రిన్సిపాల్ మాలినిని వివరణ కోరగా తనకు ఎలాంటి సంబంధం లేదని యాజమాన్యం చెప్పినట్టు చేయడమే తనపని అని అన్నారు. కాగా గుంటూరు ఆక్స్‌ఫర్డ్ విద్యాసంస్థల చైర్మ న్ ఫ్రాన్సిస్‌రెడ్డి వివరణ కోరేందుకు ఫోన్‌లో ఎంత ప్రయత్నించినా అందుబాటులోకి రాలేడు.

Related Stories:

More