ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారా..

నిబంధనలు పాటించడం లేదా.. మీ ఫొటో క్లిక్ 72 రోజుల్లో 10,917ల ఫొటోలు సైబరాబాద్‌లో సరికొత్త ప్రయోగం ఉల్లంఘనలను గుర్తించే ప్రతి పౌరుడు సిటిజన్ ట్రాఫిక్ పోలీసే... సైబరాబాద్ ట్రాఫిక్ వాట్సాప్ నంబర్: 9490617346 హైదరాబాద్ : ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్తా...ఇప్పుడు మిమ్మల్ని సిటిజెన్ ట్రాఫిక్ పోలీసులు నీడలా ఫాలో అవుతున్నారు. రోడ్లపైనే కాకుండా గల్లీల్లో జరిగే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై కూడా పోలీసులకు సమాచారం అందుతున్నది. బాధ్యతగల పౌరులు నిజాయితీతో వ్యవహరిస్తుండడంతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 72 రోజుల్లో ట్రాఫిక్ రూల్స్ పాటించని 10,917 వేల వాహనదారుల ఫొటోలను పోలీసులకు పంపారు. ఈ ఉల్లంఘనులందరికీ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలాన్‌లను జారీ చేశారు. ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ పోలీస్ ఉంటే...ఇప్పుడు గల్లీల్లో సిటిజెన్ ట్రాఫిక్ పోలీసులు తమ విధులను నిర్వహిస్తున్నట్లు వారు పంపిన ఫొటోలతో స్పష్టమవుతున్నది. ఇటీవల సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ వాహనదారుల్లో ట్రాఫిక్ నిబంధనలను పాటించి, క్రమశిక్షణను తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నంతో ప్రతి పౌరుడు సిటిజెన్ ట్రాఫిక్ పోలీస్‌గా అవతారమెత్తుతున్నాడు. రోడ్లపై వాహనాలను నడిపే ఎవరైనా సరే ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ప్రమాదకరమైన తీరులో ప్రయాణిస్తే వారి ఫొటోలను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వాట్సాప్ నం : 9490617346కు పంపిస్తే వాటిపై చలాన్‌లను జారీ చేస్తామని ట్రాఫిక్ అధికారులు తెలిపారు. దీనికి స్పందిస్తున్న పౌరులు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండు నెలల 10 రోజుల్లో దాదాపు 10,917 వేల ఫొటోలను పంపి వారి బాధ్యతను నిర్వహించారు. వీటిలో ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణం, రాంగ్‌రూట్‌లో ప్రయాణం, సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తున్న వారి ఫొటోలను క్లిక్‌మనిపించారు. ఉల్లంఘనుల ఫొటోలను పంపి ట్రాఫిక్ పోలీసులకు సహాయం చేశారు. ప్రతి రోజుకు ట్రాఫిక్ వాట్సాప్‌కు 156 ఫొటోలను సిటిజెన్స్ పంపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలి పౌరులు స్పందిస్తున్న తీరు అభినందనీయం. ఈ ఉల్లంఘనలపై ట్రాఫిక్ చలాన్ విధించడం మా లక్ష్యం కాదు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించి క్రమశిక్షణతో కూడిన డ్రైవింగ్‌ను అలవాటు చేసుకోవాలనేది మా ఉద్దేశ్యం. అదే విధంగా నిబంధనలను పాటించడం వల్ల ప్రమాదాల బారిన పడకుండా రోడ్లపై సురక్షితమైన వాతావరణం కల్పించడమే ధ్యేయం. ఇలా ఫొటోలు పంపే వారి వివరాలు గోప్యంగా ఉంటాయి. చాలా మంది వాహనదారులు రోడ్లపై ఉండే ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకోవాలనే చూ స్తుంటారు...కానీ ఇప్పుడు ఉల్లంఘనులు బాధ్యత గల పౌరుల నుంచి తప్పించుకోలేరని స్పష్టమైంది. అందరికీ ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిన అవసరం, బాధ్యత ఉందని గుర్తించుకోవాలి. - ఎస్‌ఎం.విజయ్‌కుమార్, డీసీపీ సైబరాబాద్ ట్రాఫిక్

Related Stories: