మార్చి నాటికల్లా అర్బన్ పార్కులు

హైదరాబాద్: నగర శివార్లలో అర్బన్ పార్కులను వచ్చే మార్చిలోగా పూర్తిచేయాలని అటవీ, పర్యావరణశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా అధికారులను ఆదేశించారు. పనులు చేపట్టేందుకు ఈ నెలలోనే టెండర్లను పిలువాలని సూచించారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి హైదరాబాద్ చుట్టూ హెచ్‌ఎండీఏ పరిధిలోని ఫారెస్ట్ బ్లాక్‌లలో అర్బన్ పార్కులను సత్వరం ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించడంతో వివిధశాఖలు ఏర్పాటు పనుల్లో నిమగ్నమయ్యాయి. అర్బన్ పార్కుల పురోగతిపై ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా బుధవారం అరణ్యభవన్‌లో సమీక్షించారు. మొదటి విడుతలో 59 అర్బన్ పార్కుల ఏర్పాటుకు అన్నిశాఖలు యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేయాలని, ఈ నెలలోనే టెండర్లను పిలిచి పనులు మొదలుపెట్టాలని ఆదేశించారు. పర్యావరణహితంగా పార్క్‌ల నిర్మాణం జరిగేలా చూడాలని, ప్రకృతి రమణీయ వాతావరణంలో ప్రజలు ఉల్లాసంగా గడిపేలా ఈ పార్కుల్లో సౌకర్యాలు కల్పించాలన్నారు. అటవీశాఖ 17, హెచ్‌ఎండీఏ 16, పర్యాటకశాఖ 7, ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ 4, టీఎస్‌ఐఐసీ 10, జీహెచ్‌ఎంసీ 3, మెట్రోరైల్ అథారిటీ 2 అర్బన్ పార్కులను నిర్మించనున్నాయి.

Related Stories: