ప్రస్తుతం నాటు వేసుకోవాల్సిన కాయగూరలు

రాష్ట్రంలో ఏడాది పొడవునా కాయగూరలు సాగు చేసుకునే వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎండాకాలంలో సాగుచేసే కాయగూరల సాగులో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు మంచి దిగుబడులే కాకుండా ఆదాయం కూడా పెంచుకోవచ్చు. ఈ సాగులో క్రమంగా పెరిగే ఉష్ణోగ్రతకు తేమ శాతం తగ్గిపోతుంది. వాటిలో కొన్ని కిటుకులు తీసుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చు. tomato

సాగు చేసుకునే రకాలు

టమాటా, బెండ, వంకాయతో పాటు అన్నిరకాల తీగజాతి కూరగాయలను సాగుచేసుకోవచ్చు. ఆకుకూరల్లో తోటకూర, మెంతి, కొత్తిమీర, గోంగూర. అయితే కొత్తిమీరకు నీడను ఏర్పాటు చేసుకుంటే దిగుబడిని పెంచుకోవచ్చు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే రకాలను ఎంచుకోవాలి. వేసవిలో నీటి ఎద్దడి దృష్ట్యా తక్కువ కాలంలో చేతికి వచ్చే రకాలను ఎంచుకోవాలి.

నేల తయారీ

సాగు చేసేటప్పుడు ముఖ్యంగా సమస్యాత్మక నేలలు లేకుండా చూసుకోవాలి. నీటి వసతి ఉండాలి. నేలను బాగా దుక్కి దున్నుకోవాలి. ఎర్రనేలలు, ఇసుక కలిగి ఉన్న నేలల్లో సాగుచేసుకోవచ్చు.

ఎరువులు

నత్రజని, భాస్వరం, పొటాష్‌ ఇవి స్థూలపోషకాలు. వీటిలో పూర్తిగా భాస్వరం, పశువుల ఎరువు ఆఖరిదుక్కిలో వేసుకోవాలి. పశువుల ఎరువులో ముఖ్యంగా సూక్ష్మపోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవికాకుండా సేంద్రియ పదార్థాలు కూడా ఉంటాయి. పశువుల ఎరువు ఎకరానికి 8 నుంచి 10 టన్నులు వేసుకోవాలి. దీనివల్ల తేమను పట్టి ఉంచే గుణం ఉంటుంది. మొక్కకు అవసరమైన సూక్ష్మపోషకాలు అందుతాయి. పశువుల ఎరువు కాకుండా వర్మీకంపోస్టు ద్వారా సూక్ష్మపోషకాలు అందుతాయి. ఇది ఎకరాకు 800 నుంచి 1000 కిలోలు వేసుకోవాలి. ఇందులో భాస్వరాన్ని సూపర్‌ ఫాస్పేట్‌ రూపంలో వేసుకుంటే కాల్షియం, గంధం కూడా మొక్కలకు అందుతాయి. పంట కాలాన్ని బట్టి నత్రజని, పొటాష్‌లను మూడు దఫాలుగా వేసుకోవాలి. ముఖ్యంగా కూరగాయలకు ఎకరానికి 32 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 నుంచి 30 కిలోల పొటాష్‌ ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. పంట కాలాన్ని బట్టి నత్రజనిని రెండు నుంచి మూడు దఫాలుగా వేసుకోవాలి. 3వ వంతు ఆఖరి దుక్కిలో వేసుకుంటే మొక్కలకు ఎరువులు అంది దిగుబడి ఎక్కువగా వస్తుంది. సూక్ష్మపోషకాలైన బోరాన్‌, జింకు లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి. వాటిని సకాలంలో సవరించాలి.

నీటి యాజమాన్యం

ఎండాకాలంలో నీటి యాజమాన్యం అత్యంత కీలకమైంది. కాయగూరల సాగులో నీటి సౌలతి ఉంటే నాణ్యత కనిపిస్తుంది. నీటి ఎద్దడి ఎదురైతే బరువు కూడా తగ్గిపోయి దిగుబడి తగ్గిపోతుంది. కొన్ని కూరగాయల్లో చేదు వచ్చే అవకాశాలు ఉంటాయి. కూరగాయలు లేత దశలోనే ముదురుగా కనిపిస్తాయి. ముఖ్యంగా బెండలో నీటి ఎద్దడి వల్ల గింజలు బయటకు కనిపిస్తాయి. దీనివల్ల మార్కెట్‌లో ధర ఉండదు. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకొని సమాయత్తం కావాలి. ladies-finger

బెండ

బెండ వేసవిలో అధికంగా దిగుబడి ఇస్తుంది. ఈ పంట సాగు కాలం నాలుగు నెలలు. ఎకరానికి 3 కిలోల విత్తనాలు వేసుకోవాలి. కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్‌ పట్టించాలి. దీనివల్ల రసం పీల్చే పురుగుల నుంచి కాపాడవచ్చు. కిలో విత్తనానికి 100 గ్రాముల అజోస్పైరిల్లంతో విత్తనశుద్ధి చేసుకోవాలి. హెక్టారుకు 2 కిలోలల అజోస్పైరిల్లం, 2 కిలోల భాస్వరం కరిగించే బ్యాక్టీరియా, 100 కిలోల పశువుల ఎరువుతో కలిపి 15 రోజుల పాటు మగ్గపెట్టుకొని వాటిని చాళ్లలో పోయాలి. విత్తిన 40 రోజులకు పొలంలో కలుపు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కలుపు నివారణకు విత్తనం వేసుకున్న తర్వాత ఫ్లూక్లోరాలిన్‌ను ఒక కిలో చొప్పున ఎకరానికి పిచికారీ చేయాలి. హెక్టారుకు 200 కిలోల నత్రజని, 100 కిలోల భాస్వరం, 100 కిలోల పొటాష్‌ వేయాలి. తేలిక నేలల్లో బెండసాగు చేసినప్పుడు 4 నుంచి 5 రోజుల వరకు నీటి తడులు అందించాలి. బరువు నేలల్లో వారం పది రోజులకు ఒకసారి నీటి తడి అందించాలి. తెల్లదోమ నివారణకు డైమిథోయేట్‌ 2 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి వారం, పదిరోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. 45 రోజుల నుంచి కోత మొదలవుతుంది. acs

వంకాయ

జనవరి రెండవ వారం నుంచి నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు నారు పోసుకోవచ్చు. ప్రధాన పొలంలో నారును మార్చి మొదటివారం వరకు నాటుకోవచ్చు. నీరు ఇంకే సారవంతమైన నేలలు అనుకూలం. చౌడు నేలలు ఈ సాగుకు పనికిరావు. ఎకరానికి సూటిరకాలు అయితే 260 గ్రాముల విత్తనం లేదా సంకర రకాలు అయితే 120 గ్రాముల విత్తనం సరిపోతుంది. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరమ్‌ లేదా 4 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి కలిపి విత్తనశుద్ధి చేయాలి. ఎకరం పొలంలో విత్తుకోవడానికి 4 మీటర్ల పొడవు, 1 మీటరు వెడల్పు, 6 అంగుళాల ఎత్తు ఉన్న నారుమడులు 10-12 వరకు అవసరం అవుతాయి. ఎత్తుఫలకంపై 10 సెం.మీ. ఎడంతో సన్నని గీతలు తీసుకుని అందులో 1-1.5 సెం.మీ. లోతులో విత్తనాలు వేసి మట్టితో కప్పుకోవాలి. వెంటనే రోస్‌క్యాన్‌తో నీళ్లు పోసి గడ్డిని కప్పాలి. నారును తెగుళ్ల నుంచి నివారించడానికి ముందుగా 3 గ్రాముల కాఫర్‌ ఆక్సీక్లోరైడ్‌ లీటరు నీటికి కలిపి లేదా 0.5 శాతం బోర్డో మిశ్రమాన్నితో నారును తడుపాలి. నారును పీకడానికి వారం రోజుల ముందుగా 100 చ.మీ. నారుమడికి 250 గ్రాముల కార్బోఫ్యూరాన్‌ 3 జీ గుళికలు వేసి ఒక్క తడిని ఇవ్వాలి. coriander నెలరోజుల నారు ప్రధాన పొలంలో నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. పొలాన్ని 4,5 సార్లు దున్నుకొని వరుసల మధ్య 60-75 సెం.మీ., మొక్కల మధ్య 50-60 సెం.మీ ఎడం ఉంచి నాటుకోవాలి. ఆఖరిదుక్కిలో ఎకరానికి 6-8 టన్నుల పశువుల ఎరువు, 200 కిలోల వేపపిండిని తప్పనిసరిగా చల్లుకోవాలి. రసాయన ఎరువులైన సింగిల్‌ సూపర్‌ ఫాస్పేట్‌ 150కిలోలు, మ్యూరెట్‌ ఆఫ్‌ పొటాష్‌ 40 కిలోలు ఆఖరిదుక్కిలో వేసి కలియ దున్నాలి. 40 కిలోల నత్రజనిని ఇచ్చే ఎరువు మూడు సమభాగాలుగా చేసి నాటిన 30, 60,75 రోజులకు మొక్క మొదళ్ల దగ్గర వేసి నీటి తడిని ఇవ్వాలి. కలుపు నివారణకు ఎకరానికి 1-1.5 లీటర్లు అలాక్లోర్‌ 200 లీటర్ల నీటికి కలిపి నాటిన 48 గంటల తర్వాత కాయ తొలుచు పురుగు నివారణకు ఎర పంటగా బంతి పంటను, మగ పురుగులను ఆకర్షించడానికి ఎకరానికి నాలుగు లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. పుచ్చు సోకిన కాయలను తెంపి ఎప్పటికప్పుడు కాల్చివేయాలి. ఈవిధంగా నాణ్యమైన పద్ధతులు పాటిస్తే కాయగూరల్లో మంచి దిగుబడులు సాధ్యమౌతాయి. pavani