వరి సాగులో చేపట్టాల్సిన చర్యలు

Paddy ప్రస్తుతం యాసంగి వరి నార్లు 10-20 రోజుల దశలో ఉన్నాయి. కొన్నిప్రాంతాలలో వరినాట్లు కూడా పూర్తయ్యాయి. రాష్ట్రంలో ఎక్కువ శాతం వరి పంట నారుమడి దశలో ఉన్నది. వ్యవసాయ అధికారులు, వివిధ విస్తరణ విభాగాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు వరి నారుమడిలో అగ్గితెగులు ఆశించడంతో పాటు కాండం తొలిచే రెక్కల పురుగులను గమనించాం. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు కూడా అగ్గితెగులు ఆశించడానికి అనుకూలంగా ఉన్నాయి. అలాగే గత కొన్నేండ్ల అనుభవాల దృష్ట్యా యాసంగిలో కాండం తొలిచే పురుగు ఉధృతి అధికంగా ఉంటుంది. కాబట్టి రైతులు అగ్గితెగులు, కాండం తొలిచే పురుగును తొలి దశలోనే గుర్తించి సరియైన సమయంలో నివారణ చర్యలు చేపడితే నష్టాలను తగ్గించుకోవచ్చు. యాసంగిలో స్వల్పకాలిక దొడ్డు గింజ రకాలైన యంటీయు 1010, తెల్లహంస, ఐఆర్‌ 64, కూనారం సన్నాలు, బతుకమ్మ, జగిత్యాల రైస్‌-1, అలాగే సన్న గింజ రకాలైన తెలంగాణ సోన, హెచ్‌యంటీ సోనా వంటి రకాలను సాగు చేస్తున్నారు.

అగ్గితెగులు

-యాసంగి వరిని ఆశించే ప్రధానమైన తెగులు అగ్గితెగులు. ఈ తెగులు ఆకుమచ్చ దశలోనే నివారించాలి. లేకపోతే ఆ తర్వాత దశలలో మెడ విరుపు ఆశించి అధిక నష్టాన్ని కలిగిస్తుంది. ఈ తెగులు ఆశించడానికి చిరుజల్లులతో కూడిన వర్షం, గాలిలో అధిక తేమ శాతం ( 90 శాతం), తక్కువ రాత్రి ఉష్ణోగ్రతలు (15-20 డిగ్రీల సెల్సియస్‌), ఎక్కువ పగటి ఉష్ణోగ్రతలు (25-30 డిగ్రీల సెల్సియస్‌) అత్యంత అనుకూలం. -ఆకుల పైన చిన్న, చిన్న నీటిలో తడిచిన నీలపు రంగు మచ్చలు ఏర్పడి క్రమేపీ నూలు కండె ఆకారంలోకి మారుతాయి. ఈ మచ్చల చివర్లు మొనదేలి, అంచులు ముదురు గోధుమరంగు లేదా నలుపురంగులోనికి మారుతాయి. మచ్చల మధ్యభాగం బూడిద లేదా తెలుపురంగులో ఉంటుంది. మచ్చలు పెద్దవై ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకులు తగలబడినట్లుగా కనిపిస్తాయి. -ఈ తెగులు నివారణకు ఐసోప్రోథయోలేన్‌ 1.5 మి.లీ. లీటరు నీటికి లేదా కాసుగామైసిన్‌ 2.5 మి.లీ. లేదా ట్రైసైక్లోజోల్‌ 0.6 గ్రా. లేదా ట్రై సైక్లోజోల్‌ + మాంకోజెబ్‌ 2.5 గ్రా, లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

కాండం తొలిచే పురుగు

-యాసంగి వరిలో కాండం తొలిచే పురుగు ప్రధానమైన సమస్య. -ఈ పురుగు నారుమడి దశ నుంచి పంట ఆఖరు వరకు ఆశించి సుమారు 3-4 బస్తాల దిగుబడి నష్టపోయే అవకాశం ఉన్నది. -ప్రస్తుతం నారుమడి దశలో ఉన్న యాసంగి వరిలో కూడా రెక్కల పురుగు ఉధృతి గమనించాం. -పిలకల దశలో మొవ్వు చనిపోవడం, అలాగే వెన్నులు బయటకు వచ్చే సమయంలో తెల్లకంకులు ఏర్పడటం వంటివి ప్రధాన లక్షణాలు. -వరి నారు నాటడానికి ఒక వారం ముందు కార్బోఫ్యూరాన్‌ 3జి గుళికలు 800 గ్రా. ఒక ఎకరానికి సరిపోయే నారుమడిలో (200 చ.మీ. నారుమడిలో) వేయాలి. -పిలకల నుంచి దుబ్బు చేసే దశలో ఉన్న వరి పైర్లలో తప్పనిసరిగా నాటిన 25 రోజులలోపు ఎకరానికి కార్బోఫ్యూరాన్‌ 3జి గుళికలు 10 కిలోలు లేదా కార్టాఫ్‌ హైడ్రోక్లోరైడ్‌ 4జి 8 కిలోలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్‌ 0.4జి గుళికలు 4 కిలోలు నీరు పలుచగా ఉంచి పొలం అంతటా సమానంగా చల్లాలి. -అంకురం నుంచి చిరుపొట్ట దశలో ప్రతి 40 మొక్కలకు ఒక రెక్కల పురుగు లేదా గుడ్ల సముదాయం లేదా ఎకరానికి 3 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. వారానికి బుట్టకు 25-30 మగ రెక్కల పురుగులు గమనించిన వెంటనే క్లోరాంట్రానిలిప్రోల్‌ 20 యస్‌.సి 0.3 మి.లీ. లేదా కార్టాఫ్‌ హైడ్రోక్లోరైడ్‌ 50 యస్‌.పి 2 గ్రా, ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. venkataramana