పల్లిలో తెగుళ్ల నివారణ

రాష్ట్రంలో సాగుచేస్తున్న నూనెగింజల పంటల్లో ముఖ్యమైనది పల్లి. యాసంగిలో ఈ పంటను మహబూబ్‌నగర్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, కరీంనగర్‌, వరంగల్‌, వికారాబాద్‌, నల్గొండ, మహబూబాబాద్‌ మొదలగు జిల్లాల్లో సాగుచేస్తున్నారు. ప్రస్తుతం ఈ పంట శాఖీయ దశ నుంచి పూత దశలో ఉన్నది. వాతావరణంలోని మార్పులు, చలి తీవ్రత వలన పల్లి పంటలో తెగుళ్లు వస్తున్నాయి. ఈ తెగుళ్లను రైతులు తొలిదశలోనే గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేరుకుళ్లు తెగులు: ఈ తెగులు లక్షణాలు పల్లిలో వచ్చినప్పుడు తల్లివేరు నలుపు రంగులోకి మారుతుంది. తెగులు తీవ్రత ఎక్కువైనప్పుడు వేరు కుళ్లిపోయి చనిపోతుంది. నివారణ: తెగులు సోకిన మొక్కలను గుర్తించిన వెంటనే వేర్లు తడిచేవిధంగా 1 గ్రా కార్బండిజమ్‌ మందును ఒక లీటరు నీటిలో కలిపి పోయాలి. arachis తిక్కా ఆకుమచ్చ తెగులు: ఈ తెగులు రెండు (తొలి, ఆలస్యంగా) దశలలో వస్తుంది. (a) తొలిదశలో వచ్చే తెగులు.. ఈ తెగులు లక్షణాలు 20-35 రోజుల దశలో వస్తుంది. ఈ మచ్చలు ఆకులపైన గుండ్రంగా ఏర్పడుతాయి. ఈ మచ్చలు తెగులు తీవ్రత వల్ల ఎక్కువై ఆకు అంతా వ్యాపించి పండుబారి రాలిపోతుంది. (b) ఆలస్యంగా వచ్చే తెగులు.. ఈ తెగులు లక్షణాలు ఆకుల అడుగు భాగాన చిన్నచిన్న మచ్చలు నల్లని రంగులో ఏర్పడుతాయి. మచ్చల చుట్టూ పసుపు పచ్చని వలయాలు ఏర్పడుతాయి. ఈ తెగులు తీవ్రత ఎక్కువైనప్పుడు ఆకు తొడిమలను, కాండాన్ని, ఊడలను కూడా ఆశిస్తుంది. నివారణ: ఈ తెగులును తట్టుకునే రకాలు (కదిరి-9, జగిత్యాల పల్లి, అభయ, ధరణి, హరితాంధ్ర)ను విత్తుకోవాలి. తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే మాంకోజెబ్‌ 2.5 గ్రాములు లేదా క్లోరోథాలోనిల్‌ 2 గ్రాములు లేదా టెబ్యుకొనజోల్‌ 1 గ్రాము మందులలో ఏదో ఒకదానిని లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. త్రుప్పు తెగులు: ఎరుపు రంగులో ఉన్న మచ్చలు ఆకుల అడుగుభాగాన ఏర్పడును. ఆకుల పైభాగంలో పసుపురంగు మచ్చలు కనపడుతాయి. ఈ మచ్చలు అన్ని కలిసిపోయి ఆకులు ఎండిపోయి, రాలిపోతాయి. నివారణ: ఈ తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే 2.5 గ్రా మాంకోజెబ్‌ లేదా 2 గ్రా క్లోరోథాలోనిల్‌ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. vijaybaskar కాండంకుళ్లు తెగులు: ఈ తెగులు వలన భూమిపై ఉన్న కాండం మీద తెల్లటి రంగులో తెరలు (బూజు) ఏర్పడుతాయి. ఈ తెగులు సోకిన మొక్కల కాండం కుళ్లిపోతుంది. ఈ తెగులు సోకిన మొక్కలను పీకినప్పుడు తేలికగా ఊడి వస్తాయి. తెగులు తీవ్రత ఎక్కువైనప్పుడు కాయలు కూడా కుళ్లిపోతాయి. నివారణ: 1 గ్రా కార్బండిజమ్‌ లేదా 2 గ్రా టాప్సిన్‌-ఎం వీటిలో ఏదో ఒకదానిని లీటరు నీటిలో కలిపి మొక్కల మొదళ్ల దగ్గర పోయాలి. ఇంకా తెగులు నివారణ కోసం వేసవిలో లోతు దుక్కుల దున్నుకోవాలి. విత్తనాలను విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి. పంట మార్పిడి పద్ధతిని పాటించాలి. మొవ్వుకుళ్లు వైరస్‌ తెగులు: ఈ తెగులు ‘తామర పురుగుల’ ద్వారా వ్యాప్తి చేస్తాయి. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు చిన్నవిగా మారుతాయి. మొక్కలు ఉండాల్సిన ఎత్తులో కాకుండా తక్కువ ఎత్తులో కనిపిస్తాయి. తెగులు తీవ్రత ఎక్కువైనప్పుడు పూత రాలుతుంది, ఆకులు అతి చిన్నగా మారి మొవ్వు ఎండిపోతుంది. నివారణ: ఈ తెగులు వచ్చిన తొలిదశలోనే ఫిప్రొనిల్‌ 2 మి.లీ. లేదా థయోమిథాక్సామ్‌ 1 గ్రా మందులను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ పంట విత్తేముందు చుట్టూ నాలుగు వరుసల జొన్న విత్తనాలను విత్తుకోవాలి. కలుపు మొక్కలను పంటలో లేకుండా ఎప్పటికప్పుడు తీసివేయాలి. డాక్టర్‌ ఎ. విజయ భాస్కర్‌ రావు,9849817896 సీనియర్‌ శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధనా స్థానం,కరీంనగర్‌