గులాబీరంగు కాయతొలుచు పురుగు నివారణ పద్ధతులు

cotton ప్రస్తుతం పత్తి 160-180 రోజుల్లో కాయ పగిలే దశలో ఉన్న ది. చాలాచోట్ల పత్తిని 1-2 సార్లు తీశారు. గత నవంబర్‌ మాసం నుంచి నెలకొన్న చల్లని వాతావరణం వలన పత్తిని గులాబీరంగు కాయతొలుచు పురుగు ఆశించి చాలాచోట్ల నష్టపరుస్తున్నది. అట్లనే చేన్లలో అమర్చిన లింగాకర్షక బుట్టలలో కూడా మగ రెక్కల పురుగులు పడటం గమనించడం జరుగుతున్నది. కొన్నిచోట్ల కాయలలో ఈ పురుగు ఆర్థిక నష్టపరిమితిని దాటి నష్టపరిచింది. ఈ పురుగు లార్వాలు కంటికి లేదా బయటకు కనిపించకుండా పెరిగే కాయలలో ఉండి గింజలను తింటూ దూదిని నష్టపరుస్తాయి. ఈ పురుగు ద్వారా జరిగే ఆర్థి క సష్టం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితులలో ఈ పురుగు ఉధృతి మరింత పెరుగకుండా సరైన యాజమాన్య పద్ధతులను పాటించి ప్రస్తుత పంటను,

రాబోయే పంటను కాపాడుకునే ప్రయత్నం చేయాలి.

bvrgqeitrh ఈ పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు -ప్రస్తుత దశలో పురుగు ఉధృతిని బట్టి 1 లేదా 2 సార్లు సింథటిక్‌ పైరిత్రాయిడ్‌, ఇతర కీటక నాశని కలిసిన మిశ్రమ మందులైన క్లోరోపైరిఫాస్‌+ సైపర్‌మెత్రిన్‌ 2 మి.లీ. లేదా ప్రొఫెనోఫాస్‌+సైపర్‌మెత్రిన్‌ 2 మి.లీ. లేదా క్లోరాంట్రానిలిప్రోల్‌ + లామ్డాసెహలోథ్రిన్‌ 0.5 మి.లీ. లీటరు నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. -ఒకవేళ పురుగు తాకిడి నష్టపరిమితి (10 కాయలలో 1 పురుగు) కన్నా తక్కువగా ఉంటే స్పైనోసాడ్‌ 0.35 మి,లీ. లేదా ఇమామెక్టిన్‌ బెంజోయేట్‌ 0.5 గ్రా లేదా స్పైన్‌టోరా మ్‌ 0.9 మి.లీ. లేదా ఇండాక్సాకార్బ్‌ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి 1-2 సార్లు పిచికారీ చేయాలి. -పత్తి పంట కాలాన్ని పొడిగించకుండా 180-200 రోజుల్లో పంటను పూర్తి చేసి, జనవరి రెండవ పక్షం నుంచి నీరు ఉన్నట్లయితే ఆరు తడి పంటలైన తెల్ల నువ్వులు, పెసర, జొన్న, మక్కజొన్న లాంటి పంటలను సాగు చేసుకోవాలి. -పత్తి తీసిన తర్వాత, చేన్లను పశువులు లేదా గొర్రెలతో మేపాలి. దీనిద్వారా పురుగు అవశేషాలు కూడా నాశనం చేయబడుతాయి. -అటు తర్వాత పత్తి మోళ్ళను ట్రాక్టర్‌ డ్రెడ్డర్‌ లేదా రోటావేటర్‌ సహాయంతో భూమిలో కలియదున్నాలి. దీనిద్వారా భూమి సారవంతమవడమే కాకుండా గులాబీరంగు కాయ తొలుచు పురుగు అవశేషాలు కూడా పూర్తిగా నశించబడుతాయి. ఫలితంగా రాబోయే వానకాలంపంటలో పురుగు ఉధృతిని చాలావరకు తగ్గించుకునే అవకాశముంటుంది. -పత్తి చేన్లను శుభ్రం చేయడంతో పాటుగా, పురుగు ఆశించిన పత్తిని ఎక్కువరోజులు నిల్వ ఉంచకుండా త్వరగా మార్కెట్లో అమ్మివేయాలి. -పత్తి మోళ్ళను నిల్వచేసి వంట చెరుకుగా ఉపయోగించరాదు. మోళ్ళను చేనులోనే కలియదున్నాలి లేదా నిర్మూలించాలి. -జిన్నింగు మిల్లులలో పత్తి తీయగా వచ్చిన వ్యర్థ పదార్థాలను మిల్లు ఆవరణలో, బయట ఎక్కువరోజులు నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు తీసివేయాలి. -జిన్నింగు మిల్లుల్లో లైట్‌ట్రాప్స్‌ (దీపపు ఎరలను), లింగాకర్షక బుట్టలను అమర్చి వాటిద్వారా పడిన రెక్కల పురుగులను ఎప్పటికప్పుడు నిర్మూలించాలి. -పత్తి జిన్నింగు పూర్తికాగానే, మిల్లు ఆవరణంతా శుభ్రంచేసి ఉంచితే వచ్చే పత్తి పంటలో గులాబీరంగు కాయ తొలుచు పురుగు ఉధృతి బాగా తగ్గుతుంది. -ఎ. సుదర్శనమ్‌ ప్రధాన శాస్త్రవేత్త (పత్తి) -డాక్టర్‌ బి. రాంప్రసాద్‌ సీనియర్‌ శాస్త్రవేత్త (పత్తి కీటక విభాగం)