మిరపలో నాణ్యతను పెంచడానికి సూచనలు

chili-pepper మిరప పంటలో అధిక దిగుబడి పొందడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఉద్యానవన అధికారులు అందించిన వివరాలు. మిరప పంటలో అధిక దిగుబడి పొందడానికి చెట్లపై పండిన కాయలను ఎప్పటికప్పుడు కోయాలి. వాటిని పట్టాలపై కాని, సిమెంట్‌ కళ్లాలపైన గాని ఆరబెట్టడం ఉత్తమమైన మార్గం. నీటి ఆధార పంటకు 6-8 కోతలు కోయవచ్చని తెలిపారు.

నాణ్యత పెంచడానికి

-మొక్కల మీద మిరపకాయలను పండనివ్వరాదు. ఎక్కువగా పండితే మిరప నాణ్యత తగ్గుతుంది. ఎప్పటికప్పుడు పండిన కాయలను కోయాలి. దీనివల్ల దిగుబడులు పెరుగుతాయి. -కాయకోసే ముందు సస్యరక్షణ మందులు పిచికారీ చేయరాదు. పిచికారీ చేస్తే కాయలమీద మందుల అవశేషాలు ఉండే ప్రమాదం ఉంటుంది. -అఫ్లోటాక్సిన్‌ వృద్ధి కాకుండా మిరప కాయలను పాలిథీన్‌ పట్టాల మీద లేదా సిమెంటు గచ్చుమీద ఎండబెట్టాలి. -రాత్రిపూట మంచుబారిన పడకుండా కాయలను కప్పి ఉంచాలి. -మిరపలో 10 శాతానికి మించి ఎక్కువ తేమ ఉండకుండా ఎండబెట్టాలి. -ఎండబెట్టేటప్పుడు దుమ్ము, ధూళి, చెత్త, చెదారం చేరకుండా కాయలు శుభ్రంగా ఉండేలా చూడాలి. -కాయలు ఎండబెట్టే దరిదాపుల్లో కుక్కలు, పిల్లులు, కోళ్లు, ఎలుకలు, పందికొక్కులు రాకుండా చూసుకోవాలి. -తాలు కాయలను, మచ్చకాయలను గ్రేడింగ్‌ చేసి వేరుచేయాలి. -నిల్వచేయడానికి తేమ లేనటువంటి శుభ్రమైన గోనె సంచుల్లో కాయలు నింపాలి. -తేమ తగులకుండా వరిగడ్డి లేదా చెక్కబల్లల మీద గోడలకు 50-60 సెం.మీ. దూరంలో నిల్వ ఉంచాలి. -అవకాశం ఉన్నచోట శీతల గిడ్డంగుల్లో నిల్వచేయాలి. తద్వారా రంగు, నాణ్యత తగ్గిపోకుండా లాభదాయకంగా ఉంటుంది. -కాయలు మంచి రంగు రావడం కోసం ఎలాంటి రసాయనాలను, రంగులను వాడవద్దు. వాటివల్ల ప్రమాదకరమని నిషేధించబడినాయి. -అకాల వానలకు గురికాకుండా, మంచుబారిన పడకుండా, రంగు కోల్పోకుండా ఆధునిక డ్రయ్యర్లలోగాని లేదా టబాకో బారన్‌లలో గాని ఎండబెట్టాలి. ఫలితంగా మంచి మిరప కాయలను పొందవచ్చు. -ఆసరి రాజు