ఎరోబిక్‌ పద్ధతిలో వరిసాగు తక్కువ వ్యయం, సులభం

AROBIC సాగులో తక్కువ నీటి వినియోగం, పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకుంటే మేలని వ్యవసాయరంగ నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు ‘ఎరోబిక్‌' పద్ధతి మేలు అంటున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సహకారంతో మేడ్చల్‌ మండలం బండమాదారం గ్రామంలో యువరైతు ఎరోబిక్‌ పద్ధతిలో వరిని సాగు చేశాడు. అతి తక్కువ పెట్టుబడితో వర్షాధారంగా పంటను పండించాడు. సాధారణ పద్ధతి కన్నా దిగుబడి తక్కువగా వచ్చింది. అయితే పెట్టుబడిలో చాలా తేడా ఉన్నది.

ఎకరంలో సాగు

బండమాదారం గ్రామానికి చెందిన యువ రైతు ఎర్రోళ్ల కృష్ణకు బోరు బావి లేదు దీంతో వర్షాధారంగా పంటలను సాగు చేస్తున్నాడు. ఏటా పడుతున్న శ్రమ వృథా అవుతున్నది. దీంతో తక్కు వ పెట్టుబడితో వర్షాధారంగా వరి పంటను సాగు చేయాలని భావించాడు. స్థానిక వ్యవసాయ అధికారుల సహకారంతో ఎరోబిక్‌ పద్ధతి గురించి తెలుసుకుని సాగు ప్రారంభించాడు. ఇందుకుకోసం ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రైస్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్త శ్రీదేవి రైతుకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆమె పర్యవేక్షణలో ఎకరా పొలంలో ఎరోబిక్‌ పద్ధతిలో వరిని సాగు చేశా డు. వరి ఎదుగుతున్న దశలో, కలుపు నివారణలో వారు రైతుకు సాంకేతిక సహకారం అందించారు. దీంతో రైతు విజయవంతం గా పంట పండించాడు.

లాభాలెన్నో...

ఎరోబిక్‌ పద్ధతి సాగులో దున్నిన పొలంలో విత్తనాలు వెదజల్లుతారు. ఒకరే గంటలోపు సమయంలో ఎకరా పొలంలో విత్తనా లు చల్లవచ్చు. విత్తన పరిమాణం కూడా సాధారణ పద్ధతి కంటే చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత నీటిని అందిస్తే మొలకలు వస్తాయి. పంట ఎదుగుతుంది. విత్తనం చల్లడం మొదలుకుని పంట చేతికొచ్చేవరకు ప్రతి దశలో ప్రస్తుతం అవలంబిస్తున్న పద్ధ తి కంటే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. నీరు, ఎరువులు, కూలీలు ఇలా ప్రతి విషయంలో ఖర్చు ఆదా అవుతుందని రైతు కృష్ణ అనుభవపూర్వకంగా తెలిపాడు. శ్రమ, నీటి వినియో గం కూడా తక్కువగా ఉంటుందని చెప్పాడు. నేరుగా భూమిలో నుంచి పైరు ఎదిగినందున రోగాలు తట్టుకునే శక్తి కూడాఎక్కువగా ఉంటుందన్నారు.

సంప్రదాయ పద్ధతులే మేలు

పంటల ఉత్పత్తిలో సంప్రదాయ పద్ధతులపై దృష్టి సారిస్తానని రైతు ఎర్రోళ్ల కృష్ణ తెలిపారు. ఎరోబిక్‌ పద్ధతిలో వరి సాగు చేయ డం సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఇది కొత్త పద్ధతేమి కాదు. మన పూర్వీకులు అవలంబించిందేనన్నారు. వర్షాధారంతో అతి తక్కు వ పెట్టుబడితో 17 బస్తాలు పండించానని తెలిపారు. దీంతో సంప్రదాయ పద్ధతులపై ఆసక్తి ఏర్పడింది. భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయంలో దేశవాళీ రకాలను సాగు చేయాలనుకుంటున్నానని కృష్ణ చెప్పారు. పెట్టుబడుల వ్యయం, నీటి వినియోగం తగ్గించుకుంటేనే రైతుకు లాభం ఉంటుందన్నారు. ఎరోబిక్‌ పద్ధతిలో వరిసాగు చేసిన కృష్ణ కృషిని రాజేంద్రగనర్‌లోని జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం గుర్తించింది. రైతు దినోత్సవం సందర్భంగా ఆయనకు అవార్డును అందించింది. - గజ్వేల్‌ తిరుపతి, మేడ్చల్‌ రూరల్‌ 98665 60706

ఆరుతడి ఆచరణీయం

వరిలో ఆరుతడి పద్ధతులు ఆచరణీయం. దీనిద్వారా వరి పంటను తక్కువ వ్యయం, నీటితో సాగు చేయవచ్చు. ఇందుకు ఎరోబిక్‌ పద్ధతి మేలైనది. అయితే రైతులు నీటి ఎద్దడిని తట్టుకొనే కొన్ని ప్రత్యేక రకాలను సాగు చేయాలి. కలుపు మందులు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవా లి. సులభంగా సాగు చేయవచ్చు. కలుపు మందు, కొద్దిమోతాదులో ఎరువులను వేస్తే సరిపోతుంది. చీడపీడల నివారణ ఖర్చులు కూడాతక్కువే. పంట కాలం తక్కువగా ఉంటుంది. ఇలా ఎన్నో లాభాలు ఈ పద్ధతిలో ఉన్నాయి. ఎరోబిక్‌ పద్ధతిలో నీటి వినియోగం సాధారణ పద్ధతి కంటే 50 శాతం వరకు తక్కువగా ఉంటుంది. ఆ నీటితో కూరగాయలు, ఇతర పంటలను సాగు చేసుకొని, లాభపడవచ్చు. రైతులు ఈ పద్ధతిని అవలంబించాలి. - డాక్టర్‌ శ్రీదేవి, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌, ఐఐఆర్‌ఆర్‌