ఆరోగ్యమైన నారుతోనే మంచి దిగుబడి

యాసంగిలో వరి పంట సాగుచేసే రైతులు నారుమడులు చల్లుకునే నాటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రైతులు నారుమడులను చల్లుకున్న నాటి నుంచే తగిన యాజమాన్య పద్ధతులను పాటించాలి. తద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చు. TRIPURARAM

నారుమడులు చల్లే విధానం

రైతులు నారు మడులను పెంచుకోవడం కోసం ఎకరాకు 25 కేజీల నుంచి 30 కేజీల వరకు విత్తనాలను చల్లుకోవాలి. నారుమడులను చల్లుకోవడం కంటే ముందుగా రైతులు వ్యవసాయ నిపుణుల సూచనల మేరకు నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున కార్బండిజమ్ కలిపి 24 గంటల తరువాత నారుమడిలో చల్లుకోవాలి. అదే దుంప నారుమళ్లయితే లీటరు నీటికి 1 గ్రాము కార్బండిజమ్ కలిపి ఆ ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి తరువాత 24 గంటలు మండెకట్టి మొలకలను నారుమడులలో చల్లుకోవాలి. కిలో విత్తనాలు నానబెట్టడానికి లీటరు మందునీరు చొప్పున 30 కిలోల విత్తనాలు నానబెట్టడానికి 30 కిలోల మందు ద్రావణాన్ని తయారుచేసుకోవాలి.

నారుమడులు పెంచేవిధానం

-యాసంగిలో నారుమడిని చల్లుకోవడం కంటే ముందుగా పశువుల ఎరువును వేసుకుంటే నారు మడి మంచిగా పెరుగుతుంది. -పశువుల ఎరువుతో పాటు డీఏపీ లేదా ఎస్‌ఎస్‌పిని తగిన మోతాదులో చల్లుకోవాలి. -యాసంగిలో రాత్రి పూట నారుమడుల్లో నీటిని తీసివేసి పగటిపూట మాత్రమే నీటిని పెట్టుకోవాలి. -చలి బాగా ఉండటం వల్ల నారుమడులపై మంచు బాగా పడుతుంది. మంచు పడితే నారంతా కూడా చలికి ఎర్రగా మారి పెరుగుదల ఆగిపోతుంది. కాబట్టి నారుమడులపై రాత్రి సమయాలలో టార్బెల్స్‌ను కప్పుకోవడం వల్ల నారుమడులను మంచు, చలి నుంచి రక్షించవచ్చు. దీనివల్ల నారుమడులు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. -నారంతా ఒత్తుగా కాకుండా పలుచగా బెడ్‌లాగా ఎత్తుగా తయారుచేసి నీరు పెట్టడానికి, తీయడానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. ఒక సెంట్ భూమికి సుమారు 5 కిలోల చొప్పున విత్తనాలను చల్లుకోవాలి. -5 సెంట్ల నారుమడికి 2 కిలోల యూరియా, 2 కిలోల డీఏపీ, కేజీన్నర పొటాష్ దుక్కిలో చల్లుకోవాలి. విత్తిన 12 నుంచి 14 రోజులకు 2 కిలో ల యూరియా మళ్లీ వేసుకోవాలి. నారు ఒక ఆకు పూర్తిగా పురివిచ్చుకునే వరకు ఆరుతడి పద్ధతిలో నీటిని ఇచ్చి తరువాత పలుచగా నీరు కట్టాలి. విత్తిన 10 రోజులకు కార్బోప్యూరాన్ 3జి గుళికలు సెంటు నారుమడికి 160 గ్రాములు చొప్పు న చల్లుకోవాలి. నారుమడిలో ఊద నిర్మూలన కోసం బూటాక్లోరే కలుపుమందును 7.5 మిల్లీ లీటరును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎంటీయు 1010 వేసే రైతులు 25 రోజుల నారును నాటు వేసుకోవాలి. నారు ముదిరిపోయినా, పిలక కట్టినా దిగుబడి తగ్గిపోతుంది. ఎంటీయు 1010 వేసే రైతులు ఒక చదరపు మీటరుకు 44 వరకు కుదుళ్ళు వచ్చేటట్లు చూసుకోవాలి. -నగిరి హరీష్, త్రిపురారం