హైడ్రోఫోనిక్స్ విధానంలో తాజా ఆకుకూరల సాగు

కాలుష్య ప్రభావితంలేని ప్రాంతాలలో పండిన పంటలకు మార్కెట్‌లో ఎక్కువగా డిమాండు ఉంటుంది. అయితే మన ఇంటి వద్దనే స్వయంగా ఆకుకూరలను పండించుకునే అవకాశం ఉన్నది. ఎక్కువ స్థలం అవసరం లేకుండా మనకు అనుకూలంగా ఉన్న స్థలంలోనే (ఇంట్లోనే) తాజా ఆకుకూరలు, కూయగూరలను పండించుకోవచ్చు. హైడ్రోఫోనిక్స్ విధానం (మట్టిలేకుండానే)లో ఆకుకూరలు పండించుకోవచ్చు. ఈ విధానంలోతక్కువ ఖర్చుతో తాజా ఆకుకూరలు పండించుకోవచ్చు. Green

కావాల్సిన పరికరాలు

ఇంట్లో లేదా ఇంటి మేడపై హైడ్రోఫోనిక్స్ విధానంలో సాగు చేయాలనుకునే వారికి అందుకు అవసరమైన పరికరాలను కొనుగోలు లేదా తయారుచేసుకోవచ్చు. ఈసాగులో ఫైబర్, పీవీసీ, వెదురు బొంగులతో మూడు విధాలుగా చేసుకునే అవకాశం ఉన్నది. ఈ సాగుకోసం మనకు ఉన్న స్థలాన్ని బట్టి ఐదు నుంచి 10 ఫీట్ల పీవీసీ పైపులను తీసుకోవాలి. వాటికి రెండు వైపుల మూతలతో మూసివేయాలి. పైభాగంలో పావు ఫీటు వది లి రంధ్రాలను చేసుకోవాలి. దీంతో పాటు మార్కెట్‌లో దొరికే జాలి ప్లాస్టి క్ కప్పులు, ఒక బకెట్, నీటి మోటారుతో పాటు మట్టిరాళ్లను సేకరించా లి. అలాగే సాగుకు ప్రధానంగా అవసరమైన మైక్రో, మ్యాక్రో సొల్యూషన్స్ (సూక్ష్మ, స్థూల పోషకాలను ద్రావణాన్ని)సిద్ధంగా ఉంచుకోవాలి. వీటితోపాటు నీటిలోని పీహెచ్ సామర్థ్యం ఎలక్ట్రికల్ కండెక్టివిటీ శాతాన్ని చూపే రెండు చిన్న పరికరాలు కూడా అవసరమవుతాయి. విత్తనాలను మొక్క దశకు తీసుకువచ్చే విధంగా ఒక మినీ సీడ్ ట్రేలను కూడా కొనుగోలు చేయాలి. సాగును పద్ధతి ప్రకారం కొనసాగించే విధంగా వాటిని ఒకదాని కింద ఒకటి ర్యాక్‌లపై ఉంచాలి. అయితే వీటిన్నింటిని కలిపి సిద్ధం చేసుకునేందుకు మార్కెట్‌లో రూ. 12 వరకు ఖర్చు అవుతుంది. కానీ సంగారెడ్డి జిల్లా జైలు అధికారులు తయారుచేసుకోగా వారికి రూ. 4 నుంచి ఖర్చు అయిందని తెలిపారు.

సాగు విధానం

మొదటగా సీడ్ ట్రాక్‌లో మట్టిలో మనకు కావాల్సిన విత్తనాలను వేసుకుని అవసరమైన నీటిని పోయాలి. పోసిన నీటి ద్వారా సీడ్ ట్రాక్‌లో వారంరోజుల వ్యవధిలో విత్తనం మొక్కగా మారుతుంది. అలా పెరిగిన ఆ మొక్కను అన్నిపరికరాల ద్వారా తయారుచేసుకున్న హైడ్రోఫోనిక్స్ పరికరంలోని పైపుల మధ్య ఏర్పాటుచేసిన జాలి ప్లాస్టిక్ కప్పులలో క్లేబాల్స్ (మట్టిరాళ్లు) వేసి మధ్యలో మొక్కను పెట్టాలి. కింద ఒక బకెట్ లో నిండా నీరు పోసి అందులో నీటిని పంపించే మోటారును పైపుల ద్వారా అన్నింటికి అనుసంధానంచేస్తూ ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యం గా మొక్కలకు అవసరమైన సూక్ష్మ, స్థూల పోషకాలను నిపుణుల సిఫా ర్సు మేరకు వేసుకోవాలి. ద్రావణం మోతాదులను కూడా ప్రత్యేక పరికరాల ద్వారా పరిక్షించుకోవాలి. ఉదజని సూచిక 5.5 నుంచి 6.5 వరకు ఉండేలా చూసుకోవాలి. అలాగే ఎలక్ట్రికల్ కండెక్టివిటీ 1500 పీపీఎం కంటే తక్కువగా ఉండాలి. వీటిని సూర్యరష్మి తగులకుండా ఇంట్లో పరిశుభ్రమైన స్థలంలో ఏర్పాటు చేసుకోవాలి. పీవీసీ పైపుల మధ్యభాగంలోని జాలీ కప్పులలో ఉంచిన మొక్కలను మోటారు ద్వారా నిరంతరం నీటిని అందిస్తుండాలి. ముఖ్యంగా ఈ మొక్కలకు రోజుకు కనీసం రెండు గంటలు ఎండా తగిలే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్క పెరిగే ప్రదేశంలో 30 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ఇలా రోజూ చేయడం ద్వారా మొక్కలు పెట్టిన నాటి నుంచి తక్కువ సమయంలోనే మనకు కావాల్సిన తాజా ఆకుకూరలు, కాయగూరలు అందుబాటులోకి వస్తాయి. వేసిన పంట రెండు నుంచి మూడుసార్లు మన చేతికి అందుతుంది. ఈ హైడ్రోఫోనిక్స్ విధానం ద్వారా అరమీటరు పొడువు పెరిగే అన్నిరకాల ఆకుకూరలు, కాయగూరలను ఇంట్లోనే పండించుకోవచ్చు. Green1

మట్టి అవసరం లేకుండా..

మట్టి అవసరం లేకుండా ఇంట్లోనే వ్యవసాయాన్ని చేసుకునే వీలు ఉంటుంది. ఈ పద్ధతిలో రెండు లాభాలు ఉంటాయి. ఒకటి అధిక దిగుబడి పంటను పొందడం, రెండవది సాధారణ వ్యవసాయం సాధ్యం కాని చోట ఈ విధానాన్ని అనుసరించి పంటను పొందవచ్చు. తక్కువ వ్యవధిలో ఎక్కువ పంట చేతికి అందుతుంది. సాధారణ పంట పొలాల్లో అవసరమయ్యే నీటిలో 20 శాతం నీటినే వినియోగించి ఈ పంటను పడించుకోవచ్చు. అలాగే కలుపు సమస్య ఈ పద్ధతి ద్వారా అంతగా ఉండదు. చీడపీడల బాధ కూడా ఉండదు. బయటి వాతావరణంతో సంబంధం లేకుండా ఏడాది పొడవుగా ఈ పంటలను సాగుచేసుకుని అధిక దిగుబడులు పొందవచ్చు. ఈ తరహా సాగు ద్వారా ఆకుకూరలే కాకుండా కాయగూరలు, పండ్లు, పూల పంటలను కూడా సాగు చేసుకునే అవకా శం ఉంటుంది.ఈ పద్ధతి ద్వారా పంటలు పండిస్తే ఆరోగ్యకరమైన పంటలు పొందే అవకాశం ఉన్నది. ఈ తరహా సాగుకు ప్రోత్సాహం అందిస్తే మంచిదని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. Green2

ప్రయోగాత్మకంగా సంగారెడ్డి జిల్లా జైలులో..

సంగారెడ్డి జిల్లా జైలులో గతంలో అనేక కొత్త సంస్కరణలు తీసుకురాగా ప్రస్తుతం ఈ జైలు రాష్ట్రంతో పాటు ఇతర జైళ్లకు ఆదర్శంగా నిలుస్తున్నది. తాజాగా జిల్లా జైలు అధికారుల కృషితో కొత్తగా హైడ్రోఫోనిక్స్ విధా నంలో సాగుకు శ్రీకారం చుట్టారు. ప్రయోగాత్మకంగా ఇక్కడ చేపట్టిన ఈ వ్యవసాయానికి మంచి ఫలితాలు వచ్చాయి. ఈ సాగుకు అవసరమ్యే పరికరాలను జైలు అధికారులే స్వయంగా తక్కువ ఖర్చుతో తయారు చేసుకుని రెండు, మూడు పంటలను కూడా పండించి వాటి ఫలితాలను చూశారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మొదటి దఫా ప్రయత్నంగా సాగు చేయడానికి అవసరమైన పరికరాలు 80శాతం సొంతంగా తయా రు చేసుకోగా మిగతా వస్తువులను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుని తెప్పించు కున్నామని జైలు అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ తరహా సాగును పెంచి జైలులోని ఖైదీలకు మంచి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని సంకల్పించామని వారు తెలిపారు. బయట మార్కెట్‌లో ఈ సాగుకు అవసరమయ్యే పరికరాలు కోసం రూ. 12వేల వరకు ఖర్చు అవుతుంది. జైలులో స్వయంగా తామే తయారుచేసుకోవడం ద్వారా తమకు రూ. 4వేల వరకు ఖర్చు వచ్చిందని జైలు సూపరింటెండెంట్ శివకుమార్‌గౌడ్ వివరించారు. - మద్దికుంట శ్రీనివాస్, కంది, 9963121222