తక్కువ సమయంలో చేతికొచ్చే దోస

doosa తీగజాతి కాయగూరల్లో మిగిలిన వాటితో పోలిస్తే దోస చాలా తక్కువ సమయంలోనే చేతికి వచ్చే పంట. దీన్ని కాయగూరగా వాడటమే కాకుండా పచ్చిముక్కలు (సలాడ్)గా తీసుకుంటాం. కీరదోసకు ఎండకాలంలో మంచి డిమాండు ఉంటుంది. దోస సాగు గురించి ఉద్యానశాఖ అధికారులు అందించిన వివరాలు. వాతావరణం: వేడి వాతావరణం అనుకూలం. ఉష్ణోగ్రతలలోని తేడాల వల్ల ఆడ, మగ పూల నిష్పత్తిలో చాలా తేడాలు వస్తాయి. కూరదోస రకాలు ఆర్.ఎన్.ఎస్.ఎం.-1: ఇది నీటి ఎద్దడిని తట్టుకుని అధిక దిగుబడిని ఇచ్చే రకం. వేసవికి కూడా అనువైనది. ఆర్.ఎన్.ఎస్.ఎం.-3: నీటి ఎద్దడిని తట్టుకోవడంతో పాటు బూజు, బూడిదతెగుళ్లను కూడా తట్టుకునే రకం. ఇది కూడా వేసవికి అనువైనది. పచ్చిదోస రకాలు జపనీస్ లాంగ్ గ్రీన్: కాయలు 30-40 సెం. మీ. పొడవు. ఆకుపచ్చగా ఉంటాయి. త్వరగా కోతకు వస్తుంది. స్రెయిట్ ఎయిట్: కాయలు మధ్యస్థ పొడవుతో ఉండి స్థూపాకారంలో గుండ్రటి చివరలు కలిగి, మధ్యస్థ ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పంటకాలం: యాసంగిలో డిసెంబర్ రెండవ పక్షం నుంచి మార్చి చివరి వరకు వేసుకోవచ్చు. విత్తనశుద్ధి: కిలో విత్తనానికి 5 గ్రా. ఇమిడాక్లోప్రిడ్ మందు కలిపి విత్తనశుద్ధి చేయాలి. అదే విత్తనానికి 3 గ్రాముల థైరం లేదా కాప్టాన్ కలిపి విత్తనశుద్ధి చేయాలి. విత్తే విధానం: రెండు వరుసల మధ్య 1.5-2.5 మీటర్ల దూరం ఉండేటట్లు 80 సెం.మీ. వెడల్పు గల కాలువలు తయారుచేసుకోవాలి. కాలువ లో రెండు పాదుల మధ్య 0.5 (ఎండాకాలం) సెం.మీ. దూరంలో విత్తుకోవాలి. ఎరువులు: ఆఖరి దుక్కిలో 8-10 టన్నుల పశువుల ఎరువు, 40కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులు వేయాలి. విత్తిన 30 రోజులకు గొర్రు లేదా గుంటకతో అంతరకృషి చేయాలి. మొక్కలు 2-4 ఆకుల దశలో బోరా క్స్ 3-4 గ్రా/లీ. లేదా ఇథరిల్ 2.5 మి.లీ/10 లీ. నీటికి కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేస్తే ఆడపూలు ఎక్కువగా వస్తాయి. నీటియాజమాన్యం: గింజలు మొలకెత్తే వరకు వెంటనే నీరు పారించాలి. ఆ తర్వాత నేల స్వభావా న్ని, కాలాన్ని బట్టి 7-10 రోజులవ్యవధిలో నీరు ఇవ్వాలి. -ఆసరి రాజు