మునగలోఎరువులు, పురుగుల యాజమాన్యం

TRIPURARAM మునగ సాగులో రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. దీనివల్ల పెట్టుబడులు, శ్రమ తగ్గడమే కాకుండా అధిక దిగుబడులను సాధించవచ్చు. రైతులు మునగ విత్తనాలు నాటి నుంచి మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ సాగు చేపడితే కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది.

ఎరువుల యాజమాన్యం

ప్రతి పాదులో 10 కిలోల పశువుల ఎరువుతో పాటు 250 గ్రాముల వేపపిండి, 250 గ్రాముల సూపర్‌ పాస్ఫేట్‌ కలిపి వేయాలి. ఆలస్యంగా నాటితే మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటే పూతరాలి కాపురావడం నిలిచిపోతుంది. మొక్కలు 75- 90 సెంటీమీటర్లు పొడవు పెరిగిన తరువాత కొమ్మలను కత్తిరిస్తే ఏపుగా పెరిగి అధిక దిగుబడి వస్తుంది.

పురుగుల యాజమాన్యం

మునగను ఆశించే పురుగుల్లో గొంగలి పురుగు ప్రధానమైనది. గొంగలిపురుగు నివారణకు క్వినాల్‌ఫాస్‌ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. దీంతో పాటు ఒక్కొక్క చెట్టుకు పాదులో 30 గ్రాములు కార్ట్రాలిన్‌పొడి, కార్భోఫ్యూరాన్‌ గుళికలు వేసుకోవాలి. కాయతొలుచు ఈగ నివారణకు పూత ప్రారంభదశలో జోలోన్‌, పూర్తిగా పూత వచ్చిన తరువాత రోగార్‌, పిందెకట్టిన దశలో ఫిప్రొనిల్‌ 2 మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. - నగిరి హరీష్‌, త్రిపురారం