మామిడిలో సస్యరక్షణ

మామిడిలో పూతపూసే దశ నుంచి చెట్లను తెగుళ్లు, పురుగులు బాగా ఆశించి తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. ముఖ్యంగా మామిడి ఆశించి పురుగులలో పండుఈగ ఎంతో ప్రమాదకరమైంది. ఈ పండుఈగను రైతులు సమర్థవంతంగా నివారిస్తే మామిడికి మార్కెట్‌లో మంచి గిరాకీ వస్తుంది. xoai-cat-chu మామిడి తోటల్లో చీడపీడల నివారణ ప్రధానమైన సమస్య. తోటల్లో కొత్తచిగురు వచ్చే దశ నుంచి కాయకోత దశ వరకు వివిధ రకా ల పురుగులు, తెగుళ్లు ఆశించి నష్టాన్ని కలిగిస్తాయి. లేత ఇగురు, పూత, పిందదశలో వచ్చే చీడపీడలతో పోలిస్తే పండు పక్వానికి వచ్చే దశలో ఆశించే చీడపీడలు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. వీటిని నివారణ చాలా కష్టం. మామిడితోటల్లో పండు పక్వానికి వచ్చే దశలలో ఆశించే పండు ఈగ (కాయను కొట్టే ఈగ) చాలా ప్రమాదకరమైంది. దీనిని నివారించకపోతే రైతులకు కాయకోసే దశలో తీవ్రనష్టం వాటిల్లుతుంది.

పండు ఈగతో నష్టం

పండు ఈగ మామిడి దిగుబడిపైనే కాకుండా మామిడి ఎగుమతులపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఈ ఈగ నివారణకు చేపట్టే యాజమాన్య పద్ధతులపై అవగాహనలేని రైతులు విపరీతంగా రసాయన పురుగు మందులను నేరుగా మామిడిపండ్లపై పిచికారీ చేస్తారు. దీనివల్ల పండ్లలో పురుగుమందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన ఇతర దేశాలు మన దేశ పండ్ల ఎగుమతులను నిషేధిస్తున్నాయి. అందువల్ల మామిడి సాగులో పండు ఈగ నివారణ ప్రధానమైంది.

పండుఈగల వ్యాప్తి

పండుఈగలు సుమారు 50-100 కిలోమీటర్ల దాకా ప్రయాణించి ఇతరప్రాంతాల్లో వృద్ధి చెందుతాయి. పురుగు ఆశించిన పండ్లు ఇత ర ప్రాంతాలకు తరలించడం ద్వారా కొత్త ప్రాంతాలలో వీటి వ్యాప్తి జరుగుతుంది. వీటి వ్యాప్తిని నిరోధించడం కేవలం పురుగుమందు ల వాడకం ద్వారానే సాధ్యపడదు. దీనికి సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించాలి. తోటలు కాపు దశకు వచ్చిన నాటి నుంచి పండ్లు కోత కోయడం, నిల్వ చేయడం, పండ్లను ఎగుమతిచేసే వరకు రైతులు తగిన చర్యలు తీసుకోవాలి. TRIPURARAM1

నివారణ మార్గాలు

రైతులు ముందుగా ఈగ కొట్టిన పండ్లను గుర్తించాలి. దీనికోసం కాయలపై ఈగలు గుడ్లు పెట్టడానికి చేసినటువంటి సన్నని రంధ్రాలను గుర్తించి ఆ కాయలను వేరుచేసి వెంటనే నాశనం చేయాలి. ఈగ కొట్టిన కాయలు పసుపురంగులోకి మారి కుళ్లిపోయి చెట్టునుంచి రాలిపడుతాయి. అటువంటి పండ్లను ఏరి నాశనం చేయాలి. చెట్లకింద నేలను దున్ని పురుగు కోశస్థదశలు బయట పడేలాగా చేయాలి. చెట్టుకు 50-100 గ్రాముల చొప్పున కార్బరిల్ 10 శాతం పొడిని వేసి భూమిలో కలియదున్నితే పురుగు కోశస్థదశలు చనిపోతాయి. ప్రతి 20 మామిడిచెట్లకు ఒక ఆకర్షణ పళ్లాన్ని ఉంచా లి. ఆకర్షణ పళ్లెంలో మిథైల్‌యూజినాల్ 10 మిల్లీలీటర్ల చొప్పున 200 మిల్లీలీటర్ల నీటిలో కలుపాలి. అప్పుడు ఆ ద్రవం ఎర్రగా మారి ఈ ద్రావణానికి మగ ఈగలు ఆకర్షింపబడతాయి. ఈ ద్రావణంలో 20 మిల్లీలీటర్ల మలాథియాన్ లేదా 3 గ్రాములు కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు కలిపితే ఈగలు ఈ మందును తాగి చనిపోతాయి. కాయలను కోతకోయడానికి మూడు వారాల ముందు 2 మిల్లీలీటర్ల మలాథియాన్‌ను లీటరు నీటిలో కలిపి మామిడి తోట లో పిచికారీ చేయాలి. మామిడిపండ్లను ఎగుమతి చేసే రైతులు పండ్లు పూర్తిగా పక్వానికి రాక ముందే పండ్లను కోసి నిల్వచేయడం వల్ల పండ్లను పండుఈగ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. రైతులు మామిడిపండ్లను ఎగుమతి చేసే ముందు వాటిలోని గుడ్డు, పిల్ల పురుగు దశలను నాశనం చేయడానికి వాటిని 48 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత గల వేడినీళ్లలో పండ్లను 60 నుంచి 75 నిమిషాల పాటు ఉంచాలి. ఆలస్యంగా కోతకు వచ్చే నీలం, తోతాపురి మామిడి పండ్ల రకాలలో ఈ పండు ఈగల బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రకాలను సాగుచేసే రైతులు పండుఈగ నివారణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. -నగిరి హరీష్, త్రిపురారం