మిద్దె తోట సాగు సూచనలు

ROOF-AGRI కాంక్రీట్‌ జంగిల్‌లుగా మారుతున్న నగరాలు, పట్టణాల్లో అటు పచ్చదనానికి, ఆరోగ్యాన్ని పెంచే అద్భుత వ్యాపకంగా మిద్దె తోటలు ఉన్నాయి. తాజా కూరగాయలు పండించటంతోపాటు రసాయనాలు లేని ఆహారం సొంతంగా తయారుచేసుకొనే ఈ తరహా తోటలు పెంచుకోవటానికి పలువురు పట్టణవాసులు ఆసక్తి చూపుతున్నారు. నెమ్మదిగా ఈ పద్ధతి జిల్లా కేంద్రాలు, పురపాలక, మండల కేంద్రాలకు కూడా వ్యాపించటం సంతోషించదగ్గ విషయం. మిద్దె తోటలు ఏర్పాటు చేసుకోవాలనుకొనేవారికి ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్‌ పిడిగం సైదయ్య అందిస్తున్న వివరాలు..

ఎలాంటి గృహాలు మిద్దె తోటల సాగుకు అనుకూలం?

పక్కా ఇల్లు అయి ఉండి దృఢంగా ఉండాలి. భీమ్‌పైన మట్టి తొట్లు పెడితే వాటి బరువును తట్టుకొని నిలబడేలా ఉండాలి. భవనంపై సూర్యరశ్మి పుష్కలంగా ఉండాలి. తోటలు పెంచుకోవటానికి మిగతా అన్ని వనరులు అందుబాటులో ఉన్నా సూర్యరశ్మి అందకపోతే పంటలు మందకొడిగా ఎదుగుతాయి. పురుగులు, తెగుళ్లు ఎక్కువగా ఆశిస్తాయి. ఎక్కువకాలం శాఖీయ దశలోనే ఉండిపోతాయి. ముఖ్యంగా పండ్లతోటలు, పండ్లు, కాయలనిచ్చే కూరగాయల పెంపకానికి సూర్యరశ్మి పుష్కలంగా అందాలి. కుండీలు, తోట్లు, మట్టితోకూడిన నిర్మాణాల నుంచి వచ్చే మురుగునీరు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేందుకు అనువుగా ఉండాలి. ప్రధాన రహదారులు, ఫ్యాక్టరీలకు దగ్గరగా ఉన్న గృహాలపై ప్రదేశంలో దుమ్ము ఎక్కువగా పడుతుంది. దాంతో కిరణజన్యసంయోగ క్రియ తక్కువగా జరిగి మొక్కల పెరుగుదల తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇలాంటి గృహాలపై తోటలను పెంచకపోవటం మేలు.