యాసంగిలో పల్లి సాగు పద్ధతులు

రాష్ట్రంలో యాసంగి పంటగా సాగు చేసే నూనెగింజల పంటల్లో పల్లి ముఖ్యమైనది. వానకాలంలో వర్షాధారంగా, యాసంగి, ఎండాకాలాల్లో నీటి పారుదల కింద సాగుచేయబడుతుంది. యాసంగి పంటగా దీనిని సాగు చేసుకునేందుకు సమయం ఇదే. దీనిని సాగు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడులు పొందవచ్చునని వ్యవసాయ నిపుణులు సూచించారు. పల్లి సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను గురించి గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం మృత్తిక శాస్త్రవేత్త అరిగెల కిరణ్ వివరించారు. అదనపు సమాచారం కోసం 7893989055 నెంబర్‌ను సంప్రదించవచ్చు. ఆ వివరాలు.. groundnut విత్తనశుద్ధి పాటించకపోవడం, విత్తన మోతాదు తగ్గించి వాడ టం, పాత విత్తనం వాడకంలో మొలక శాతం తగ్గడం, దగ్గర దగ్గర నీటి తడులు ఇవ్వడం, కలుపు నివారణ చేయకపోవడం వంటివి పల్లిలో దిగుబడులు తగ్గడానికి కారణాలు. విత్తే సమయం: అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు దక్షిణ తెలంగాణ మండలానికి, సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు ఉత్తర తెలంగాణ మండలానికి అనువైన సమయం. నేలల ఎంపిక : పల్లి పంటకు నీరు త్వరగా ఇంకే తేలిక నేలలు చాలా అనుకూలం. సేంద్రియ పదార్థము తగినంతగా ఉండి కాల్షియం, గంధకము ఉండే భూములు శ్రేష్టమైనవి. ఉదజని సూచిక 6 నుంచి 7.5 వరకు ఉన్న నేలలు మంచివి. ఎక్కువ బంక మన్ను గల నల్లరేగడి నేలల్లో పంట వేయకూడదు. అనుకూలమైన రకాలు: కదిరి- 6 (చిన్న రకం. రాష్ట్రంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న రకం), కదిరి-9 (నీటి ఎద్దడిని, ఆకుమచ్చ తెగులును సమర్థవంతంగా తట్టుకుంటుంది) టిఎజి-24 (యాసంగి, ఎండాకాలం సాగుకు అనువైన రకం), టిఎజి-24 (యాసంగి, ఎండాకాలం సాగుకు అనువైన రకం) వీటితో పాటు ఇంకా నిపుణులు సూచించిన రకాలు. కదిరి-7, కదిరి-8 (పెద్ద గుత్తి రకాలు, పచ్చికాయలు అమ్మడానికి అనువైనవి) నేల తయారీ: ఎండాకాలంలో లోతు దుక్కులు చేయడం వలన పంటను నష్టపరిచే కీటకాలు, తెగుళ్ళు ఉధృతిని తగ్గించవచ్చు. విత్తే ముందు నేలను మెత్తగా దుక్కి చేసి చదును చేయాలి. విత్తన మోతాదు:గింజ బరువు, విత్తే సమయాన్ని బట్టి విత్తన మోతాదు మారుతుంది. యాసంగికి ఒక ఎకరాకు 60 నుంచి 70 కిలోలు విత్తాలి. విత్తనశుద్ధి: కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా 2 గ్రాముల కార్బండిజిమ్ పొడి మందును పట్టించాలి. కాండం కుళ్ళు, వైరస్ తెగులు ఆశించే ప్రాంతాలో కిలో విత్తనానికి 2 మి.లీ.ల ఇమిడా క్లోప్రిడ్ మందుతో విత్తనశుద్ధి చేయాలి. వేరు పురుగు ఉధృతి ఉన్న ప్రాంతంలో కిలో విత్తనానికి 6.5 మి.లీ.ల క్లోరిపైరిఫాస్, లేదా 2 మి.లీల ఇమిడా క్లోప్రిడ్ క్రిమిసంహారక మందులతో శుద్ధి చేసి ఆరబెట్టాలి. తర్వాత రైజోబియం కల్చర్ పట్టించి (ఎకరాకు 200 గ్రాములు) విత్తుకోవాలి. మొదలు కుళ్ళు, కాండం కుళ్ళు తెగుళ్ళు ఎక్కువగా ఆశించే ప్రాంతాలలో కిలో విత్తనానికి నాలుగు గ్రాముల ట్రైకోడెర్మా విరిడి పట్టించాలి. విత్తనాన్ని మొదట క్రిమిసంహారక మందులో శుద్ధి చేసి ఆరబెట్టాలి. తర్వాత శిలీంద్ర నాశినితో శుద్ధి చేయాలి. విత్తే దూరం: నీటి పారుదల కింద యాసంగి పంటలో గుత్తి రకాలకు 22.5x 10 సెంటీ మీటరు, తీగ గుత్తి రకాలకు 22.5x15 సెం.మీల దూరం విత్తుకోవాలి. విత్తే పద్ధతి: విత్తనాన్ని గొర్రుతో గానీ లేక నాగలి చాళ్ళలో గానీ లేక ట్రాక్టర్‌తో నడిపే విత్తు యంత్రంతో గానీ విత్తాలి. విత్తే సమయంలో నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు 5 సెంటీమీటర్ల లోతు మించకుండా విత్తుకోవాలి. ట్రాక్టర్ డ్రిల్‌ను వాడినైట్లెతే తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణం విత్తుకోవడమే కాక ఖర్చును కూడా గణనీయంగా తగ్గించుకోవచ్చు. groundnut3 ఎరువుల మోతాదు: భూసార పరీక్షలు అనుసరించి ఎరువుల మోతాదును నిర్ణయించుకోవాలి. సాధారణంగా ఎకరాకు పశువుల ఎరువు 10 బండ్లు, వేప పిండి 150 కిలోలు చివరి దుక్కిలో వేయాలి. జింక్ సల్ఫేట్ ఎకరాకు 20 కిలోల చొప్పున 3 పంటలకొకసారి వేయాలి. నత్రజని ఎకరాకు (యూరియా రూపంలో) 27 కిలోలు, భాస్వరం ఎకరాకు (సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో) 125 కిలోలు, పొటాష్ ఎకరాకు (మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో) 35 కిలోలు వేయాలి. యూరియా 27 కిలోలు దుక్కిలో, 9 కిలోలు విత్తిన 30 రోజులకు అందించాలి. భాస్వరం, పొటాష్‌లను విత్తే ముందు దుక్కిలో వేయాలి. కాల్షియం, గంధక మూలకాలను అందించే జిప్సంను ఎకరాకు 200 కిలోల చొప్పున తొలి పూత దశలో మొక్క మొదళ్ల దగ్గర చల్లి నేలలో కలిసేటట్లు చేసి నీరు పెట్టాలి. సేంద్రియ ఎరువుల వాడకం లేకపోవటం వలన సూక్ష్మధాతు లోపాలు కనిపిస్తాయి. నీటి పారుదల కింద సాగు చేసే పంటకు ఎకరాకు 4 కిలోల బోరాక్స్‌ను విత్తేటప్పుడు వేయాలి. బోరాన్ గింజల అభివృద్ధికి అవసరమవుతుంది. ఇనుముధాతు లోపం కనిపించినైట్లెతే (ఆకులు పాలి పోయి ఉంటే ) లీటరు నీటికి ఫెర్రస్ సల్ఫేట్ 5 గ్రామలు + ఒక మిల్లీ లీటరు సిట్రిక్ ఆమ్లం కలిపి పిచికారీ చేసి నివారించవచ్చు. జింక్ లోపముతో ఆకుల ఈనెలు ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్య భాగము పసుపు పచ్చగా మారితే 0.2 శాతం జింక్ సల్ఫేట్ ( లీటరు నీటికి 2 గ్రాములు) పిచికారీ చేయాలి. కలుపు నివారణ : కలుపు మొలకెత్తే ముందు నశింపజేయగల కలుపునాశనులు అయిన అలాక్లోర్ 50 శాతం ఎకరాకు ఒక లీటరు లేదా పెండి మిథాలిన్ 30 శాతం ఎకరాకు 1.3- 1.6 మి.ల.లను ఏదో ఒకదానిని 200 లీటరుల నీటికి కలిపి విత్తిన వెంటనే గానీ లేదా 2, 3 రోజులలోపు నేలపై పిచికారీ చేసుకోవాలి. విత్తిన 45 రోజులలోపు ఎలాంటి కలుపు లేకుండా చూడాలి. 45 రోజుల తదుపరి ఏ విధమైన అంతరకృషి చేయకూడదు. లేనిచో ఊడలు దెబ్బతిని దిగుబడులు తగ్గుతాయి. groundnut2 సాగునీటి యాజమాన్యం: సంవత్సరం వర్షపాత 400-450 మి. మీటర్లు ఉన్న ప్రాంతాలు పల్లి సాగుకు అత్యంత అనుకూలం. తేలిక నేలల్లో 8,9 తడులు పెడితే సరిపోతుంది. విత్తే ముందు నేల బాగా తడిసేటట్లు నీరు పెట్టి తగినంత తేమ ఉన్నప్పుడు విత్తనం వేయాలి. రెండో తడిని విత్తిన 20 నుంచి 25 రోజులలో (మొదటి పూతలో) ఇవ్వాలి. ఆ తర్వాత నేల స్వభావాన్ని బట్టి 8 నుంచి 10 రోజులకోమారు నీటి తడి ఇవ్వాలి. ఆఖరి తడి పంట కోతకు 15 రోజలు ముందు ఇవ్వాలి. ఊడలు దిగే దశ నుంచి కాయలు ఊరే దశ వరకు (విత్తిన 45-50 రోజుల నుంచి 85-90 రోజుల వరకు) సున్నితమైనది. కాబట్టి ఈ దశలో నీరు సక్రమంగా తగు మోతాదులో కట్టుకోవాలి. నీటిని స్ప్రింకర్ల ద్వారా అందిస్తే 25 శాతం నీటి ఆదాతో పాటు దిగుబడి పెరుగుతుంది. సస్యరక్షణ: పల్లి సాగు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలి. దీనివల్ల వాతావరణ కాలుష్యం తగ్గటమే కాకుండా మిత్ర పురుగులు రక్షించబడుతాయి. పెట్టుబడి తగ్గి పంట నాణ్యత, దిగుబడి పెరుగుతుంది. ఉదాహరణకు వేప కషాయం, వేప నూనెలను పిచికారీ చేసి పురుగులను నియంత్రించాలి. లింగాకర్షక బుట్టలను ఉపయోగించి పురుగు ఉధృతిని అంచనా వేయాలి. వైరస్ (యన్.పి.వి ) ద్రావణం పిచికారీ చేసి పచ్చ పురుగులను, విషపు ఎర ద్వారా లద్దె పురుగులను నివారించవచ్చు. -నట్టె కోటేశ్వర్‌రావు, 9989944945 గరిడేపల్లి, సూర్యాపేట జిల్లా a-kiran

జాగ్రత్త పాటిస్తే మంచి దిగుబడులు

యాసంగి పంటగా సాగు చేసే పల్లిలో చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చు. సరైన నేలలను ఎంపిక చేసుకోవాలి. విత్తడానికి ముందు విత్తనశుద్ధి చేసి సూచించిన దూరంలో విత్తుకోవాలి. తర్వాత అవసరం మేరకు ఎరువులు వేస్తూ నీటి తడులను ఇస్తే మంచి దిగుబడులను పొందవచ్చు. నీటిని స్ప్రింక్లర్ ద్వారా అందజేస్తే నీటి పొదుపుతో పాటు మంచి దిగుబడులు పొందవచ్చు. - అరిగెల కిరణ్, కేవీకే మృత్తిక శాస్త్రవేత్త, గడ్డిపల్లి