దీర్ఘకాలిక సిరుల పంట శ్రీగంధం

శ్రీ గంధం నిత్య పచ్చని చెట్టు. ఇది 13 నుంచి 16 మీటర్ల వరకు పెరుగుతుంది. ఈ చెట్లును పెంచడానికి తెలంగాణ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. దీనిని రైతు పొలాల్లో వ్యవసాయ పంటలతో పాటు సాగు చేయవచ్చు. ఈ చెట్టు నుంచి వచ్చే తైలం, చేవ సబ్బుల తయారీ ఫ్యాక్టరీలల్లో, ఔషధాలల్లో, సుగంధ ద్రవ్యాలల్లో, అత్తరు తయారీలో వాడుతారు. అందుకే శ్రీగంధం తైలము, చేవకు మంచి గిరాకీ ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా 15 రకాల శ్రీ గంధం రకాలు ఉన్నాయి. అయితే భారతదేశ శ్రీగంధానికి చాలా విలువ ఉన్నది. సాధారణంగా పెంచే ఈ చెట్లు 30 ఏండ్లకు తగిన ప్రతిఫలం ఇస్తుంది. సరైన యాజమాన్య పద్ధతులు అవలంబించటం ద్వారా 15-20 ఏండ్లలో మంచి దిగుబడి వస్తుంది. Sandalwood-Cultivation

వాతావరణం:

ఈ చెట్టు వేడి, గాలిలో తేమ కలిగిన వాతావరణంలో 12 - 35 డిగ్రీల సెల్సియస్ గల ప్రదేశాలలో సంవత్సరానికి 800 నుంచి 900 మి.మీ. వర్షపాతం గల ప్రాంతాలలో పెరుగుతుంది.

నేలలు:

నీరు నిలువ ఉండని, సారవంతమైన సేంద్రియ పదార్థం గల అన్నిరకాల నేలలు అనుకూలం. ముఖ్యంగా ఎరుపు నేలలు, ఉదజని సూచి 6.5-7.5 వరకు ఉండాలి. మొరం కలిగిన క్షార గుణం కలిగిన నేలలు, గుళకరాళ్ళ భూములలోనూ దీనిని పెంచవచ్చు.

నేల తయారీ:

శ్రీగంధం పెంచాలనుకున్న నేలను 2-3 సార్లు అడ్డం నిలువుగా దున్ని కలుపు లేకుండా చేయా లి. వేడి, వర్షాభావ పరిస్థితులు గల ప్రాంతాలలో కందకాలు తవ్వి వాటిలో 13X13 దూరంలో మొక్కలను 45 సెం.మీ X45 సెం.మీ లోతు గుంతలు తవ్వి, వాటిలో మొక్కలను నాటలి. వాటి దగ్గర కంది, కరివేపాకు, దీర్ఘకాలికంగా క్యాషురీనా చెట్లను 6X6 ఇరువైపుల నాటాలి. లేదా పండ్ల మొక్కలను కూడా నాటుకోవచ్చు. మురుగునీటి సౌలతి లేని భూముల్లో ఎత్తు బెడ్లు చేసి 45X45 సెం.మీ. గుంతలలో చెట్లను నాటాలి.

మొక్కల ఎంపిక:

15-30 ఏండ్ల వయస్సు కలిగిన చెట్ల నుంచి సేకరించిన విత్తనాలను మాత్రమే ఎన్నుకోవాలి. సాధారణంగా 7-8 నెలల వయసు ఉండి 30-35 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన మొక్కలను పొలంలో నాటుకోవడానికి ఎన్నుకోవాలి. తవ్విన గుంతలను కొన్నిరోజుల వరకు వదిలివేయాలి. ఎండ తగిలేలా చేసినా చెద పురుగులు, క్రిమికీటకాలు నశిస్తాయి. వర్షాకాలంలో గుంతలలో గడ్డి లేదా చెత్తవేసి తగులబెట్టాలి. నాణ్యమైన దిగిబడికి తైల ఉత్పాదనకు జీవన ఎరువులు వాడాలి.

నీటి యాజమాన్యం:

ఈ చెట్లకు నీటి సౌలతి ఉంటే ఏడాది పొడువునా పెంచవచ్చు. వర్షాభావ పరిస్థితులలో, ఎండాకాలంలో ప్రతి 2-3 వారాలకు ఒకసారి నీరు పెట్టాలి. బిందుసేద్యంతో కూడా నీరు పారించవచ్చు. ఈ చెట్టుకు వానకాలంలో నీటి అవసరం ఉండదు. వానకాలంలో మురుగునీరు పోయే సదుపాయం కల్పించాలి.

ఎరువుల యాజమాన్యం:

శ్రీగంధం చెట్ల నుంచి మంచి దిగిబడి సాధించడానికి బాగా చివికిన పశువుల ఎరువు, కంపోస్ట్, వర్మీకంపోస్ట్, లేదా కుళ్ళిన సేంద్రియ ఎరువులు వాడాలి. ఒక చెట్టుకు సంవత్సరానికి 10 నుంచి 15 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు, 150:100:100 గ్రాముల ఎన్‌పీకే ఐదేండ్ల వరకు రెండు దఫాలుగా జూన్- జూలై, అక్టోబర్- నవంబర్ నెలల్లో వేయాలి. కలుపు నివారణ: ఎప్పటికప్పుడు కలుపు నివారణ చర్యలు చేపట్టాలి. groundnut4

సస్యరక్షణ:

పురుగులు, రోగాల నివారణకు జీవ సంబంధ పదార్థాలైన వేపగింజల కషాయం, చిత్రమూలము, ఉమ్మెంత లేదా గోమూత్రము వాడాలి. జీవ శిలీంద్ర క్రిమినాశనులైన వర్టీసీలియం, సూడోమోనాస్ మొదలైనవి వాడాలి.

పంటకోత, దిగుబడి:

సాధారణంగా శ్రీగంధం 30 ఏండ్లకు ఒక చెట్టు 20 నుంచి 25 కిలోల చేవ (heartwood) ఇస్తుంది. కానీ మంచి యాజమాన్య పద్ధతులు అవలంబిస్తే 15 నుంచి 20 సంవత్సరాలలో అంతే దిగుబడి ఇస్తుంది.

ప్రభుత్వ రాయితీ వివరాలు:

అగ్రో ఫారెస్ట్రీ మిషన్ కింద మొక్కకు సాగు ఖర్చు 70 రూపాయలు. 50 శాతం రాయితీతో మొక్కకు 35 రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాలలో ఇవ్వబడును. 1) మొదటి సంవత్సరం - రూ. 14, 2) రెండవ సంవత్సరం - రూ 7, 3) మూడవ సంవత్సరం - రూ 7, 4) నాల్గవ సంవత్సరం - రూ 7 * మరిన్ని వివరాలకు జిల్లా ఉద్యాన అధికారిని సంప్రదించవచ్చు. -ఆసరి రాజు l-v-r-reddy

సిరులు కురిపించే పంట

శ్రీగంధం దీర్ఘకాలంలో తప్పనిసరిగా సిరులు కురిపించే పంట. తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడి ఖర్చులతో లాభాలను ఇస్తుంది. అంతర్జాతీయంగా మంచి ధర పలుకుతుంది. నీటి వసతి ఉంటే సంవత్సరమంతా నాటుకోవచ్చు. పదేండ్ల కాలంలో పెట్టుబడికి పదుల రెట్లతో లాభాలను ఇస్తుంది. అటవీశాఖ కూడా శ్రీగంధం సాగుకు అనుమతిని ఇస్తుంది. ఈ పంట సాగుపై ఉద్యానశాఖ కూడా శిక్షణ ఇస్తుంది. పంటల వైవి ధ్యీకరణలో భాగంగా శ్రీగంధం సాగును ప్రోత్సహిస్తున్నాం. -ఎల్. వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర ఉద్యాన శాఖ సంచాలకులు