నికర ఆదాయ డ్రాగన్‌ఫ్రూట్

డ్రాగన్‌ఫ్రూట్ పండ్లకు థాయిలాండ్ దేశం ప్రసిద్ధి. ఈ డ్రాగన్ ప్రూట్ పూలు రాత్రిపూట మాత్రమే విచ్చుకుంటాయి. అందుకే దీనిని క్విన్ ఆఫ్ నైట్ అంటారు. ఈ పండ్లకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉన్నది. అందుకే మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్‌లో మొల్కపట్నం అనే గ్రామంలో కె. యాదగిరి అనే రైతు థాయిలాండ్ దేశానికి వెళ్లి అక్కడ ఈ సాగు పద్ధతిని చూశాడు. మొదటగా 1.5 ఎకరాల్లో సాగు చేశాడు. ఆ సాగు విధానంలో క్రమేణా దిగుబడి బాగా వచ్చింది. దీంతో ప్రస్తుతం అతను తనకున్న 17.5 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ పంట కాపు దశలో ఉన్నది. dragon-fruit మొదట వేసిన 1.5 ఎకరాలు మూడేండ్లు పూర్తి కావచ్చింది. మిగిలిన 16 ఎకరాలు ఈ ఏడాది వేశాడు. ఎకరానికి 5 లక్షల వరకు ఖర్చు అయినట్టు తెలిపాడు. ఇందులో రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ద్వారా ప్రథమశ్రేణి ప్రదర్శనా పద్ధతి ద్వారా మూడు లక్షల అరువై వేల సబ్సిడీ ఇచ్చినట్టు తెలిపారు. డ్రాగన్ ఫ్రూట్ సాగు గురించి యాదగిరి వివరించారు.

ఈ ఫ్రూట్‌తో ఆరోగ్యానికి మేలు

మధుమేహ నియంత్రణకు తోడ్పడుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గించడంతో పాటు బరువును నియంత్రిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.

సాగు విధానం

నేలలు: ఉదజని సూచిక 5.5 నుంచి 7 వరకు ఉన్న మంచి ఎర్రనేలలు అనుకూలం. నీరు నిల్వ ఉండే నేలలు అనుకూలం కాదు. dragon-fruit3 రకాలు: తెల్లని కండ కలిగి పైన తోలు ఎరుపు రకం, గులాబీ రంగులో ఉండే రకాలు ముఖ్యమైనవి. మొక్కలను ప్రవర్థనం చేసిన కత్తిరింపులను 45 సెం.మీ. పొడవు గల కణుపులను కట్ చేసి పాలిథీన్ సంచుల్లో పెట్టుకోవాలి. వీటిని 40 నుంచి 45 రోజుల తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి. ప్రధాన పొలాన్ని 4 నుంచి 5 సాళ్లు మెత్తగా దున్నుకోవాలి. లెవల్ చేసుకొని దానిలో ఎకరాకు 3.5X3.5 మీటర్ల లేదా 3X3 మీటర్లు ఎడంగా సిమెంట్ స్తంభం పాతుకోవాలి. స్తంభాలు ఎనిమిది ఫీట్లవి సరిపోతాయి. ఆ స్తంభం చుట్టూ 4 కణుపు మొక్కలు పెట్టుకోవాలి. అట్లా ఎకరానికి 1680 మొక్కలు సరిపోతాయి. మొక్కలు నాటుకొనేటప్పుడు 60 సెం.మీ. సైజు గుంతలు తీసుకోవాలి. ఆ గుంతల్లో 100 గ్రాముల సూపర్‌ఫాస్ఫేట్, ఇసుక+100 గ్రాముల పశువుల పేడ ఎరువు బాగా చివికినది వేసుకోవాలి. మొక్కలను జూన్-జూలై మాసాల్లో నాటుకుంటే మంచిది.

ఎరువుల యాజమాన్యం

రెండవ ఏడాది ఒక్కొక్క మొక్కకు 10 కిలోల పశువుల పేడ ఎరువు 500 గ్రాముల యూరియా+ 750 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్+800 గ్రాముల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ మూడు సమ భాగాలుగా చేసి కోత అనంతరం, పూతకు ముందు, పండ్లు ఏర్పడక ముందు వేసుకోవాలి.

యాజమాన్యం

ఎప్పటికప్పుడు కొమ్మల కత్తిరింపులు చేసుకోవాలి. ఇవి జూన్ నుంచి ఆగస్టు మధ్యలో పూతకు వస్తాయి. పూత వచ్చాక 15 రోజుల్లో పండ్లు ఏర్పడుతాయి. మరో నెలరోజుల్లో పక్వానికి వస్తాయి. ఇట్లా జూన్ నుంచి డిసెంబర్ వరకు వస్తాయి.

దిగుబడి

ఎకరానికి మొదటి ఏడాది 1 టన్ను వస్తుంది. రెండవ ఏడాది 1.8 టన్నులు వస్తుంది. ఇలా ఏటా రెట్టింపు దిగుబడిని ఇస్తూ దాదాపు 30 ఏండ్ల వరకు పంట దిగుబడి వస్తుంది. dragon-fruit2

లాభాలు బాగున్నాయి

ఈ పండ్లకు మార్కెట్‌లో సరాసరి కిలోకు 150 రూపాయలు ఉన్నది. ఈ పండ్లను హైదరాబాద్, కలకత్తా మార్కెట్లకు పంపుతున్నాను. నేడు మొదటి ఏడాది 1.5 ఎకరాల్లో వేసిన పంట ఈ మూడేండ్ల కాలంలో 9 టన్నుల దిగుబడి వచ్చింది. ఇంకా కొంత కాపు దశలో ఉన్నది. దీర్ఘకాలిక లాభాల కోసం ఈ పంట సాగు చేస్తే మంచిది. -కె. యాదగిరి, రైతు, 7799193319 s-suresh