క్యాబేజి, కాలీఫ్లవర్‌ల సాగు కాలం

క్యాబేజి, కాలీఫ్లవర్ చలికాలంలో సాగు చేసుకునే పంటలు. ఈ పంటల్లో విటమిన్లు బీ,సీ, కేలు పుష్కలంగా ఉంటాయి. భాస్వరం, మాంగనీస్ మొదలగు ఖనిజ లవణాలు ఉంటాయి. రైతులు ప్రస్తుతం ఈ పంటలను ఎంచుకొని సాగు చేసుకోవచ్చు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలు పొందవచ్చు. callyflower వాతావరణం: ఈ పంటలు సాగు చేయడానికి చల్లని వాతావరణం అనుకూలం. చలికాలంలో మంచి దిగుబడి వస్తుంది. పగటి ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెంటీగ్రేడ్లకు మించరాదు. నేలలు: చౌడు, క్షార నేలలు సాగు చేయడానికి పనికిరావు. ఇసుకతో కూడిన బంకనేలలు, ఒండ్రు నేలలు మురుగునీరు పోయే సౌలతి ఉన్న నేలలు అనుకూలం. ఉదజని సూచిక 5.5- 6.5 గల నేలలు చాలా అనుకూలం. రకాలు: ఉద్యాన అధికారులు సూచించిన రకాలను ఎంచుకుని సాగు చేసుకుంటే మంచిది. callyflower2

క్యాబేజిలో..

గోల్డెన్ ఏకర్: దీని గడ్డ గట్టిగా, గుండ్రంగా ఉండి 1.0-1.5 కిలో బరువు తూగుతుంది. చలికాలంలో ముందస్తుగా విత్తుకోవడానికి అనుకూలమైంది. ఈ రకం 60-70 రోజులకు కోతకు వస్తుంది. ప్రైడ్ ఆఫ్ ఇండియా: గడ్డ పరిమాణం 1.5-2.0 కిలోల బరువు ఉంటాయి. 60-80 రోజులలో కోతకు వస్తుంది. త్వరగా కోతకు వచ్చే రకం. లేట్ డ్రమ్ హెడ్: గడ్డలు పెద్దగా, గుండ్రంగా ఉంటాయి. 100-120 రోజులలో కోతకు వస్తాయి. దీర్ఘకాలిక రకం. పూస డ్రవ్‌ు హెడ్: గడ్డ గట్టిగా, చదునుగా ఉంటుంది. మధ్యకాలిక రకం. నల్లకుళ్లు తెగులును తట్టుకుంటుంది.

కాలీఫ్లవర్‌లో..

పూస దీపాలి: చలికాలంలో ముందుగా (సెప్టెంబర్ రెండవ వారం నుంచి చివరి వరకు) వేయడానికి అనుకూలం. పంటల కాలం 90-100 రోజులు. కాండం పరిమాణం మధ్యస్థం, ఆకులు నీలం రంగుగా ఉండి వంపు లేకుండా ఉంటాయి. ఎర్లీ కున్‌వారి: సెప్టెంబర్ మధ్యలో విత్తేందుకు అనువైనది. పువ్వు అర్ధచంద్రాకారంలో హెచ్చుతగ్గులు లేకుండా ఉంటుంది. పూసా హైబ్రిడ్ -2: ఈ రకం బూజు తెగులును తట్టుకుంటుంది. పువ్వు తెల్లగా ఉంటుంది. పూసా హిమజ్యోతి: పువ్వు మొత్తం ఆకులతో కప్పబడి ఉంటుంది. పూలు తెల్లగా ఉండి, ఎండ తగిలినా రంగును కోల్పోకుండా ఉంటాయి. ఒక్కోపువ్వు 500-600 గ్రాముల బరువు ఉంటుంది. 65-75 రోజుల్లో పంట కోతకు వస్తుంది.

విత్తన మోతాదు

క్యాబేజి: సూటిరకాలకు ఎకరాకు 300 గ్రాములు. హైబ్రిడ్స్ రకాలకు 100-150 గ్రాములు అవసరం. కాలీఫ్లవర్: తక్కువ కాలపరిమితి గల రకాలకు ఎకరాకు 240-320 గ్రాములు. దీర్ఘకాలిక రకాలకు 160-200గ్రాములు అవసరం. విత్తనశుద్ధి: కిలో విత్తనానికి 3గ్రాముల చొప్పున థైరమ్ కలిపి విత్తనశుద్ధి చేయాలి. నారుమడి యాజమాన్యం: ఆరోగ్యమైన నారును పొందడానికి నారుమడి యాజమాన్యం తప్పనిసరి. ఎత్తయిన నారుమడులను తయారుచేసుకోవాలి (10-15 సెంటీమీటర్లఎత్తు, 4 మీటర్ల పొడవు, 1మీటరు వెడల్పు ) 100 చ. మీ, విస్తీర్ణంలో 25-30 గంపల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. 4 కిలోల భాస్వరం (40చ.మీ నారుమడికి)వేసి కలియదున్నా లి. విత్తనాలను సన్నని ఇసుకతో లేదా కంపోస్టుతో గాని కలిపి నారుమడిలోని వరుసల్లో పలుచగా వేయాలి. విత్తనాలు మొలకెత్తే వరకు రోజూ నీరు అందించాలి. నారుకుళ్లు తెగులు నివారణకు 3గ్రా కాపర్‌ఆక్సీక్లోరైడ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుతినే పురుగు నివారణకు 2.5గ్రా మలాథియాన్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నాటే దూరం : నేలను 3-4 సార్లు బాగా దున్ని దుక్కి చేయాలి. సుమారు 10-15 రోజుల ముందు నేలను తయారుచేసుకోవాలి. దీర్ఘకాలిక రకాలకు 60X45 సెంటీమీటర్లు, స్వల్పకాలిక రకాలకు 45 X45 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. 25-30 రోజుల వయస్సు గల నారును జాగ్రత్తగా నాటుకోవాలి. నాటే ముందు తడిని ఇవ్వాలి. ప్రొటేలలో నాటుకొని కూడా నాటుకోవచ్చు. ప్రొట్రేలలో నారు పెంపకం వల్ల ప్రతి విత్తనం మొలకెత్తుతుంది. నారు ఎక్కువగా చనిపోదు. కొంత ఖర్చు ఎక్కువ అయినా విత్తనం వృథా కాదు. వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెంది పొలంలో నాటినపుడు సమర్థవంతంగా పెరిగే శక్తి నారుకు ఉంటుంది. నారుమడులో వచ్చే చీడపీడలను నిర్మూలించుకోవచ్చు. ఎరువులయజమాన్యం: నాణ్యమైన దిగుబడులు పొందడానికి సిఫార్సు చేసిన ఎరువులను వేసుకోవాలి. తొలి దఫాగా ఎకరాకు 8-10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 32-40 కేజీల భాస్వరం, 40 కేజీల పోటాషియాన్ని ఇచ్చే ఎరువులు చివరి దుక్కిలో వేసి బాగా కలియదున్నాలి. క్యాబేజి, కాలీఫ్లవర్‌లో ఎకరాకు 24-32 కేజీల నత్రజని ఎరువులను మూడు దఫాలుగా వేసుకోవాలి. 30:60:80 రోజులకు వేసుకోవాలి . నీటి యాజమాన్యం: నాటిన వెంటనే నీరు పెట్టాలి. తేలిక నేలలో వారం రోజులకు ఒకసారి, బరువైన నేలల్లో 10 రోజులకు ఒకసారి (5-6 సెం.మీ) నీటి తడిని ఇవ్వాలి. కలుపు యాజమాన్యం: పెండిమిథాలిన్ 30 శాతం ఇ.సి. ఎకరాకు 1.25 లీ. లేదా అల్లాకోర్ 1.0 లీ (తేలిక నేలలు), 1.2లీ. (బరువు నేలలు) చొప్పు 200 లీటర్ల నీటిలో కలిపి నాటిని 24-48 గంటలలోపు పిచికారీ చేయాలి. నాటిన 20-25 రోజులప్పుడు అంతరకృషి చేయాలి. a-raja-shekar