లాభాలకు ‘బంతి’ పూల బాట

బంతి పూల సాగు వాణిజ్యపరంగా మంచి విలువను కలిగి ఉన్నది. కాబట్టి పూల తోటల పెంపకంలో ఈ సాగు చేస్తే సన్న, చిన్నకారు రైతులు మంచి లాభాలు పొందవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పూలను పండుగల సమయంలోనూ, వివిధ వేడుకలలో అలంకరణ కోసం విరివిగా వినియోగిస్తారు. అందుకే బంతి ఆదాయానికి పూలబాట వంటిది. ఈ పూల సాగులో అనుసరించాల్సిన పద్ధతుల గురించి గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త సీహెచ్.నరేష్ వివరించారు. దీనికి సంబంధించిన అదనపు సమాచారం కోసం వారిని 9603268682 నెంబరులో సంప్రదించవచ్చు. flowers సాధారణంగా అన్నికాలాల్లోనూ బంతి సాగు చేపట్టవచ్చు. అయితే ఇది 14-28 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద బాగా పెరుగుతుంది. వాతావరణ ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటే మొక్క పెరుగుదల తగ్గుతుంది. తక్కువ పరిమాణం గల పూలు పూయడమే కాక దిగుబడి కూడా తగ్గుతుంది. నీడగా ఉండే ప్రదేశాలు బంతి సాగు చేయడానికి అనుకూలం కాదు. నేలల ఎంపిక: ఉదజని సూచిక 7- 7.5 మధ్య గల నేలలు అనుకూలం. సారవంతమైన గరప నేలలు చాలా అనుకూలం. మురుగు నీటి వసతి గల బరువైన నేలల్లోనూ బంతిని సాగు చేయవచ్చు. రకాల ఎంపిక: ఆఫ్రికన్, ఫ్రెంచి రకాలు ముఖ్యమైనవి. వాణిజ్యపరంగా ఆఫ్రికన్ రకాలకు మంచి గిరాకీ ఉంటుంది. ఆఫ్రికన్ బంతి: వీటిలో పెద్ద పూల రకాలైన పూసా నారింగ గైండా, పూసా బసంతి రకాలు సాగులో ఉన్నాయి. ఫ్రెంచి బంతి: ఇవి ఆఫ్రికన్ బంతి కన్నా త్వరగా కోత కు రావడమే కాక మొక్కలు పొట్టిగా దృఢంగా ఉండి సింగిల్ లేదా డబుల్ పూలలను కలిగి ఉంటాయి. నారుమడి యాజమాన్యం: వాణిజ్యపరంగా బంతిని విత్తనాల ద్వారా వ్యాప్తి చేస్తారు. ఎకరాకు సరిపడా నారును పెంచడానికి 800 గ్రాముల విత్తనం సరిపోతుంది. మొలక బాగా ఉన్నైట్లెతే 400-500 గ్రాముల విత్తనం సరిపోతుంది. నారుపోసే మడిలో 15 సెంటీ మీటర్ల ఎత్తు, ఒక మీటరు వెడల్పుగల చిన్న మడులను తయారుచేసుకుని చదరపు మీటరు మడికి 8 నుంచి10 కిలోల పశువుల ఎరువు లేదా 2 నుంచి 4 కిలోల వానపాముల ఎరువును కలుపాలి. విత్తడానికి ముందుగా పాలిడాల్ పొడిని చల్లినైట్లెతే విత్తనాలకు చీమలు, చెదపురుగులు పట్టకుండా రక్షించవచ్చు. హైబ్రిడ్ వ్తితనాన్ని ట్రేలలో నాటినట్లయితే బలమైన నారు మొక్కలను పొందవచ్చు. నాటుకునే సమయం: దీన్ని అన్నికాలాల్లో సాగు చేసుకోవచ్చు. ఫిబ్రవరి మొదటి వారం వరకు నాటుకోవచ్చు. ఆ పంట నుంచి అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు పూల దిగుబడి పొందవచ్చు. సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నాటుకున్న పంట నుంచి నాణ్యమైన పూలను, విత్తనాలను పొందవచ్చు. నాటే దూరం: ఆఫ్రికన్ బంతిని 60X45 సెం.మీ దూరంలో, ఫ్రెంచి రకాలను 20X20 సెం.మీల దూరంలో నాటుకోవాలి. 25 రోజుల వయసు గల దృఢమైన మొక్కలు నాటుకోడానికి అనుకూలంగా ఉంటాయి. ఎరువుల యాజమాన్యం: సేంద్రియ ఎరువులు ఎకరానికి ఆఖరు దుక్కిలో 8 నుంచి 10 టన్నులు బాగా మాగిన పశువుల ఎరువు లేదా 1.5 టన్నుల వానపాముల ఎరువులతో పాటు 4 కిలోల అజోస్పైరిల్లమ్, 4 కిలోల ఫాస్పో బాక్టీరియాలను వేసి కలియదున్నాలి. రసాయన ఎరువులు: ఎకరానికి 66 కిలోల యూరి యా, 185 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 50 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ను అందించాలి. సగం నత్రజని, సిఫార్సు చేసిన మొత్తం భాస్వరం, పొటాష్ ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి. మిగతా నత్రజనిని నాటిన 30- 40 రోజుల తర్వాత పై పాటుగా వేయాలి. నీటి యాజమాన్యం: బంతి మొక్కలకు అన్నిదశలలో నూ సరిపడినంత తేమ భూమిలో ఉండాలి. నేల స్వభావం, వాతావరణాన్ని బట్టీ నీటి తడులివ్వాలి. మొక్క ఏదశలోనైనా నీటి ఎద్దడికి గురైతే ఎదుగుదల లేక పూత దెబ్బతింటుంది. తలలు తుంచడం: ఆఫ్రికన్ బంతి రకాలలో పెరుగుదల ఎక్కువగా ఉండి చివరగా పూమొగ్గ ఏర్పడుతుంది. ఆ తర్వాతే పక్క కొమ్మలు ఏర్పడుతాయి. కాబట్టి మొక్కలను నాటిన 40 రోజులకే తలలు తుంచితే అనేక పక్కకొమ్మలు తొందరగా ఏర్పడుతా యి. మొక్క మంచి ఆకారాన్ని పొంది అధిక మోతాదులో సమాన పరిమాణంలో పూలు పూస్తాయి. హైబ్రిడ్ రకాలలో 25 రోజులకే తలలు తుంచాలి. పూల దిగుబడి: ఆఫ్రికన్ రకాలు ఎకరాకు 4 నుంచి 5 టన్నుల దిగుబడినిస్తాయి. పూలకోత: ప్రతి కోతను పొద్దుగాల లేదా సాయం త్రం పూట బాగా విచ్చుకున్న పూలను కోయాలి. పూల ను కోసే ముందు నీళ్లు పెడితే పువ్వులు తాజాగా ఉండి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఎప్పటికప్పుడు పూల ను కోయడం వల్ల దిగుబడి పెరుగుతుంది. పూలను కోసిన తర్వాత తడిపి గోనె సంచి లేదా వెదురు బుట్టలో ఉంచి తడిగుడ్డను కప్పి మార్కెటుకు తరలించాలి. flower

పురుగుల నివారణ

పేనుబంక: పిల్ల, పెద్ద పురుగులు ఎదుగుతున్న పూ మొగ్గలను ఆశించి రసాన్ని పీల్చుతాయి. వీటి నివారణకు లీటరు నీటికి 2 మి.లీ. డై మిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్‌ను లేదా ఎసిటిమాఫ్రిడ్‌ను 0.25 గ్రాములు లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో మార్చుకుంటూ పిచికారీ చేయాలి. తామర పురుగులు: ఇవి ఆకులు, పూల నుంచి రసాన్ని పీలుస్తాయి. ఇవి ఆశించిన పూల మీద తెల్లని మచ్చలు కనిపిస్తాయి. ఇవి ఆశించిన పూల మొగ్గలు గోధుమ రంగుకు మారి ఎండిపోతాయి. వీటి నివారణకు ప్రొఫినోఫాస్ 2 మి.లీ.లేదా ఫిప్రొనిల్ 1 మి.లీ. లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొగ్గ తొలుచు పురుగులు: ఈ పురుగులు లార్వా దశలో పూల భాగాన్ని తింటాయి. దీనివల్ల పూల మొగ్గలు విచ్చుకోవు. వీటి నివారణకు ప్రొఫెనోఫాస్ 2 మి.లీ.లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

తెగుళ్ల నివారణ

నారుకుళ్ళు తెగులు: ఈ తెగులు ఎక్కువగా నారు మడిలో కనిపిస్తుంది. భూమిలో అధిక తేమ, వెచ్చ ని వాతావరణం ఈ తెగులు వ్యాప్తికి అనుకూలం. ఎత్తు నారుమడులు చేసి నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలి. నారుమడిని పరిశుభ్రంగా ఉండాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడు గ్రాములు లేదా మ్యాంకోజెబ్ మూడు గ్రాములు లీటరు నీటికి లేదా కార్బండిజమ్, మ్యాంకోజెబ్‌లను కలిపి రెండు గ్రాములు లీటరు నీటికి కలిపి నేలను బాగా తడుపాలి. ఆకుమచ్చ, పువ్వుకుళ్ళు తెగులు: వానకాలంలో ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. మొదలు ఆకులపై గోధుమ రంగుతో కూడిన మచ్చలు ఏర్పడుతాయి. దీని ఉధృతి ఎక్కువైనప్పుడు పువ్వులపై కూడా మచ్చలు ఏర్పడి నల్లగా మారి ఎండిపోతాయి. వీటి నివారణకు మ్యాంకోజెబ్ మూడు గ్రాములు లేదా కార్బండిజమ్ ఒక గ్రాము లేదా క్లోరోథలోనిల్ రెండు గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి ఈ తెగులును అరికట్టవచ్చు. -నట్టె కోటేశ్వర్‌రావు, 9989944945 గరిడేపల్లి, సూర్యాపేట జిల్లా ch-naresh