సాగు సూచనలు

రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్న నూనెగింజల పంట పల్లి. ప్రస్తుతం ఈ పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వ్యవసాయ అధికారులు సూచించిన వివరాలు.. groundnut

పల్లిలో..

కలుపు నివారణ, అంతర కృషి

విత్తిన 25-30 రోజుల దశలో గొర్రుతో అంతర కృషి చేసుకోవాలి. మొక్కల మొదళ్ళకు మట్టిని ఎగదోయాలి. విత్తిన 45 రోజుల వరకు ఎలాంటి కలుపు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తర్వాత ఎలాంటి అంతర సేద్యం చేయరాదు. లేకపోతే ఊడలు దెబ్బతిని దిగుబడులు తగ్గుతాయి.

నీటి యాజమాన్యం

పల్లి పంటకు మొత్తం 450-600 మి.మీ. నీరు అవసరం అవుతుం ది. తేలికపాటి నేలల్లో 6-8 తడులు ఇవ్వాలి. పంటలో ఊడలు దిగే దశ నుంచి కాయలు ఊరే వరకు (విత్తిన 45-50 రోజుల నుంచి 85-90 రోజుల వరకు) సున్నితమైంది. కాబట్టి ఈ దశలో నీళ్లు సక్రమంగా తగిన మోతాదులో కట్టాలి. నీళ్లను తుంపర్లు (స్ప్రింక్లర్లు) ద్వారా ఇవ్వాలి. ఇట్లా ఇచ్చినైట్లెతే దాదాపు 25 శాతం నీళ్లు ఆదా అయి, అధిక దిగుబడి, నాణ్యమైన కాయలు పొందవచ్చు.

సస్యరక్షణ

ఆకు ముడత పురుగు: పంట విత్తిన 15-45 రోజుల వరకు ఈ పురుగు ఆశిస్తుంది. ఈ పురుగు 2-3 ఆకులను కలిపి గూడు చేస్తుంది. ఆకులపై ఉన్న పచ్చదనాన్ని తింటుంది. దీనివల్ల ఆకులన్నీ ఎండిపోయి దూరం నుంచి కాలిపోయినట్లు కనిపిస్తాయి. నివారణ: ఈ పురుగు నివారణకు క్లోరిపైరిఫాస్ 500 మి.లీ. లేదా ఎసిఫేట్ 300 గ్రా., 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేసుకోవాలి.

తిక్కా ఆకుమచ్చ తెగులు

పంట 30 రోజుల దశలోపు ఆశించే ఆకుమచ్చ తెగులులో మచ్చలు ఆకుల పైభాగాన ముదురు గోధుమ రంగులో ఉంటాయి. ఆలస్యంగా వచ్చే తెగులులో మచ్చలు ఆకు అడుగు భాగాన నల్లని రంగులో ఉంటాయి. ఈ మచ్చలు తర్వాత ఆకుల కాడల మీద, కాండం, ఊడల మీద కూడా కనిపిస్తాయి. విత్తనశుద్ధి చేయని పరిస్థితుల్లో ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది.

నివారణ చర్యలు

క్లోరోథాలోనిల్ 400 గ్రా. లేదా టెబ్యుకొనజోల్ 200 మి.లీ. ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. sunflower

పొద్దుతిరుగుడులో..

ప్రస్తుతం ఈ పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వ్యవసాయ అధికారులు అందించిన వివరాలు..

సస్యరక్షణ

పొగాకు లద్దె పురుగు: పంట 30 రోజుల దశ నుంచి ఈ పురుగు ఆశిస్తుంది. ఈ పురుగు గుంపులుగా ఆకులపై పత్రహరితాన్ని గోకి తింటాయి. దీనివల్ల ఆకులు జల్లెడగా మారుతాయి. ఈ పురుగు నివారణకు నొవాల్యురాన్ 1.0 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా సాయంత్రం పూట విషపు ఎరను చల్లి నివారించుకోవచ్చు.

ఆకుమచ్చ తెగులు

పంట 25 రోజుల నుంచి 65-70 రోజుల వరకు ఈ తెగులు ఆశించి నష్టం చేస్తుంది. ఈ తెగులు ఆశించడం వల్ల ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతాయి. ఆకులు మాడిపోయినట్లు అవుతా యి. ఈ తెగులు నివారణకు ప్రొపికొనజోల్ 25 శాతం ఇసి 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.