ఇంటి చెత్త నుంచి పంటల సంపద

మనం ఒక పదార్థాన్ని నాశనం చేయలేం. సృష్టించడం అంతకన్నా చేయలేం. శక్తి ఒక రూపంలోంచి మరొక రూపంలోకి మారుతుందంతే. సాంబశివుడు సరిగ్గా అక్కడే ఆగాడు. ఇంటిలో చెత్తను బయటపడేయకుండా మనకు ఉపయోగపడే సంపదలా మార్చగలిగితే అని ఆలోచించారు. ఇంటినుంచి ఒక గ్రాము చెత్త కూడా బయటకు వెళ్లకుండా వాటిని ఎరువుగా మార్చి ఇంటిపై ఆకుపచ్చ బంగారాన్ని పండిస్తున్నారు చెత్త నుంచి పంటల సంపదను సృష్టించి ఆహారానికి, ఆరోగ్యానికి, ఆనందానికి కొత్త నిర్వచనంలా నిలబడుతున్నారు. home-cultivation వేములవాడకు చెందిన ఉపాధ్యాయుల సాంబశివుడు, హైదరాబాద్ రేల్ టెల్ కార్పొరేషన్ సంస్థలో హెచ్‌ఆర్ సీనియర్ మేనే జర్‌గా రిటైర్డయి, ప్రస్తుతం అదే శాఖలో తిరిగి కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. గత నలభై ఏండ్లుగా హైదరాబాద్‌లోనే నివసిస్తూ, సోషల్ ఫారెస్ట్రీ ఉద్యమం, సమాంతరంగా తన ఇంటిలో మిద్దె తోటను పెంచు తూ, నగరంలో పర్యావరణ ఆరోగ్యానికి ఊపిరిలూదుతున్నారు. పదేండ్ల కిందట హైదరాబాద్‌లోని కాప్రా మండలం యల్లారెడ్డిగూడలోని హైటెక్‌నగర్ కాలనీలో సొంత ఇల్లు కట్టుకుని సుమారు పదహారు వందల యాభై చదరపు అడుగుల మిద్దె స్థలంలో టమాటా, వంకాయ, మిరప, కీర, సొర, బీర, చిక్కుడు, క్యాబేజీ, బెండ, ముల్లంగి వంటి సుమారు 30 రకాల కూరగాయల్ని పండిస్తున్నారు. కూరగాయలు, పూలతో మొదలైన ప్రయాణం గత రెండేండ్ల నుంచి ఔషధ మొక్కలపై మళ్లింది. మిద్దెతోటలో ఇపుడు పునర్నవ, నాగదాళి, తిప్పతీగ, అతిబల, కలబం ద, చెన్నంగి వంటి ఔషధ మొక్కలు కొలువుదీరాయి. వీటిలో కొన్నింటిని కాఫీ, టీకి బదులు కషాయాల తయారీ కోసం కూడా వినియోగిస్తున్నారు. మరోవైపు వంటింటి నుంచి వచ్చే వ్యర్థాలు, రాలిన ఆకులతో తయారుచేసుకున్న వర్మీ కంపోస్టును, ద్రవరూప ఎరువు వర్మీవాష్‌ను వాడుతూ పోషకాల లోపం, చీడ పీడల బెడద లేకుండా ఇంటి పంటలను సాగు చేస్తున్నారు. ప్రతి మూడు నెలలకు ఓసారి పంటను మార్చుతూ, కాలాలకు అనుగుణమైన కూరగాయల మొక్కలు పెంచుతున్నారు. పర్యావరణ స్పృహతో కిచెన్ వేస్టుని ఎలా సద్వినియోగం చేసి కంపోస్ట్ ఎరువుగా మార్చుకోవాలో, ఇంటి పంటలు ఎలా పడించుకోవాలో సోషల్ మీడియాలో, టీవీ ఛానళ్లలో పంచుకుంటుంటారు.

విత్తన సంరక్షణ

మొదటి కాసిన కాయ చెట్టు మీద ఎండిన తరువాత తీసి, విత్తనం సేకరించాలి. ఈ విత్తనంలో ఎండోఫైట్స్, విగర్ ఎక్కువగా ఉంటుంది. దీనిని పిడకలో గాని, బూడిద పోసిన కుండలో నిలువచేయాలి. బూడిద వల్ల విత్తనాన్ని ఫంగస్, వైరస్ తెగుళ్లు ఆశించవు. దీనిమీద నిలువచేసిన రోజు తేదీ వేయాలి. దీనిని ఆరునెలల నుంచి సంవత్సరం వరకు ఉంచవచ్చు. ఆవు పిడకలలో వుంచిన విత్తనమైతే దాదాపు రెండేళ్ల వరకు ఉంటుంది. ఆ తరువాత విత్తనంలో మొలకెత్తే శక్తి తగ్గుతుంది.

నారుపోసే దశ

సాంబశివుడు నారు పోసేదశలో అనుసరిస్తున్న పద్ధతులు సమయాభావం, స్థలాభావం ఉన్న నగరవాసులకు చాలా ఉపయోగకరమైనవి. ఈ పద్ధతిలో తొంభై శాతానికి పైగా మొలకవచ్చే అవకాశం వున్నది. సాంబశివుడు తన మిద్దెతోటల్లో హైబ్రిడ్, దేశీ విత్తనాలను వాడుతుంటారు. ఐతే దేశీ విత్తనం వాడటం వల్ల వాటిలో రోగ నిరోధకశక్తిని అధికంగా కలిగివుండటం, పోషకవిలువలతో పాటు విత్తనాన్ని తిరిగి ఉపయోగించుకోవడం వీలవుతుందంటారు. బెండ, బీర, టమాటా, వంగ, సొర, బీర, కాకర, పొట్ల విత్తనాలను ప్లగ్‌ట్రేస్‌లలో నారు పోయాలి. ట్రేస్‌లో వేడినీటిలో ఉంచి తీసిన స్టెరైల్ కోకోపిట్‌ను వాడితే మంచిది. దీనివల్ల మొలక దశలో విత్తనాన్ని ఎలాంటి తెగుళ్లు ఆశించవు. పెద్ద విత్తనాలను నాటేముందు ఆవుమూత్రాన్ని డైల్యూట్ చేసి అందులో అరగంట నానబెట్టి, తరువాత ఇరువై నాలుగు గంటలపాటు నీటిలో నానబెట్టి ట్రేలలో నాటుపెట్టాలి. ట్రేలలో విత్తనం నాటేటపుడు అరఇంచు కంటే లోతుకు నాటకూడదు. రోజ్‌క్యాన్‌తో నీరు చిలకరించి,పైన ప్లాస్టిక్ కవర్ కప్పి సెమి షేడ్‌లో ఉంచాలి. అసలు ఒక విత్తనం మొలకెత్తడానికి నీరు, గాలి, ఉష్ణోగ్రత సరైన మోతాదులో అందాలి. ఇలా ట్రేపై ప్లాస్టిక్ కవర్ పరచడం వల్ల విత్తనానికి సరైన ఉష్ణోగ్రత అందుతుంది. మొలక వచ్చిన తరువాత కవర్ తీసివేసి మొలకలపై కొద్దిగా నీళ్లు చిలకరించి,5-6 అంగుళాలు వచ్చేవరకు (విత్తన లక్షణాన్ని బట్టి 8-15 రోజులు) సెమి షేడ్‌లో ఉంచాలి. విత్తనం మొలకెత్తే దశలో రెండు మూడు రోజుల వరకు మనం ఎలాంటి పోషకాలు ఇవ్వనవసరం లేదు. విత్తనంలో ఉన్న పోషకాలను మొలక వాడుకుంటుంది. మొలక వచ్చిన పది రోజుల తరువాత జీవామృతం, వేస్ట్ డీకంపోజర్ వంటి ద్రవ ఎరువులను మొక్కకు అందిస్తే మొక్క చాలా ఆరోగ్యంగా ఎదుగుతుంది. తరువాత నర్సరీ బ్యాగులో కర్రతో చేసిన రంధ్రంలో ట్రేలోని మొక్కను కుదురుగా కూర్చోబెట్టాలి. దీనివల్ల మొక్క వేరు ఏమాత్రం దెబ్బతినకుండా ఉంటుంది. ఈ నర్సరీ బ్యాగుల్లో 30శాతం కోకోపిట్, 30శాతం వర్మికంపోస్ట్, 30 శాతం ఎర్రమట్టి, 10శాతం వేపపిండిని పాటింగ్‌మిక్స్‌లో వాడుతున్నారు. పూత దశలో (ప్రౌఢ దశ) మొక్కకు అనువైన కుండీలోకి మార్చుకోవాలి. మొదట కుండీల్లో కూడా మొక్కకు సరిపోయే రంధ్రం చేయాలి. తరువాత నర్సరీ బ్యాగును వెలకిలా తిప్పి కదిలించి వేర్లు దెబ్బతినకుండా తీసి కుండీలో పెట్టాలి.

పోషణ

ప్రతి 10-15 రోజులకు ఒకసారి ద్రవరూప ఎరువులను అందిస్తున్నారు. ఇందులో ప్రధానమైనవి జీవామృతం, వర్మివాష్, చోహాన్ క్యో పద్ధతిలో తయారుచేసిన బలవర్థకాలు. వీటిని మార్చి మార్చి వాడుతుంటారు. జీవామృతం ద్వారా భూమిలో సూక్ష్మజీవులు, వానపాములు ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతాయి. మట్టిలో నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములను చైతన్యవంతం చేయడం ద్వారా జీవామృతం భూసారం పెరగడానికి దోహదపడుతుంది. భూమిలోని పోషకాలను మొక్కలు నేరుగా వినియోగించుకునే రూపంలోకి మార్చి అందించడంలో వానపాములు, సూక్ష్మజీవుల పాత్ర అసాధారణమైనది. మేలు చేసే కోటాను కోట్ల సూక్ష్మజీవులకు నిలయం పశువుల పేడ, మూత్రం. పేడ, మూత్రంతోపాటు బెల్లం, పప్పుల పిండి, నీటిని కలిపినప్పుడు పేడలోని సూక్ష్మజీవరాశి ప్రతి 20 నిమిషాలకు రెట్టింపవుతుంది. జీవామృతానికి అదనంగా పులియబెట్టిన పండ్ల రసాలు (ప్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్) మిద్దెతోట నిర్వహకులకు ఒక వరం లాంటి దంటారు సాంబశివు డు. దక్షిణకొరియా శాస్త్రవేత్త చోహాన్‌క్యు తయారుచేసిన ఈ ఎఫ్‌ఎఫ్‌జె మొక్కలకు, తోటలకు సేంద్రీయ ఎరువుగా పనిచేస్తుంది. ఈ ద్రవం నేలలోని ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ బ్యాక్టిరియాను పాటింగ్ మిశ్రమములో పెంచి పోషకాలను (స్థూల, సూక్మ మరియు ఎంజై వ్‌‌సు) పెరుగుతున్న మొక్కలకు అందిస్తాయి. పులియబెట్టిన పండ్ల రసాన్ని తయారు చేసుకోవడానికి తీయగా ఉండే అరటిపండ్లు, పైనాపిల్స్ లేదా బొప్పాయి, మామిడి, అరటి వంటి పండ్లు ఉపయోగపడతాయి. వీటిని చిన్నభాగాలుగా కత్తిరించిన పండ్లను ఒక గాజు పాత్రలో లేదా జాడీలో వేసి, దానికి సమానమైన మొలాసిస్ లేదా బ్రౌన్ షుగర్ లేదా బెల్లం జోడించి ఈ మిశ్రమాన్ని రోజు ఉదయం, సాయంత్రం ఒక చెంచాతో బాగా కలపి దీనిపై ఒక సన్న ని గుడ్డ కట్టి రబ్బరు బ్యాండ్‌తో దాన్ని భద్రపరచాలి. మిశ్రమం కలిగిన పాత్రను చల్లని, చీకటి ప్రదేశంలో ఉంచవలెను. పాత్ర దిగువన గోధుమ రంగు ద్రవం వచ్చే వరకు పులియబెట్టాలి. ఈ కిణ్వ ప్రక్రియ(పులియబెట్టుట)15 నుంచి 25 రోజుల వరకు కొనసాగుతుంది. తయారైన ద్రావణాన్ని మరో పాత్రలో స్టోర్ చేసుకుని, చిన్న మొక్కలకు 1ఎం.ఎల్,పెద్ద మొక్కలకు 5 ఎం.ఎల్ కు 15 రోజులకొకసారి మొక్కల మొదట్లో, మొక్కలపై స్ప్రే చేసుకుంటే మొక్కలు ఆశించిన ఫలితాలు సమృద్ధిగా లభిస్తాయి. ఈ ప్రక్రియలో ఎట్టి పరిస్థితుల్లో సిట్రస్ ఫ్రూట్స్ వాడరాదు. ఈ ఎఫ్‌ఎఫ్‌జె లాగే మునగ ఆకుతో, అరటి బోదెతో ద్రావణాలను చేసుకొని మొక్కలకు వాడ టం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. మొక్కలలో పూత ఎక్కువగా నిలవడానికి అరటిపండు తొక్కలను నీళ్లలో నానబెట్టి, ఆ ద్రావణాన్ని కూడా మొక్కలకు అందిస్తుంటారు. అరటిలో పొటాషియం ఎక్కువగా ఉండటం ఇందుకు కారణం.

సస్యరక్షణ

-మడులలో గాని, కుండీలలో గాని మొక్కలకు చీడపీడలు ఆశించినట్లైతే వాటిని కత్తిరించి నాశనం చేయాలి. -పెద్ద పరిమాణంలో ఉండే శనగపచ్చ పురుగు మొదలగువాటి లార్వా దశలను చేతితో ఏరివేసి నాశనం చేయాలి. -వేపగింజల నుంచి తీసిన నూనె, ఆకులు, బెరడు, పొగాకు ఆకుల నుంచి తీసిన మిశ్రమం కూడా సహజమైన పురుగు మందుగా ఉపయోగించవచ్చు. దీనికోసం తొమ్మిది వందల గ్రాముల మంచి నీటిలో వంద గ్రాముల కుంకుడుకాయల రసం తీసుకుని మూడు మి.లీల నూనెను బాగా కలిపి,ఈ మిశ్రమాన్ని ఆకుల అడుగున, పైన తడిసే విధంగా జల్లుకోవాలి. -నారు మడిలో శిలీంద్రాలు ఆశించకుండా వేపపిండిని చల్లి, నారుకుళ్ళును అరికట్టవచ్చు, వైరస్ సోకిన మొక్కలను పెరికి వేయాలి. -కుండీలో ఎప్పుడు ఒకే రకం మొక్కలు కాకుండా రకరకాల మొక్కలు వేస్తే చీడపీడల బెడదను కొంతవరకు నివారించవచ్చు. -కూరగాయలలో బూడిద, బూజు తెగులు కనిపిస్తే. వీటి నివారణకు ఒక లీటరు నీటిలో 60 మిల్లి లీటర్ పుల్లటి మజ్జిగ, ఇంగువ 1 గ్రాము జోడించి పూర్తిగా కరిగే వరకు కలియబెట్టి తెగులు లక్షణాలు కనిపించినప్పుడు పది రోజులకొకసారి రెండుసార్లు పిచికారీ చేయాలి. -తెగుళ్ళు మాత్రమే కాకుండా, కూరగాయలలో పూత, పిందె రాలుటను గమనించినట్లయితే, పంచగవ్వను లీటరు నీటికి 3 మి.లీ నుంచి 5 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. -రసం పీల్చే పురుగులు మొక్కలను నిర్జీవం చేయడమేగాక, వైరస్ తెగుళ్ళను వ్యాప్తి చేస్తాయి. వీటి నివారణకు పొగాకు కాషాయం, వేపగింజల కాషాయం 5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. -నల్లుల సమస్యకు పసుపు, బూడిద కలిపి చల్లాలి. బూడిదను ఉదయం పూట ఆకులకు అంటుకునే విధంగా పల్చుని గుడ్డలో కట్టుకుని జల్లుకోవాలి. అంతేకాకుండా కీటకాలు దాడి చేయకుండా ముందు జాగ్రత్తగా దశపర్ణి కషాయాన్ని ఉపయోగించాలి. ఈ కషాయాన్ని ఇంగువ, పసుపు, అల్లం, వెల్లుల్లి, మిర్చిలతో పాటుగా పదికిపైగా రకాల ఆకులు (మందార, వేప, ఆముదం, బొప్పాయి, నల్లవాయి, జిల్లెడు, నల్ల ఉమెత్త, మారెడు, సీతాఫలం, లక్ష్మణ ఫలం ఆకులు) వేసి తయారుచేస్తాం. నలభై రోజులు నానబెట్టి వడకట్టిన తరువాత చెట్లకు చల్లుకోవాలి. దీనితో కీటకాలను అరికట్టగలుగుతాం.

నీటి యాజమాన్య పద్ధతులు

-కుండీలో నీరు ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమే. నీరు ఎక్కువైతే వేరు కుళ్ళు ఆశించే అవకాశమున్నది. -కుండీలలో/కంటైనర్లలలో పెంచుకునే మొక్కలకు కనీసం 6 గంటలు సూర్యరశ్మి అవసరం. -వేసవిలో రోజుకు రెండు పూటలా నీరివ్వాలి. -నారుమడిలో విత్తనం మొలకెత్తువరకు రోజు నీరు చల్లాలి .నారుమడిని గడ్డి లేదా ఎండిన ఆకులతో కప్పటం వల్ల చలికాలం, వేసవిలో త్వరగా మొలకెత్తుతాయి. -విత్తనాలు మొలకెత్తిన వెంటనే గడ్డి లేదా ఎండిన ఆకులను తీసివేయాలి. -చల్లగా ఉండే సమయంలో నీరు అందించాలి. మధ్యాహ్నం సమయంలో నీరివ్వకూడదు -మల్చింగ్ లేదా నేలను తవ్వడం ద్వారా భూమిలో నీటిని నిల్వ ఉంచుకొనే శక్తి పెరుగుతుంది. -మొక్క చుట్టు పాలిథిన్ షీట్లతో గాని, వరిగడ్డి లేదా ఎండు ఆకులతో గాని కప్పి ఉంచడం వల్ల నీరు ఆవిరైపోకుండా ఉంటుంది. -ఎరువులను వేసిన వెంటనే మొక్కలకు ఎక్కువగా నీరు అందించాలి. -ఇంటిలో పెరిగే మొక్కలకు గాని, బయట పెరిగే మొక్కలకు గాని, నారుమడిలో పెంచే మొక్కలను రోజ్ క్యాన్‌లో గాని, షవర్ బిగించిన పైపుతో గాని, నీరందించవచ్చు. -కాక్టస్ వంటి మొక్కలకు రోజూ నీరు ఎక్కువగా ఇవ్వకూడదు. ఇటువంటి మొక్కలకు 6 లేదా 8 రోజులకు ఒక్కసారి నీరివ్వాలి. -మొక్కల మొదళ్లలో కంపోస్ట్, వర్మీకంపోస్టు వంటి ఎరువులు వేస్తె నీటినిల్వ ఉంచుకునే శక్తి పెరుగుతుంది. n -మిద్దెతోటల్లో డ్రిప్ పద్ధతిలో నీటి వాడకాన్ని 30శాతం వరకు తగ్గించవచ్చు. ద్రవరూప ఎరువులను క్రమపద్ధతిలో అందించవచ్చు.

మల్చింగ్

మొక్కల చుట్టూ ఉండే వేర్లను ఏవేని పదార్థాలతో కప్పి ఉంచడమే మల్చింగ్. ఈ పద్ధతికి ఎండిన ఆకులు, రంపపు పొట్టు, చెరకు పిప్పి, చిన్న చిన్న గులక రాళ్ల వంటి వాటిని వాడవచ్చు. 1. మల్చింగ్ వల్ల నీటి ఆదాతో పాటు కుండీలో ఉన్న తేమను ఆవిరికాకుండా నివారిస్తుంది. 2.సూర్యరశ్మిని కలుపు మొక్కలకు లభించకుండా చేయడం వలన కలుపురాదు. 3.మొక్క చుట్టూ ఉండే నేల ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. 4.మట్టిలోని తెగుళ్ళు మరియు క్రిమికీటకాల నివారణ జరుగుతుంది. పర్యావరణం కోసం తనవంతుగా చేస్తున్న ఈ ప్రయత్నం, ప్రయా ణం తన కుటుంబసభ్యుల తోడ్పాటు వల్లే సాధ్యమైందని సాంబశివుడు ఆనందంతో,ఆత్మవిశ్వాసంతో చెప్పుకొచ్చారు.ఇతర వివరాలకు సాంబశివుడిని సంప్రదించవలసిన నెంబర్.. 9701346949. home-cultivation2

వంటింటి వ్యర్థాలతో సేంద్రియ ఎరువు

ఎరువుల కోసం మనం ఎక్కడిదాకో వెళ్లక్కరలేదు. జేబులోంచి రూపాయి కూడా ఖర్చుపెట్టనక్కరలేదు. వంటింట్లో చెత్త బుట్టలో చేరుతున్న వ్యర్థ పదార్థాలతోనే మనం సులభంగా ఎరువును తయారుచేసుకోవచ్చు. కూరగాయ తొక్కలు, ఆకుకూరల వ్యర్థాలు, పళ్ళ తొక్కలు, కుళ్లే స్వభావం ఉన్న ఏదైనా సరే ఎరువు తయారీకి ఉపయోగించవచ్చు. రోజూ వంటింటి వ్యర్థాలను కంపోస్టర్‌లో వేస్తే 90 రోజులలో చక్కటి ఎరోబిక్ కంపోస్ట్ తయారవుతుంది. దానికితోడు ఈ కంపోస్టింగ్ ద్వారా వెలువడిన ద్రావణం 20శాతానికి 80శాత నీరు కలపాలి. మన ఇంటి తోటలోని మొక్కలకు వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. దీనివలన మన ఇంటపంటకు ఇంటిపట్టునే చక్కటి సేంద్రియ ఎరువు తయారవ్వడమే కాదు, మున్సిపాలికి పెద్ద భారంగా మారిన చెత్త సమస్యకు మీ అంతట మీరే చక్కటి పరిష్కారం చూపుతున్నారన్నమాట. అందరూ వంటింటి వ్యర్థాలను చెత్తబుట్టలో పడెయ్యకపోతే,పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. -కె.క్రాంతికుమార్‌రెడ్డి, 9603214455 నేచర్స్‌వాయిస్