ఆముదంలో అంతర కృషి

castor-crop రాష్ట్రంలో వర్షాధారంగా సాగుచేసే నూనెగింజల పంటల్లో ఆముదం ముఖ్యమైనది. ప్రస్తుతం ఈ పంటలో చేపట్టాల్సిన పనులు, సస్యరక్షణ చర్యల గురించి వ్యవసాయ నిపుణులు అందించిన వివరాలు. కలుపు నివారణ, అంతరకృషి: పంట విత్తిన తర్వాత 40-60 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 15-20 రోజులకు క్విజలోఫాప్-పి-ఇథైల్ కలుపు మందును ఎకరాకు 400 మి.లీ. చొప్పున పిచికారీ చేసి గడ్డిజాతి కలుపును నివారించవచ్చు. తర్వాత దశల్లో వచ్చే కలుపును గుంటకతో వరుసల మధ్య అంతర కృషి చేసి నివారించవచ్చు. నీటియాజమాన్యం: సాధారణంగా ఆముదాన్ని వర్షాధారంగా పండిస్తారు. అయితే బెట్ట పరిస్థితుల్లో నీటి వసతి ఉంటే 1-2 తడులు ఇస్తే 15-20 శాతం దిగుబడి పెరుగుతుంది.

సస్యరక్షణ

దాసరి పురుగు: ఈ పురుగు ఆగస్టు నుంచి అక్టోబర్ మాసం వరకు పంటను ఆశించి నష్టాన్ని కలిగిస్తుంది. ఈ పురుగు మొదట ఆకులపై ఆశించి రంధ్రాలు చేసి తింటా యి. పురుగు ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకులను అంతా తిని కాడలను మాత్రమే మిగులుస్తుంది. నివారణ: తొలిదశలో పరాన్నజీవులకు హానిచేయని వేపనూనె 5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొలంలో ఎకరానికి 8-10 పక్షిస్థావరాలను ఏర్పాటు చేయాలి. పురుగు ఉధృతిని బట్టి ఎసిఫేట్ 75 ఎస్‌పి 1.5 గ్రా. లేదా థయోడికార్బ్ 1.5 గ్రా. మరియు డైక్లోరోవాస్ 1.0 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొగాకు లద్దె పురుగు: ఈ పురుగు సెప్టెంబర్ నెలలో ఆశించడం మొదలై అక్టోబర్ నెలలో తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ఈ పురుగు తొలిదశలో గుంపులుగా ఆకుల కింది భాగంలో చేరి పత్రహరితాన్ని గీకి తింటాయి. తర్వాత దశలో ఆకులపై రంధ్రాలు చేసి జల్లెడాకులుగా మారుస్తాయి. నివారణ: ఎకరాకు 4-5 లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు ఉధృతిని గమనించాలి. పురుగు తొలిదశలో క్లోరోపైరిఫాస్ 2 మి.లీ. ఉధృతి ఎక్కువైనప్పుడు నొవల్యూరాన్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. బాగా ఎదిగిన లద్దె పురుగుల నివారణకు విషపు ఎరను (5 కిలోల వరి తవుడు+500 గ్రా. బెల్లం+500 మి.లీ. క్లోరోపైరిఫాస్) వినియోగించాలి.