మాఘీ జొన్నకు ఇదే అదును

jowar-crop రాష్ట్రంలో మాఘీ జొన్న ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలో కొద్దిపాటి విస్తీర్ణంలో సాగు చేస్తారు. మాఘీలో కిన్నెర (ఎం.జె-276) రకం లేదా నిపుణులను సూచించిన ఇతర రకాలను ఎంచుకోవాలి. సెప్టెంబర్ 2వ పక్షంలోపు విత్తనం నాటడం పూర్తిచేయాలి. ఆలస్యంగా విత్తితే మొవ్వ ఈగ ఉధృతి ఎక్కువ అవుతుంది. దీనివల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఈ మొవ్వ ఈగ ఉధృతిని తట్టుకునే రకాలనే ఎంపిక చేసుకోవడం మేలు. విత్తన మోతాదు: ఎకరానికి 3-4 కిలోలు అవసరం. విత్తనశుద్ధి: మాఘీ జొన్నలో మొవ్వ ఈగ ప్రధానంగా నష్టపరుస్తుంది. దీని బారి నుంచి పంటను రక్షించుకోవడానికి ఒక కిలో విత్తనానికి 3 గ్రా. థయోమిథాక్సామ్ 70 శాతం డబ్ల్యుఎస్ లేదా 12 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ 48 ఎఫ్‌ఎస్ కలిపి విత్తనశుద్ధి చేయాలి. విత్తే దూరం: ఎద్దుల సహాయంతో నడిచే గొర్రుతో వరుసల మధ్య 45 సెం.మీ, వరుసల్లో మొక్కల మధ్య 12-15 సెం.మీ. దూరంలో విత్తాలి. ఎరువులు: ముందుగా ఎకరానికి 3-4 టన్నులు పశువుల ఎరువు వేసి ఆఖరిదుక్కిలో కలియదున్నాలి. వానకాలంలో వర్షాధారంగా సాగుచేసినప్పుడు ఎకరానికి 24 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు వేసుకోవాలి. నీటి యాజమాన్యం: సుమారు 450-600 మి.మీ. నీరు అవసరం ఉంటుంది. సాధారణంగా జొన్నను వర్షాధారంగా సాగు చేస్తారు. అయితే వర్షాభావ పరిస్థితులు ఉంటే పూత దశలో లేదా గింజ కట్టే దశలో ఒక తడి ఇస్తే మంచి దిగుబడులు తీసుకోవచ్చు.