నాయకత్వ మార్పునకు నో చాన్స్

బెంగళూరు: ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఫ్రాంచైజీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని మార్చే ప్రసక్తే లేదని కొత్తగా ఎంపికైన ఆ జట్టు క్రికెట్ డైరెక్టర్ మైక్ హెస్సెన్ స్పష్టం చేశాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోనీ ఐపీఎల్లో విజయవంతమైన కెప్టెన్‌లుగా గుర్తింపు తెచ్చుకోగా.. కోహ్లీ మాత్రం ఒక్కసారి కూడా జట్టుకు టైటిల్ సాధించలేకపోయాడనే విమర్శల నేపథ్యంలో.. నాయకత్వ మార్పు ఉండదని హెస్సెన్ కుండబద్దలు కొట్టాడు. విరాట్ సారథ్యం అంశంపై ప్రశ్నే తలెత్తలేదు. జయాపజయాలు కేవలం కెప్టెన్ ఒక్కడి చేతిలోనే ఉండవు. గత పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకొని కోహ్లీ మరింత మెరుగైన కెప్టెన్సీ చేస్తాడనే నమ్మకముంది అని హెస్సెన్ తెలిపాడు. Hesson

ట్రైనర్‌గా శంకర్ బసు

టీమ్‌ఇండియా మాజీ ట్రైనర్ శంకర్ బసు ఆర్‌సీబీ శిక్షణ బృందంలో చేరాడు. నాలుగేండ్ల పాటు జాతీయ జట్టుకు సేవలందించిన బసు వచ్చే సీజన్‌లో కోహ్లీసేనకు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. భారత మాజీ ఆటగాడు, ఆస్ట్రేలియా జట్టు మాజీ స్పిన్ కోచ్ శ్రీధరన్ శ్రీరామ్ ఆర్‌సీబీ జట్టుకు బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ఎన్నికయ్యాడు. ఆడమ్ గ్రిఫ్ఫిత్‌ను బౌలింగ్ కోచ్‌గా.. ఎవెన్ స్పీైచ్లె ఫిజియోగా నియమించినట్లు ఆర్‌సీబీ గురువారం తెలిపింది. బెంగళూరు జట్టుకు సైమన్ కటిచ్ చీఫ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.