శరత్-సాతియాన్ జోరు

Satiyan
-ఆసియన్ టీటీ చాంపియన్‌షిప్
న్యూఢిల్లీ : భారత పురుషుల ద్వయం సాతియాన్ జ్ఞానశేఖరన్ - ఆచంట శరత్ కమల్ ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియన్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో 11-8, 11-6, 11-3తో మఫూద్ సయీద్, రషీద్(బెహ్రయిన్)పై సునాయాస విజయంతో ముందడుగేశారు. క్వార్టర్ ఫైనల్లో లియాంగ్ జింగ్‌కున్ - లిన్ గవాయున్(చైనా)తో ఈ భారత ద్వయం పోటీ పడుతుంది. అంతకుముందు సాతియాన్-శరత్‌కు తొలి రౌండ్‌లో బై లభించగా.. రెండో రౌండ్‌లో 11-4, 11-7, 11-7 తేడాతో అబో యమన్‌జైద్ - అల్ద్‌మైజీ జేయద్(జోర్డాన్)పై గెలుపొందారు. అయితే మరో భారత ద్వయం హర్మీత్ దేశాయ్ - అంథోనీ అమల్‌రాజ్‌కు కూడా తొలి రౌండ్‌లో బై లభించగా.. తర్వాతి పోటీలో 11-5, 7-11, 11-3, 8-11, 6-11 తేడాతో చైనా జోడీ చేతిలో పోరాడి పరాజయం పాలయ్యారు. మహిళల డబుల్స్‌లోనూ మనిక - అర్చన తొలి రౌండ్‌లో గెలిచినా తర్వాత పోటీలో 6-11, 9-11, 7-11 తేడాతో కొరియా జోడీ యంగ్ హుయీన్ - జియాన్ జీ చేతిలో ఓడారు. మధురిక - సుతీర్థ కూడా ఓడిపోయారు. మిక్స్‌డబుల్స్ రెండో రౌండ్‌లో శరత్ కమల్ - మనిక, సాతియాన్ - అర్చన్ జోడీ ఓటములు ఎదుర్కొన్నారు.