మణిందర్ మ్యాజిక్

PKL
-హర్యానాపై బెంగాల్ విజయం
పుణె: రైడర్ మణిందర్ సింగ్ (18 పాయింట్లు) అదరగొట్టడంతో ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగాల్ వారియర్స్ పదో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. గురువారం ఇక్కడ జరిగిన పోరులో బెంగాల్ 48-36తో హర్యానా స్టీలర్స్‌పై గెలుపొందింది. మణిందర్‌తో పాటు రైడింగ్‌లో ప్రపంజన్ (7 పాయింట్లు) ఆకట్టుకోగా.. ట్యాక్లింగ్‌లో బల్దేవ్ సింగ్ (6 పాయింట్లు) హై-ఫై సాధించాడు. స్టీలర్స్ తరఫున వినయ్ (14 పాయింట్లు), వికాస్ కండోలా (9 పాయింట్లు) రైడింగ్‌లో రాణించినా.. బలహీనమైన డిఫెన్స్‌తో మూల్యం చెల్లించుకుంది. ఈ విజయంతో బెంగాల్ (63 పాయింట్లు) పాయింట్లు మెరుగు పర్చుకొని రెండో స్థానంలోనే ఉండగా.. హర్యానా 54 పాయింట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. మ్యాచ్ తొలి అర్ధభాగంలోనే రెండు సార్లు ఆలౌటైన హర్యానా.. తిరిగి కోలుకోలేకపోయింది. రైడింగ్‌లో ఇరు జట్లు సమానంగానే నిలిచినా.. ట్యాక్లింగ్‌లో బెంగా ల్ అదర గొట్టింది. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి 30-14తో నిలిచిన బెంగాల్.. ఆధిక్యాన్ని కొనసాగించుకుంటూ అలవోకగా గెలుపొందింది.