విరాట్‌ విజయం

kohli
- అజేయ అర్ధసెంచరీతో విజృంభణ - దక్షిణాఫ్రికాపై భారత్‌ ఘన విజయం
టీమ్‌ఇండియా అదరగొట్టింది. వరుస విజయాల జోరును సొంతగడ్డపై కొనసాగించింది. తమకు తిరుగులేదన్న రీతిలో చెలరేగుతూ ప్రత్యర్థి దక్షిణాఫ్రికాను పడగొట్టింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ సఫారీలపై పైచేయి సాధించింది. డికాక్‌, బవుమా బ్యాటింగ్‌తో పోరాడే స్కోరు అందుకున్న దక్షిణాఫ్రికా..బౌలింగ్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. తనకు అచ్చొచ్చిన మొహాలీ గడ్డపై విరాట్‌ కోహ్లీ మరోమారు జూలు విదిలిస్తూ సఫారీలను వేటాడిన తీరు అభిమానులను కట్టిపడేసింది. సహచర ధవన్‌, అయ్యర్‌ అండతో చెలరేగిన కోహ్లీ అజేయ అర్ధసెంచరీతో జట్టుకు భారీ విజయాన్ని కట్టబెట్టాడు. మరో మ్యాచ్‌ మిగిలున్న సిరీస్‌లో కోహ్లీసేన ముందంజ వేసింది. మొహాలీ: వరుణుడి కారణంగా ధర్మశాల మ్యాచ్‌ రద్దయిందని నిరాశలో ఉన్న అభిమానులకు మొహా లీ మ్యాచ్‌ అసలు సిసలైన మజా అందించింది. బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ ల సిరీస్‌లో కో హ్లీసేన 1-0తో ముందడుగు వేసింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ మరో ఓవర్‌ మిగిలుండగానే 3 వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(52 బంతుల్లో 72 నాటౌట్‌, 4ఫోర్లు, 3సిక్స్‌లు) అజేయ అర్ధసెంచరీతో కదంతొక్కాడు. ఫెల్కువాయో(1/20), శంసీ(1/19), ఫోర్టీన్‌ (1/32) ఒక్కో వికెట్‌ తీశారు. తొలుత డికాక్‌ (37 బంతుల్లో 52, 8ఫోర్లు), బవుమా(43 బంతుల్లో 49, 3ఫోర్లు, సిక్స్‌) రాణింపుతో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 149/5 స్కోరు చేసింది. దీపక్‌ చాహర్‌(2/22)కు రెండు వికెట్లు దక్కగా, సైనీ(1/34), జడేజా(1/31), హార్దిక్‌(1/31) ఒక్కో వికెట్‌ తీశారు. అర్ధసెంచరీతో జట్టుకు విజయాన్ని కట్టబెట్టిన కోహ్లీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' దక్కింది. ఇరు జట్ల మధ్య ఆఖరిదైన మూడో మ్యాచ్‌ బెంగళూరులో ఈనెల 22న జరుగుతుంది.

విరాట్‌ వీరవిహారం:

సఫారీలు నిర్దేశించిన లక్ష్యఛేదనకు దిగిన భారత్‌కు..రోహిత్‌శర్మ(12) రూపంలో ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండు భారీ సిక్స్‌లతో ఊపుమీద కనిపించిన హిట్‌మ్యాన్‌ను ఫెల్కువాయో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన కోహ్లీ..ధవన్‌(40)కు జతకలిశాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్‌ నుంచి బయటపడ్డ కోహ్లీ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ధవన్‌ సహకారంతో తనదైన శైలిలో బ్యాటు ఝులిపించిన కోహ్లీ ఎదురైన బౌలర్‌నల్లా బాదుతూ లక్ష్యాన్ని అంతకంతకు కరిగించుకుంటూ పోయాడు. మరో ఎండ్‌లో ధవన్‌ కూడా ఫామ్‌లోకి వచ్చే ప్రయత్నం చేశాడు. ఇన్నింగ్స్‌ జోరందుకున్న తరుణంలో శంసీ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయిన ధవన్‌.. బౌండరీ వద్ద మిల్లర్‌ సూపర్‌ క్యాచ్‌తో నిష్క్రమించాడు. దీంతో రెండో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్‌ పడింది. ఫామ్‌లేమితో సతమతమవుతున్న పంత్‌(4) మరోమారు నిరాశపరిచాడు. బౌండరీతో టీ20 కెరీర్‌లో 22వ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ చూడచక్కని షాట్లతో అలరించాడు. రబాడ 18వ ఓవర్లో కొట్టిన సిక్స్‌ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. మరోవైపు తానేం తక్కువ కాదన్నట్లు అయ్యర్‌ బౌండరీతో మ్యాచ్‌ను ముగించాడు.

డికాక్‌, బవుమా విజృంభణ:

డికాక్‌ మరోమారు తన ప్రతాపం చూపించాడు. ఫోర్‌తో పరుగుల ఖాతా తెరిచిన డికాక్‌..తన ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పాడు. హెండ్రిక్స్‌(6)ను దీపక్‌ చాహర్‌ ఔట్‌ చేసి వికెట్ల ఖాతా తెరిచాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి దక్షిణాఫ్రికా వికెట్‌ నష్టానికి 39 పరుగులు చేసింది. డికాక్‌కు బవుమా జతకలిసిన తర్వాత స్కోరుబోర్డు ఊపందుకుంది. బవుమా..హార్దిక్‌ను లక్ష్యంగా చేసుకుంటూ చెలరేగడంతో 10 ఓవర్లు ముగిసే సరికి సఫారీ స్కోరు 78కి చేరింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని సైనీ విడగొట్టాడు. డికాక్‌..కోహ్లీ సూపర్‌ క్యాచ్‌తో ఔటయ్యాడు. డస్సెన్‌(1) జడేజాకు వికెట్‌ ఇచ్చుకోవడంతో జట్టు కష్టాల్లో పడింది. ఆఖరి నాలుగు ఓవర్లలో దక్షిణాఫ్రికా 24 పరుగులకే పరిమితమైంది. kohli1

కమాల్‌ క్యాచ్‌

కోహ్లీ కండ్లు చెదిరే క్యాచ్‌ పట్టాడు. అర్ధసెంచరీతో ఊపుమీదున్న సఫారీ కెప్టెన్‌ డికాక్‌ను ఒంటిచేత్తో క్యాచ్‌ పట్టి పెవిలియన్‌ పంపాడు. తనకు దూరంగా వెళుతున్న బంతిని కోహ్లీ అందుకున్న తీరు అతని ఫిట్‌నెస్‌ స్థాయి ఏంటో చూపుతున్నది.

స్కోరుబోర్డు

దక్షిణాఫ్రికా: హెండ్రిక్స్‌(సి)సుందర్‌(బి)చాహర్‌ 6, డికాక్‌(సి)కోహ్లీ(బి)సైనీ 52, బవుమా(సి)జడేజా(బి)చాహర్‌ 49, డస్సెన్‌(సి&బి) జడేజా 1, మిల్లర్‌(బి) హార్దిక్‌ 18, ప్రిటోరియస్‌స 10 నాటౌట్‌, ఫెల్కువాయో 8 నాటౌట్‌; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 149/5; వికెట్ల పతనం: 1-31, 2-88, 3-90, 4-126, 5-129; బౌలింగ్‌: సుందర్‌ 3-0-19-0, చాహర్‌ 4-0-22-2, సైనీ 4-0-34-1, జడేజా 4-0-31-1, హార్దిక్‌ 4-0-31-1, కృనాల్‌ 1-0-7-0. భారత్‌: రోహిత్‌(ఎల్బీ) ఫెల్కువాయో 12, ధవన్‌(సి)మిల్లర్‌(బి)శంసీ 40, కోహ్లీ 72 నాటౌట్‌, పంత్‌(సి)శంసీ(బి)ఫోర్టీన్‌ 4, అయ్యర్‌ 16 నాటౌట్‌; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 19 ఓవర్లలో 151/3; వికెట్ల పతనం: 1-33, 2-94, 3-104; బౌలింగ్‌: రబాడ 3-0-24-0, నోర్టె 3-0-27-0, ఫెల్కువాయో 3-0-20-1, ప్రిటోరియస్‌ 3-0-27-0, శంసీ 3-0-19-1, ఫోర్టీన్‌ 4-0-32-1.