అపార కరుణామూర్తి కాలభైరవుడు!

భక్తుల పాలిట కల్పతరువై, ఆశ్రితుల వ్యాధులను, కష్టాలను పోగొడుతూ భక్త రక్షణే నిత్యకృత్యంగా చేసుకొని వెలసిన అపార కరుణామూర్తి శ్రీ కాలబైరవస్వామి.ఈ కాలభైరవుడు కామారెడ్డి జిల్లా ఇసన్నపల్లి (రామారెడ్డి) గ్రామానికి ఈశాన్య దిక్కులో వెలిశాడు. ఒకప్పుడు ఈ గ్రామానికి అష్టదిక్కుల్లో అష్టభైరవులు ఉండేవారు. వీరు ఎప్పుడూ గ్రామాన్ని రక్షిస్తూ ఉంటారని ప్రజల నమ్మకం. అష్టభైరవులలో ప్రధానుడే శ్రీ కాలభైరవస్వామి. మిగతా ఏడు భైరవ విగ్రహాలు కాలక్రమేణా కనుమరుగైపోయాయి. శ్రీ కాలబైరవస్వామి తన తండ్రి పేరుగల ఈశాన్య దిక్కునే ఎంచుకొని నిరంతరం గ్రామాన్ని రక్షిస్తూ భక్తుల కోరికలు నెరవేరుస్తూ లోకరక్షణ చేస్తున్నాడని ఇక్కడి ప్రజల నమ్మకం.
రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి (రామారెడ్డి) గ్రామంలో ఉన్న శ్రీ కాళభైరవస్వామి జన్మదిన రథోత్సవ ఉత్సవాలు ప్రతీ సంవత్సరం నవంబర్ నెలలో ఘనంగా నిర్వహిస్తారు. వారం రోజుల పాటు ఈ ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేస్తారు. ప్రతీ మంగళవారం స్వామి వారికి ఘనంగా సిందూర పూజలు నిర్వహిస్తారు. స్వామివారిని నాలుగు వారాలు వివిధ రకాల లక్ష పుష్పాలు, స్వీట్లు, కూరగాయలు, పండ్లు, నోట్ల దండలతోపాటు అప్ప డాలతో అలంకరిస్తారు. అనారోగ్యంతో ఉన్న భక్తులు 41 రోజులు పాటు ఆల యం వద్ద ఉండి బావి వద్ద స్నానాలు చేసి ఉదయం, సాయంత్రం రెండు పూటలా స్వామి వారికి జలాభిషేకం చేస్తారు. దీంతో వారు ఆరోగ్యవంతులు అవుతరని అపార నమ్మకం.

ఆలయ స్థల పురాణం

క్రీస్తుశకం 1760లో ఈ ప్రాంతాన్ని రాజన్నచౌదరి అనే సంస్థానాధీశుడు భిక్కనూరును రాజధానిగా చేసుకొని రామారెడ్డి, దోమకొండను పరిపాలించినట్టు దోమకొండ చరిత్ర చెబుతున్నది. దోమకొండ అగ్రహారానికి చెందిన రామారెడ్డి, కామారెడ్డి అనే అన్నదమ్ములకు శ్రీ కాళభైరవస్వామి కలలో దర్శనమిచ్చి వారి తో తన విగ్రహం కాశీ క్షేత్రంలో ఉందని, వెంటనే వచ్చి తీసుకెళ్లండని, అది ఎక్కడ కింద పడితే అక్కడ వదిలి దూరం వెళ్లి పొండని చెప్పి అదృశ్యమయ్యాడని పెద్ద లు చెబుతున్నారు. అన్నదమ్ములు ఇద్ద రూ నిద్ర నుంచి మేల్కొని సేవకులను వెంట తీసుకొని ఎడ్లబండ్లపై కాశీ క్షేత్రానికి బయలుదేరి అక్కడ ఉన్న స్వామి వారి దివ్య మంగళ విగ్రహాన్ని అతికష్టం మీద ఎడ్లబండిపై తీసుకువస్తుండగా ఎడ్లబండి ఇసన్నపల్లి (రామారెడ్డి) గ్రామానికి రాగా నే బండికి కట్టిన ఎడ్లు తాళ్లను తెంపుకొని దూరంగా పరిగెత్తాయట. అప్పుడు భూమి కంపించి ఉరుములు, మెరుపులతో వర్షం ప్రారంభం కావడంతో ఎడ్లబండిని అక్కడే నిలిపివేసేలోపే బండి, స్వామి వారి విగ్రహం భూమిలోకి దిగిపోయింది. అప్పటి నుంచి శ్రీ కాళభైరవుడు ఇసన్నపల్లి (రామారెడ్డి) గ్రామాల మధ్య ఈశాన్యంలో కొలువై పూజలు అందుకుంటున్నాడు. విస్సారెడ్డి పేరుతో విసన్నపల్లి గ్రామాన్ని కట్టిచ్చి ఉండవచ్చునని పూర్వీకులు చెపుతున్నారు. విసన్నపల్లి అని అప్పట్లో పిలిచేవారని వృద్ధుల మాట. పూర్వం ఇదే పేరుతో పిలువబడినప్పటికీ ప్రస్తుతం ఈ గ్రామం ఇసన్నపల్లిగా పిలువబడుతున్నది.

మూల బావి ప్రత్యేకత

శ్రీ కాలభైరవస్వామి ఆలయానికి ఇసన్నపల్లి (రామారెడ్డి) గ్రామాల మధ్య ఈశాన్య దిశలోని మూలబావికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ బావిలోని నీటితో భక్తులు స్నా నాలు చేసి తడిబట్టలతో స్వామి వారిని దర్శించుకోవడమే కాకుండా స్వామి వారికి మూలబావి నుంచి నీటిని బిందెలలో తీసుకువెళ్లి స్వామి వారికి జలా భిషేకం చేస్తే ఆరోగ్య సమస్యలు, సంతా నం, కోరికలు, చేతబడి వంటి రుగ్మతలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. బావి పక్కనే కోనేరును సైతం పూర్వకాలంలోనే నిర్మించారు. అనారోగ్యంతో బాధపడే భక్తులు ఆలయంలో ఉండి ఉదయం, సాయంత్రం రెండు పూటలా స్వామి వారికి జలాభిషేకం చేస్తారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు సమస్యను బట్టి 21 లేదా 41 రోజులు ఆలయంలోనే ఉండి పూజలు చేస్తే ఆ సమస్యలు మటుమాయవుతాయని భక్తుల విశ్వాసం.

ఇలా చేరుకోవచ్చు..

శ్రీ కాలభైరవస్వామి ఉత్సవాలకోసం ఆలయానికి వచ్చే భక్తులు కామారెడ్డి, నిజామాబాద్ డిపోల నుంచి బస్సులను నడుపుతారు. కామారెడ్డి పాత బస్టాండు, రైల్వేస్టేషన్ నుంచి ఉత్సవాలకు ప్రత్యేక బస్సులను ఉదయం నుండి రాత్రి వరకు నడుపుతారు. కామారెడ్డి నుంచి ఇసన్నపల్లి (రామారెడ్డి) ఆలయానికి 12 కిలోమీటర్ల దూరం.
More