పాడి పశువులు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు..

గద్వాల: జిల్లా కేంద్రంలో పాడి పశువుల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి చేతులమీదుగా రైతులకు 410 ఆవులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. గద్వాల వాసులు చాలా అదృష్ట వంతులు. నేను ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. నేను చాలా ప్రయత్నించినప్పటికీ.. రైతులకు ఆవులను అందించలేకపోయా. కానీ, కృష్ణ మోహన్ రెడ్డి మాత్రం ఆవుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు. ఇవి మిలిటరీ ఆవులు. రైతులు కేవలం వెయ్యి రూపాయలు సబ్సిడీ కట్టి ఆవులను పొందుతున్నారు. ఈ జాతి ఆవులు చాలా విలువైనవని మంత్రి అన్నారు. ఆవులు పొందిన రైతులు పాలను విజయ డైరీకే అమ్మాలని ఆయన సూచించారు. బయటికంటే లీటరుకు 4 రూపాయలు ఎక్కువ వస్తాయని మంత్రి హరీష్ అన్నారు. ఆర్థిక మాంద్యం మనపై కూడా ప్రభావం చూపించింది. వోట్ ఆన్ అకౌంట్ కి, సాధారణ బడ్జెట్ కి 30 వేల కోట్లు తేడా వచ్చింది. కానీ రైతులకు అందించే రైతుబంధుకు సీఎం ఎలాంటి లోటు లేకుండా చూడాలని ఆదేశించారన్నారు. గద్వాలలో రైతుబంధు రాని రైతులకు నాలుగు రోజుల్లో పంపిణీ చేస్తామన్నారు. మన రాష్ట్రంలో రైతుల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ 38,615 కోట్ల రూపాయలు.ఈ సారి రైతుల ధాన్యం దిగుబడి ఉమ్మడి రాష్ట్ర దిగుబడి కన్నా రికార్డ్ స్థాయిలో ఉంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులు తమ పంటను ప్రభుత్వ మార్కెట్లో నే అమ్మాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్దానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Related Stories:

More