ఫ్లిప్‌కార్ట్‌లో బాగా ఆలస్యమవుతున్న వస్తువుల డెలివరీ..!

బెంగళూరు: ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా దసరా పండుగ సందర్భంగా బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నిర్వహించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే గత ఏడాది కన్నా ఈ సారి పెద్ద ఎత్తున వినియోగదారులు అనేక రకాల వస్తువులను కొనుగోలు చేశారు. సేల్‌లో ఇచ్చిన అనేక ఆఫర్లను ఉపయోగించుకున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ.. ఆ సేల్‌లో కొనుగోలు చేసిన వస్తువులు ఇంకా డెలివరీ కాలేదు. ఓ వైపు దసరా పండుగ ముగిసినా తాము ఆర్డర్ చేసిన వస్తువులు ఇంకా రాలేదని ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ ఆర్డర్లను ఇప్పుడు వారు ఎక్కడ క్యాన్సిల్ చేస్తారేమోనని సెల్లర్లకు భయం పట్టుకుంది. ఫ్లిప్‌కార్ట్‌లో వినియోగదారులు ఆర్డర్ చేసిన వస్తువులను డెలివరీ చేసేందుకు ప్రస్తుతం చాలా సమయం పడుతోంది. చాలా వరకు వస్తువులకు 7 నుంచి 10 రోజుల వరకు సమయం పడుతోంది. మరోవైపు అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను నిర్వహించినా.. ఆ సంస్థ కేవలం 3 నుంచి 5 రోజుల్లోనే వస్తువులను డెలివరీ చేస్తోంది. ఇక ప్రైమ్ మెంబర్లకు 1-2 రోజల్లోనే వస్తువులు డెలివరీ అవుతున్నాయి. కానీ ఫ్లిప్‌కార్ట్ మాత్రం వస్తువుల డెలివరీ విషయంలో చాలా వెనుకబడింది. ఈ క్రమంలో మరో వైపు దీపావళికి బిగ్ దివాలీ సేల్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ మరో రెండు రోజుల్లో నిర్వహించనుండడంతో.. అసలు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ఆర్డర్లను చాలా ఉన్నాయని, ఆ వస్తువులే ఇంకా డెలివరీ కాలేదని, ఇక బిగ్ దివాలీ సేల్‌లో వినియోగదారులు వస్తువులను కొనుగోలు చేస్తే వాటి డెలివరీ ఇంకా ఆలస్యమవుతుందని, దీంతో వినియోగదారులు ఆర్డర్లను క్యాన్సిల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని మర్చంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వస్తువుల డెలివరీ విషయంలో చురుగ్గానే పనిచేస్తున్నామని, వస్తువులను పికప్ చేసుకుని డెలివరీ చేసే వరకు ప్రాసెస్ వేగంగానే జరుగుతున్నదని ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇక బిగ్ దివాలీ సేల్ అనంతరం ఫ్లిప్‌కార్ట్‌లో వస్తువుల డెలివరీకి ఎంత సమయం తీసుకుంటుందో చూడాలి..!

Related Stories:

More