ప్రజా సమస్యలపై ఉత్తమ్‌కు అవగాహన లేదు: జగదీశ్‌రెడ్డి

హుజూర్‌నగర్: హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, గాదారి కిషోర్, శంకర్‌నాయక్, టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డిలతో కలిసి మేల్లచెరువు మండలం హేమలతండాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభివృద్ధి నిరోధకుడని విమర్శించారు. ఉత్తమ్‌ను నమ్ముకుంటే హుజూర్‌నగర్ నియోజకవర్గ ప్రజలను నట్టేట ముంచాడు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సుభిక్షంగా ఉంటే హుజూర్‌నగర్‌లో మాత్రం ఉత్తమ్ చేతకాని తనం వల్ల అభివృద్ధి కనబడటం లేదు. చాలా తండాల్లో సీసీ రోడ్లు కూడా లేవు. టీఆర్‌ఎస్ పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. హుజూర్‌నగర్‌లో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తాం. సైదిరెడ్డి యువకుడు, స్థానికుడు. సైదిరెడ్డిని గెలిపించి హుజూర్‌నగర్‌ను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. తన కుటుంబానికి పదవుల యావ తప్ప ప్రజా సమస్యలపై ఉత్తమ్‌కు అవగాహన లేదు. ప్రజలను మభ్యపెట్టి ఎంపీ ఎన్నికల్లో గెలిచిన ఉత్తమ్‌కు ఈ ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు.

Related Stories:

More